Khammam : కొంపముంచుతున్న మున్సిపల్ ఎన్నికలు ..ఖమ్మం సర్కారు దవాఖానాలో ఒకరు పోతేనే ఇంకోకరికి బెడ్

మంత్రి అజయ్ కుమార్ ఫైల్ ఫోటో

Khammam : రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికలు ముగిశాక ఆయా నగరాల్లో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. విచ్చలవిడి ఎన్నికల ప్రచారం అనంతరం అనేక మంది కరోనా భారిన పడుతున్నారు. దీంతో ఆయా జిల్లాల్లో బెడ్స్ దోరకని పరిస్థితి నెలకొంది.

  • Share this:
ఖమ్మం జిల్లా జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు కరస్పాండెంట్‌

తమ్మీ నీకు ఎప్పుడు అవసరం పడినా నేనున్నానని మర్చిపోకు.. ఒక్క ఫోన్‌ కొట్టు చాలు అంటూ భుజం మీద చెయ్యేసి కబుర్లు చెప్పి అరచేతిలో వైకుంఠం చూపిన లీడర్లు.. తీరా ఓట్లు వేయించుకని గెలిచాక.. ఇప్పుడు ఫోన్‌ చేసినా ఆన్సర్‌ చేయని దుస్థితి. మునిసిపల్‌ కార్పోరేషన్‌ ఎన్నికల సమయంలో గల్లీ లీడరు మొదలు.. కార్పోరేటరు అభ్యర్థులు.. ఇంకా ఆపైన లీడర్లు సైతం ఎప్పుడు ఏ అవసరం ఉన్నా ఫోన్‌ కొట్టండంటూ పదేపదే చెప్పినా.. తీరా ఎన్నికలు అయిపోయి కరోనా పాజిటివ్‌ వచ్చిన పేషంట్లు ఫోన్‌ చేసి.. కనీసం ఒక బెడ్‌ ఇప్పించండంటూ వేడుకుంటున్నా పట్టించుకున్న పరిస్థితి లేదు.

పక్షం రోజుల పాటు డివిజన్లలో అభ్యర్థుల వెంట తిరిగిన పార్టీల అభిమానులు, చిన్నపాటి లీడర్లలో చాలా మందికి తాజాగా కోవిడ్‌ పాజిటివ్‌గా తేలుతోంది. నిత్యం కరోనా లక్షణాలతో టెస్టులు చేయించుకుంటున్న వారి సంఖ్య వందల్లో ఉంటుండగా.. వాటిలో సగానికి పైగా పాజిటివ్‌గా తేలుతున్నాయి. దీంతో వైద్యం కోసం అటు ప్రభుత్వ ఆసుపత్రిలో బెడ్లు దొరక్క.. ఇటు ప్రవేటులో వైద్యం చేయించుకునే స్థోమత లేక కొందరు ఇప్పటికే ప్రాణాలు పోగొట్టుకోగా.. ఇంకా కొందరు కొట్టుమిట్టాడుతున్నారు.

మొత్తంమీద ఖమ్మం మున్సిపల్‌ ఎన్నికల దెబ్బకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. పోలింగ్‌ రోజు అనంతరం చేయించుకన్న టెస్టులో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు పాజిటివ్‌ రాగా ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లిపోయి.. పదిరోజులకు కోలుకుని సోమవారం ఖమ్మం చేరుకున్నారు. ఇక గెలిచిన కార్పోరేటర్లు.. ఓడిపోయిన అభ్యర్థులు.. వారి పక్కన తిరిగిన అనుచరులు, పార్టీ కార్యకర్తలకు పాజిటివ్‌లు వచ్చిన కేసుల సంఖ్య ఎక్కువే. వీరిలో సీరియస్‌గా ఉండి వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ పెట్టాల్సిన పరిస్థితి ఉండి.. బెడ్లు అందని వారి సంఖ్య లెక్కకట్టలేని పరిస్థితి.

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో 320 కరోనా బెడ్లు ఉండగా.. వాటిలో 80 జనరల్‌ బెడ్లు.. 190 ఆక్సిజన్‌ బెడ్లు.. 20 ఐసీయూ.. 30 వెంటిలేటర్‌ బెడ్లున్నాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా ఖాళీగా లేని దుస్థితి. మరొక రోగికి ఎమర్జెన్సీగా ఉండి బెడ్‌ దొరకాలంటే.. అప్పటికే ఉన్న రోగికి వ్యాధి తగ్గి డిశ్చార్జి కావాలి.. లేదా చనిపోవాలి.. అప్పుడు మాత్రమే మరొకరికి బెడ్‌ దొరికే పరిస్థితి ఉంది.

దీనికితోడు రెమిడెసివర్‌ ఇంజెక్షన్‌ కేవలం ప్రభుత్వ ఆసుపత్రిలో అడ్మిట్‌ అయిన వారికి మాత్రమే ఇస్తామంటుండడంతో దీనికి మరింత డిమాండ్‌ పెరిగింది. ఒకవేళ ప్రవేటు ఆసుపత్రిలో చేరితే రెమిడెసివర్‌ ఇంజెక్షన్‌ రోగి ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. దీనికి రూ.40 వేల నుంచి 70 వేల దాకా వసూలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఎప్పకప్పుడు ఎంఆర్‌పీ రేట్లకే రెమిడెసివర్‌ ఇంజెక్షన్‌ ఇస్తున్నట్టు ప్రకటనలు వెల్లువెత్తడం.. ఆచరణలో పేషంట్‌ జేబు గుల్ల కావడం ఆగడం లేదు. రోగి ఊపిరి అందక విలవిల్లాడుతుంటే .. రెమెడెసివర్‌ ఇంజెక్షన్‌ కోసం బేరాలు చేస్తుండడం.. పరిస్థితిని బట్టి మరింత రేటు పెంచడం జరుగుతోంది.

ఊపిర ఆడని సమయంలో అవసరమయ్యే రెమిడెసివర్‌ ఇంజెక్షన్లు పేషంట్‌ తెచ్చుకునే హామీతోనే చేర్చుకుంటున్నారు. అన్నీ రోగి సంబంధీకులే ఎరేంజ్‌ చేసుకున్నా.. కేవలం ఆక్సిజన్‌ పెట్టి లక్షలకు లక్షలు బిల్లులు చేతిలో పెడుతున్న పరిస్థితి ఉంది. దీంతో బెంబేలెత్తడం బాధితుల వంతవుతోంది. నిన్నటిదాకా మున్సిపల్‌ ఎన్నికల్లో అవసరమైతే నేనున్నానంటూ చెప్పిన నేతలు ఇప్పుడు అవసరానికి పలకని పరిస్థితి ఉంది. ఇంతలోనే ఇంత మార్పా అనుకుంటూ ప్రాణాలు ఉగ్గపట్టి ఆసుపత్రుల్లో చేరడం సామాన్యుడు వంతవుతోంది.
Published by:yveerash yveerash
First published: