Corona 2.0: తెలంగాణ ప్రజలకు మంత్రి ఈటల హెచ్చరిక.. కొత్త వైరస్ చాలా డేంజర్

ఈటల రాజేందర్ (ఫైల్)

Corona New strain: మొదట వచ్చిన కరోనాతో ప్రమాదమేమి లేదని మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. కానీ కొత్తరకం స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Share this:
    కొత్త రకం కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. యూకేలో బయటపడిన కరోనా కొత్త స్ట్రెయిన్ మళ్లీ అలజడి రేపుతోంది. ఈ క్రమంలోనే యూకేతో ప్రపంచ దేశాలు సంబంధాలు తెరచుకున్నాయి. విమాన సర్వీసులను నిలిపివేశాయి. ఐతే ఇప్పటికే బ్రిటన్ నుంచి భారత్‌కు వచ్చిన వారిలో పలువురికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలోనూ ఈ కొత్త వైరస్ కలకలం రేపుతోంది. యూకే నుంచి వచ్చిన కొందరికి కరోనా రావడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. వారందరినీ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించింది. ఐతే అది కొత్త వైరసా? కదా? అనేది తేలాల్సి ఉంది. పుణె వైరాలజీ ల్యాబ్ నుంచి రిపోర్ట్ వస్తేనే మరింత స్పష్టత వస్తుంది. ఈ క్రమంలో కొత్త రకం వైరస్‌పై తెలంగాణ ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

    కరోనా సెకండ్ వేవ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. శనివారం కరీంనగర్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన... మొదట వచ్చిన కరోనాతో ప్రమాదమేమి లేదని పేర్కొన్నారు. కానీ కొత్తరకం స్ట్రెయిన్ ప్రమాదకరంగా ఉందని ఆయన వెల్లడించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులను అయినా ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. ఇతర దేశాల నుండి వచ్చిన వారిని గుర్తించి కరోనా పరీక్షలు చేయగా.. కొందరికి పాజిటివ్ నిర్ధారణ అయిందని ఆయన చెప్పారు. ఐతే అది కొత్త స్ట్రెయిన్ కరోనా లేక పాత కరోనా అన్నది ఇంకా నిర్దారణ కావడానికి కొంత సమయం పడుతుందని వెల్లడించారు.. ప్రస్తుత పరిస్థితులు ప్రమాదకరంగానే ఉన్నాయని..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు.

    డిసెంబర్ 9 నుండి ఇప్పటి వరకు 1216 మంది బ్రిటన్ నుంచి వచ్చారని.. వీరిలో 937 మందిని గుర్తించి కరోనా పరీక్షలు నిర్వహించామని శనివారం తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటివరకు ఫలితాలు వచ్చిన వారిలో 18 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారిలో హైదరాబాద్ నుంచి నలుగురు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి నలుగురు, జగిత్యాల జిల్లా కు చెందిన ఇద్దరు, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ జిల్లా నుంచి ఒక్కొక్కరు ఉన్నట్టు చెప్పారు. 18 మందిని వివిధ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డులో ఉంచామని వెల్లడించారు. పాజిటివ్ వచ్చిన వారి శాంపిల్స్‌ను సీసీఎంబీ ల్యాబ్‌కు పంపించారు.


    మరోవైపు తెలంగాణలో సాధారణ కరోనా వైరస్ ప్రభావం తగ్గుతోంది. నిన్న కొత్తగా 317 కేసులు మాత్రమే వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 2,84,391కి చేరింది. నిన్న కొత్తగా ఇద్దరు చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1529కి చేరింది. తెలంగాణలో మరణాల రేటు 0.53 శాతానికి చేరింది. దేశంలో మరణాల రేటు 1.4 శాతంగా ఉంది. తెలంగాణలో నిన్న కొత్తగా 536 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 2,76,244కి చేరింది. తెలంగాణలో రికవరీ రేటు మరింత పెరిగి 97.13 శాతానికి చేరింది. దేశంలో అది 95.8 శాతంగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6618 ఉండగా... వాటిలో 4535 మంది ఇళ్లలోనే ఉంటూ ట్రీట్‌మెంట్ పొందుతున్నారు
    Published by:Shiva Kumar Addula
    First published: