హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: కోదండరామ్‌ విషయంలో కాంగ్రెస్ డైలమా.. సాయం చేస్తుందా ? హ్యాండ్ ఇస్తుందా ?

Telangana: కోదండరామ్‌ విషయంలో కాంగ్రెస్ డైలమా.. సాయం చేస్తుందా ? హ్యాండ్ ఇస్తుందా ?

కోదండరామ్ (పైల్ ఫోటో)

కోదండరామ్ (పైల్ ఫోటో)

Telangana: మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నా.. నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల తరపున బరిలో ఉన్న కోదండరామ్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

వచ్చే ఏడాది జరగబోయే రెండు పట్టుభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థులుగా ఎవరిని నిలపాలనే దానిపై తెలంగాణ కాంగ్రెస్ తర్జనభర్జన పడుతోంది. వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల నుంచి తాను పోటీ చేస్తానని మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ పార్టీ నాయకత్వాన్ని కోరుతున్నట్టు సమాచారం. మరో నేత బెల్లయ్య నాయక్ సైతం ఇందుకోసం పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఈ జిల్లాలకు చెందిన మరో రెడ్డి వర్గం నేత కూడా పోటీలో ఉండేందుకు సుముఖంగా ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరికొందరు నేతలు మాత్రం కోదండరామ్‌కు మద్దతు ఇవ్వడమే మంచిదనే భావనలో ఉన్నారు.

అయితే ఆయన కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేస్తే మద్దతు ఇద్దామని మరికొందరు నేతలు కాంగ్రెస్ నాయకత్వానికి సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కోదండరామ్‌కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వడంపై ఎటూ తేల్చుకోలేకపోతోందనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో మరికొంతకాలం వేచి చూడటమే మంచిదనే భావనలో ఆ పార్టీ ఉన్నట్టు కనిపిస్తోంది. ఇందుకు సంబంధించి ఏర్పడిన జీవన్ రెడ్డి కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోంది. మరోవైపు మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించిన అభ్యర్థి ఎంపిక విషయంలోనూ కాంగ్రెస్ ఎటూ తేల్చుకోలేకపోతోంది.

ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు కాంగ్రెస్ నేతలు మాజీ ఎమ్మెల్యేలు చిన్నారెడ్డి, వంశీచంద్ రెడ్డి, సంపత్‌తో పాటు దాసోజు శ్రవణ్ కూడా పార్టీ నాయకత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఎవరికి వస్తుందనే దానిపై ఆసక్తి నెలకొంది. వచ్చే ఏడాది జరగబోయే ఈ రెండు స్థానాల్లో గెలిచేందుకు అటు టీఆర్ఎస్, ఇటు బీజేపీ చాలా రోజుల నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. మిగతా ఎన్నికల తరహాలోనే ఈ ఎన్నికల్లోనూ పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్యే ఉంటుందనే వార్తలు వినిపిస్తున్నప్పటికీ.. తాము రేసులో నిలిచి సత్తా చాటాలని కాంగ్రెస్ భావిస్తోంది.

ఇందులో భాగంగానే బలమైన అభ్యర్థులను బరిలోకి దింపాలని ఆ పార్టీ యోచిస్తోంది. అయితే సాధారణంగానే అభ్యర్థుల విషయంలో పోటీ ఎక్కువగా ఉండే కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థిని ఎంపిక చేయడం అంత ఈజీ కాదనే వాదన వినిపిస్తోంది. మొత్తానికి మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ సంగతి ఎలా ఉన్నా.. నల్లగొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల తరపున బరిలో ఉన్న కోదండరామ్ విషయంలో కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

First published:

Tags: Kodandaram, Telangana