Corona at Huzurabad : హుజూరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు...ఎన్నికల ప్రచారంపై ఎఫెక్ట్...?

Corona at Huzurabad : హుజూరాబాద్‌లో పెరుగుతున్న కరోనా కేసులు...

Corona at Huzurabad : హుజూరాబాద్ ఎన్నికలు మరో నాగార్జున సాగర్ కానుందా..ఎన్నికల హాడావిడిలో నాయకులు, ప్రజలు కరోనా నిబంధనలు గాలికి వదిలివేస్తున్నారా... ? హుజూరాబాద్‌లో అందుకే కేసులు పెరుగుతున్నాయా... హుజూరాబాద్‌లో వైద్యాధికారుల సమీక్ష వెనుక మతలబు ఏమిటీ..?

 • Share this:
  కరోనా నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించడంతో దేశ వ్యాప్తంగా కరోనా భారిన పడి అనేక మంది మృత్యువాతపడ్డారు.కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశంలోని పశ్చిమబెంగాల్‌తో పాటు ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాయి.....దీంతో పాటు రాష్ట్రంలోని నాగార్జున సాగర్‌లో సైతం ఉప ఎన్నికలు నిర్వహించారు. అయితే ఈ ఉప ఎన్నికల్లో సాధారణ ప్రజలతోపాటు ఎన్నికల విధుల్లో పాల్గోన్న ఉద్యోగులు సైతం కరోనా భారిన పడి తమ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కేంద్ర ఎన్నికల కమీషన్‌పై సుప్రీం కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

  అయితే ఇప్పుడు ఇదే పరిస్థితి రాష్ట్రంలోని హుజూరాబాద్ నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఎన్నికల సంఘం ఇంకా షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికి ఖాలీ అయిన అసెంబ్లీ స్థానాలను ఆరు నెలల లోపు భర్తి చేయాలనే నిబంధనతో స్థానిక పార్టీలు హుజూరాబాద్‌లో పెద్ద ఎత్తున మాకాం వేశాయి. ఈ క్రమంలోనే హుజూరాబాద్ ఎన్నికలు ప్రధాన పార్టీలకు జీవన్మరణ సమస్యగా పోరాటం చేస్తున్నారు. రానున్న సాధరణ ఎన్నికలకు రెఫరెండం గా భావిస్తున్న పార్టీలు పెద్ద ఎత్తున ప్రజల మద్దతును కూడగడుతున్నారు. దీంతో వేలాది మంది ప్రజలతో సభలు సమావేశాలు కొనసాగుతున్నాయి.

  అయితే కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే తగ్గుతున్న వేళ ఇలాంటీ సభలు సమావేశాలు మరో వేవ్‌కు వేదికలుగా మారనున్నట్టు సంకేతాలను వెలువడుతున్నాయి.ఇందుకు నిదర్శనంగా రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నా హుజూరాబాద్‌లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి. ఇలా గత పది రోజుల్లో మొత్తం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో నమోదైన కేసుల్లో 35శాతం ఒక్క హుజూరాబాద్ నియోజకవర్గాల్లోనే నమోదయ్యాయి. గత 12 రోజుల్లో ఆయా ఆర్భన్ సెంటర్లలో యాంటిజెన్ టెస్టులు చేయగా, సుమారు 1100 మందికి జిల్లా వ్యాప్తంగా కరోనా సోకింది.

  అయితే వీటిలో కేవలం హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని మండలాల్లోనే 375 కేసులు నమోదు అయ్యాయి. అంటే.. 35 శాతం కేసులు ఇక్కడే నమోదయ్యాయి. ముఖ్యంగా హుజూరాబాద్ మండలంలోని 250 కేసులు నమోదు కాగా ఇతర మండలాల్లో మరో వంద కేసులు నమోదయ్యాయి.ఈ సంఖ్య గ్రేటర్ హైదరాబాద్ కంటే చాలా ఎక్కువ అని వైద్యాధికారులు చెబుతున్నారు. దీన్ని బట్టి కరోనా ప్రభావం హుజూరాబాద్‌లో చాలా స్పష్టంగా కనిపిస్తోంది.

  దీంతో రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరక్టర్ శ్రీనివాస రావు, వైద్యశాఖ డైరక్టర్ రమేష్ రెడ్డి సీఎం ఓఎస్డీ గంగాధర్‌లు హుజూరాబాద్‌లో కరోనా పరిస్థితులపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసులు పెరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై స్థానిక వైద్యాధికారులతో చర్చించారు. ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్న పరిణామాలపై తీసుకోవాల్సిన అంశాలపై స్థానిక వైద్యులకు పలు సూచనలు చేశారు.

  మరోవైపు కరోనా థర్డ్ వేవ్ ముప్పు ముంచుకు వస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పలు సూచనలు చేస్తున్నారు. ఈ పరిణామాల క్రమంలోనే ప్రధాని నరేంద్రమోడి సైతం ముఖ్యమంత్రులతో నేడు వర్చువల్ సమావేశం ఏర్పాటు చేసి కరోనా పరిస్థితులపై చర్చించారు. థర్డ్ వేవ్‌పై ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. కాని పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా హుజూరాబాద్‌లో కనిపిస్తోంది.

  కరోనా నిబంధనలు పాటించకుండా నియోజకవర్గంలో ర్యాలీలు, సభలు సమావేశాలు ఏర్పాటు చేయడంతో భారి ఎత్తున ప్రజలు కరోనా భారిన పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.అయితే ఇది కేవలం హుజూరాబాద్ మీదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. కాగా ఇది కట్టడి కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సి అవసరం ఎంతైనా ఉంది..మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఉప ఎన్నికలపై ఓ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడే నియోజకవర్గంలో కరోనా ప్రభావాన్ని తగ్గించేందుకు అవకాశం ఉంది.
  Published by:yveerash yveerash
  First published: