Cm kcr-Janareddy: కేసీఆర్ చెప్పిందే కరెక్ట్.. అందుకే కాంగ్రెస్‌కు ఓటేయాలన్న జానారెడ్డి

కేసీఆర్, జానారెడ్డి (ఫైల్ ఫోటో)

Cm kcr-Janareddy: అభివృద్ధి జరిగింది అంటే టీఆర్ఎస్‌కే ఓటేయాలన్న కేసీఆర్.. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తానని గతంలో అనేకసార్లు హామీ ఇచ్చారని జానారెడ్డి అన్నారు.

  • Share this:
    కాంగ్రెస్ హయాంలోనే నాగార్జునసాగర్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని తామే చేశామని టీఆర్ఎస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటుందని వ్యాఖ్యానించారు. హాలియాలో 200 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు జానారెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఉపఎన్నిక కోసమే హడావుడిగా నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని నెల్లికల్ లిఫ్ట్ సహా అనేక పనులు ప్రారంభించారని జానారెడ్డి ఆరోపించారు. అభివృద్ధి జరగకపోతే టీఆర్ఎస్ పార్టీని ఓడించాలన్న కేసీఆర్ మాటకు ప్రజలు కట్టుబడాలని జానారెడ్డి సూచించారు. అభివృద్ధి జరిగింది అంటే టీఆర్ఎస్‌కే ఓటేయాలన్న కేసీఆర్.. పాలమూరు,రంగారెడ్డి ప్రాజెక్టులు రెండేళ్లలో పూర్తి చేస్తానని గతంలో అనేకసార్లు హామీ ఇచ్చారని జానారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడేళ్లయినా వాటికి అతీగతీ లేదని ఆరోపించారు.

    మరోవైపు జానారెడ్డి తీరుపై మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. జానారెడ్డి తనకు తాను పెద్ద నాయకుడిని అని ఊహించుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. జానారెడ్డి 35 ఏళ్ళ రాజకీయ జీవితంలో చేసిన నిర్వాకం ప్రజలందరికీ తెలుసని విమర్శించారు. మాటల్లో, ప్రజా సమస్యల పరిష్కారంలో పెద్దరికం ఉండాలని.. వయస్సులో కాదని జానారెడ్డిపై ధ్వజమెత్తారు. 2018లోనే సాగర్ ప్రజలు జానారెడ్డికి సరైన సమాధానం చెప్పి ఇంటికి పంపారన్న మంత్రి జగదీష్ రెడ్డి.. ఈ విషయాన్ని జానారెడ్డి గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్ అభివృద్ధి, నల్లగొండ జిల్లా అభివృద్ధిపై చర్చకు రావాలని కోరితే జానారెడ్డి వెనకడుగు వేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్‌ నాయకులు జిల్లాను ఏ విధంగా భ్రష్టు పట్టించారో, ఏ విధంగా ఫ్లోరైడ్ మహమ్మారిని జిల్లా మెత్తం విస్తరించేలా చేసారో ప్రజలకు తెలుసని మంత్రి జగదీష్ అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: