'సుదీర్ఘకాలం కేసీఆర్ తో కలిసున్న వ్యక్తిగా, ఆయన వ్యూహాలు ఎలా ఉంటాయో తెలిసినవాడిగా చెబుతున్నాను.. నా తర్వాత కేసీఆర్ కు టార్గెట్ కాబోయేది హరీశ్ రావే.. ’అంటూ హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఈటల రాజేందర్ చెప్పిన జోస్యం నిజం కాబోతోందంటూ గడిచిన కొద్ది గంటలుగా సోషల్ మీడియా హోరెత్తిపోతున్నది. ఆర్థిక మంత్రి హరీశ్ రావుకు ఆరోగ్య శాఖ అదనపు బాధ్యతలు కట్టబెడుతూ కేసీఆర్ సర్కారు ఉత్తర్వులిచ్చిన తర్వాత హరీశ్ టార్గెట్ అయ్యారనే కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ చరిత్ర తొలి నుంచీ ఏ నాయకుడికీ అచ్చిరాని ఆరోగ్య శాఖను హరీశ్ కు కేటాయించడంపై ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.
రాత్రికి రాత్రే ఉత్తర్వులు..
అనూహ్య రీతిలో భూకబ్జా ఆరోపణలపై బర్తరఫ్ కావడానికి ముందు వరకూ ఈటల రాజేందర్ నిర్వహించిన వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రిగా తన్నీరు హరీశ్ రావు నియమితులయ్యారు. ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌కే ఆరోగ్య శాఖనూ అప్పగిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం, గవర్నర్ ఆమోదంతో మంగళవారం రాత్రే ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ కావడం, వెంటనే అవి అమల్లోకి రావడం తెలిసిందే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయం సాధించిన ఈటల బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయడానికి కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం, అచ్చిరాని శాఖగా నేతలు భావిస్తోన్న ఆరోగ్య శాఖను హరీశ్ కు కట్టబెట్టడంపై భిన్నాభిప్రాయాలు వెలువడుతున్నాయి..
అచ్చిరాని ఆరోగ్య శాఖ
హరీష్ రావును కేసీఆర్ టార్గెట్ చేశారని, అందుకే అచ్చిరాని ఆరోగ్య శాఖను కేటాయించారని కొందరు కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణలో ఆరోగ్య శాఖ గండంగా మారిందని, ఆ శాఖ నిర్వహించిన వారు తర్వాత తమ పదవిని కోల్పోయారని చెబుతున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి ఆరోగ్య శాఖా మంత్రిగా డాక్టర్ తాటికొండ రాజయ్య పని చేశారు. ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ వైద్యశాఖను నిర్వహించిన ఆయన.. అవమానకర పరిస్థితుల్లో కొద్ది రోజులకే పదవిని కోల్పోయారు. రాజయ్య తర్వాత జడ్చర్ల ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డికి వైద్యశాఖ మంత్రిగా అవకాశం దక్కింది. మూడున్నరేళ్లు ఆరోగ్య మంత్రిగా పనిచేసిన లక్ష్మారెడ్డికీ తర్వాతి కాలంలో షాక్ తగిలింది..
ఆ శాఖ తీసుకుంటే అంతే!
2018 అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష్మారెడ్డి గెలిచినా ఆయనకు కేబినెట్ బెర్త్ దక్కలేదు. రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చాలా రోజులపాటు ఆరోగ్య శాఖ ఖాళీగానే ఉంది. తర్వాత ఈటల రాజేందర్ కు వైద్యశాఖను కేటాయించారు సీఎం కేసీఆర్. అయితే రెండేళ్లలోనే కేసీఆర్ తో విభేదాలు తీవ్రం కావడం, భూకబ్జా ఆరోపణలపై ఈటలను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేశారు. ఈ ఏడాది జులై నుంచీ వైద్యశాఖ ఖాళీగానే ఉంది. ఇప్పటివరకు వైద్యశాఖను నిర్వహించిన వారంతా తిరిగి పదవి దక్కించుకోలేకపోయారు. దీంతో తెలంగాణలో వైద్యశాఖ అచ్చిరాదనే చర్చ ఉంది.
హరీశ్‌కూ ఈటల గతి
ఈటల బర్తరఫ్ తర్వాత వైద్య ఆరోగ్య శాఖను సీఎం కేసీఆరే తన వద్దే పెట్టుకున్నారు. అదే సమయంలో, కొవిడ్ టీకా పంపిణీ, ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ సరఫరా వ్యవహారాలను పర్యవేక్షించాలని హరీశ్‌కు సీఎం సూచించారు. ఈటల రాజీనామా తర్వాత హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచార బాధ్యతనూ ఆయనకే అప్పగించారు. ఎన్నికల ప్రచారంలో హరీశ్‌పై ఈటల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తనకు పట్టిన గతే హరీశ్‌కూ పడుతుందని వ్యాఖ్యానించారు. అయితే, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ఓటమి తర్వాత హరీశ్ ప్రాధాన్యం తగ్గుతుందనే ప్రచారం జరిగినప్పటికీ, దానికి విరుద్దంగా హరీశ్ రావుకు సీఎం కేసీఆర్ మరో శాఖను అదనంగా కేటాయించడంతో ప్రాధాన్యం తగ్గలేదని సంకేతాలిచ్చారు. కానీ ఇచ్చిన శాఖపైనే ఇప్పుడు కామెట్లు వస్తున్నాయి.
సెంటిమెంట్ కొనసాగుతుందా?
ఆరోగ్య శాఖకు సంబంధించి 2014 నుంచి జరిగిన పరిణామాల ఆధారంగానే హరీశ్ విషయంలో ఈరకమైన కామెంట్లు వస్తున్నాయి. హరీశ్ కు కావాలనే అచ్చిరాని ఆరోగ్యశాఖను ఇచ్చారని కొందరు, సెంటిమెంట్ ప్రకారం వచ్చే ఎన్నికల తర్వాత ఆయన పదవి కోల్పోవడం ఖాయమని ఇంకొందరు, టీఆర్ఎస్ లో ఈటల తర్వాత కేసీఆర్ తర్వాతి టార్గెట్ హరీశే అని మరికొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈటల నిర్వహించిన శాఖలనే సీఎం కేసీఆర్ హరీశ్ రావుకు అప్పగించారు. టీఆర్‌ఎస్ తొలి ప్రభుత్వంలో ఈటల ఆర్థిక శాఖ మంత్రిగా పని చేశారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పాటయ్యాక వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రెండు శాఖలనూ ఇప్పుడు హరీశ్‌కు అప్పగించారు. నిజానికి కేసీఆర్ కుటుంబీకుడిగా హరీశ్ రావుపై కఠిన చర్యలకు ఆస్కారం ఉండదనీ కొందరు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Etela rajender, Harish Rao, Health minister, Telangana News, Trs