Telangana News: ఇక ఆ మూడు జిల్లాలు సస్యశ్యామలం.. ప్రభుత్వ ఆదేశాలే తరువాయి.. విషయం ఏంటంటే..

సీతారామ ఎత్తిపోతల పథకం

Telangana news: తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం తర్వాత అతి పెద్ద సాగునీటి, తాగునీటి ప్రాజెక్టు సీతారామ ఎత్తిపోత పథకం. దశలవారీగా ఎత్తిపోసే విధానంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదటి, రెండు పంప్‌హౌస్‌లలో ఐదు మోటార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    (జి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం జిల్లా, న్యూస్‌18 తెలుగు)

    సీతారామ ఎత్తిపోతల పథకం. ప్రత్యేక రాష్ట్రంలో కాళేశ్వరం తర్వాత అతి పెద్ద సాగునీటి, తాగునీటి ప్రాజెక్టు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల్లోని 6,74,387 ఎకరాలకు సాగునీరు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. గతంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తలపెట్టిన దుమ్ముగూడెం ఇందిరాసాగర్‌, దుమ్ముగూడెం రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టులను రీడిజైన్‌ చేసి ప్రస్తుత ప్రాజెక్టును రూపొందించారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక కేసీఆర్‌ తొలి ప్రభుత్వంలో కీలకంగా ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దీనిపై క్షేత్ర స్థాయిలో పరిశీలించి నీరందని బీడు భూములకు నీరందించేలా.. అప్పటికే ఉన్న ఆయకట్టుకు సాగునీటిని స్థిరీకరణ అయ్యేలా డిజైన్‌ను ఆమోదింపజేశారు. ఆరు ప్యాకేజిలుగా విభజించిన ఈ పనుల్లో ఇప్పటికే తొంబై శాతం పూర్తవగా సీతారామ ప్రాజెక్టులో కెనాల్‌ పనులు దాదాపు 80 శాతం, మొదటి మూడు పంప్‌హౌస్‌లు తొంబైఐదు శాతం, ఇలా మొత్తంగా ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తయినట్టే. దశలవారీగా ఎత్తిపోసే విధానంలో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని మొదటి, రెండు పంప్‌హౌస్‌లలో ఐదు మోటార్లు డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నాయి.

    అశ్వాపురం మండలంలోని దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ఎత్తిపోతల ద్వారా తొమ్మిది వేల క్యూసెక్కుల నీటిని 243.20 కిలోమీటర్ల దూరం గ్రావిటీ ద్వారా కాల్వల నుంచి పాలేరు రిజర్వాయరుకు తరలించనున్నారు. ఇలా మొత్తం వర్షాకాలం సీజన్‌లో 70.40 టీఎంసీల నీటిని ఎత్తిపోయడం ద్వారా ఈ మూడు జిల్లాల్లో కొత్తగా 3,28,853 ఎకరాలకు కొత్తగా సాగునీరు, 3,45,534 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనున్నాయి. వెరసి ఈ మూడు జిల్లాల్లోని లక్షల ఎకరాలకు సాగునీటి వనరుగా ఈ ప్రాజెక్టు మారనుంది. దీన్లో ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే 1,57,574 ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పడనుంది. ఇంకా 42,935 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరగనుంది. ఖమ్మం జిల్లాలో కొత్తగా 1,62,083 ఎకరాలకు కొత్తగా నీరు రానుండగా, 2,96,925 ఎకరాలకు నీటిని స్థిరీకరణ కానుంది. ఇక మహబూబాబాద్‌ జిల్లాలో కొత్తగా 9,196 ఎకరాలకు కొత్తగానూ, అప్పటికే ఉన్న 5,674 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనుంది. ఇలా మొత్తంమీద ఈ ప్రాజెక్టు మూడు జిల్లాల్లోని లక్షలాది మంది రైతుల జీవితాలను ప్రభావితం చేయనుంది.

    అశ్వాపురం మండలం బీమునిగుండం కొత్తూరు వద్ద 10.28 కిలోమీటరు వద్ద ఉన్న కెనాల్‌ పాయింట్‌లో తొలి పంప్‌హౌస్‌ను.. దీనికోసం ఒక్కోటి 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఆరు పంపులు, ఆరు మోటార్లు ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 23.85 మీటర్ల మేర నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన మోటార్లన్నీ డ్రైరన్‌కు సిద్ధంగా ఉన్నాయి. ఇక రెండో పంప్‌హౌస్‌ ములకలపల్లి మండలం వేపకొయ్య రామవరం గ్రామం వద్ద 45.07 కి.మీ కెనాల్‌ పాయింట్‌లో నిర్మించారు. దీన్లో ఆరు పంపులు, ఆరు మోటార్లు ఒక్కోటి నలభై మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేయగా, ఇక్కడి నుంచి 47.80 మీటర్ల మేర ఎత్తుకు నీటిని తోడనున్నారు. ఇక్కడ సైతం మోటార్లు సిద్ధం అయ్యాయి. ఇక మూడో పంప్‌హౌస్‌ను ములకలపల్లి మండలం కమలాపురం వద్ద 57.07 కి.మీ కెనాల్‌ పాయింట్‌లో.. ఏడు మోటార్లు, ఏడు పంపులు ఒక్కోటి 40 మెగావాట్ల సామర్థ్యం ఉన్నవి ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి 52.8 మీటర్ల నుంచి 92.8 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయనున్నారు. ఇక ఖమ్మం జిల్లా సత్తుపల్లి వద్ద నాలుగో పంప్‌హౌస్‌ పనులు ప్రారంభం అయ్యాయి.

    ఇలా ఎత్తిపోసే నీటిని తొలుత అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం వద్ద 200 మీటర్ల దిగువన 37 టీఎంసీల సామర్ధ్యంతో సీతమ్మసాగర్‌ బ్యారేజ్‌ నిర్మిస్తున్నారు. ఇలా లోతైన ప్రాంతంలో ప్రవహిస్తున్న గోదావరి నది నీటిని ఎత్తయిన ప్రాంతానికి పంపింగ్‌ చేయడం ద్వారా సాగునీటి వసతిని పెంచనున్నారు. ఇప్పటికే పూర్తయిన వాటికి డ్రైరన్‌ పూర్తి చేసి , డెడ్‌లైన్‌ ప్రకారం పనులు పూర్తిచేయాలని ప్రభుత్వం పట్టుదలగా ఉంది. సీఎం కేసీఆర్‌ స్వీయ పర్యవేక్షణలో సీఎంవో స్పెషల్‌ సెక్రటరీ స్మితాసబర్వాల్‌ తరచూ ఈ ప్రాజెక్టు పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షిస్తున్నారు. దీనికి చీఫ్‌ ఇంజినీరుగా పనిచేస్తున్న శ్రీనివాసరెడ్డి నిత్యం ఇక్కడే పనులను పర్యవేక్షిస్తూ అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తయ్యేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
    Published by:Veera Babu
    First published: