జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్-18 తెలుగు, ఖమ్మం జిల్లా
సింగరేణి.. దాదాపు సగం తెలంగాణను కవర్ చేస్తున్న విస్తారమైన ప్రాంతం. పూర్వపు ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో విస్తరించి ఉన్న సింగరేణి కార్మికసంఘం ఎన్నికల్లో ఆధిపత్యం కోసం అన్ని సంఘాలు తమ వంతు ప్రయత్నం చేస్తుంటాయి. ప్రస్తుతం 2017లో గెలుపొందిన టీజీబీకేఎస్ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) గుర్తింపు సంఘంగా ఉండగా.. మరోసారి పట్టు నిలుపుకోవాలన్న ఆరాటం ఈ సంఘంలో కనిపిస్తోంది. అయితే సుధీర్ఘకాలం సింగరేణి గుర్తింపు సంఘంగా వెలుగొందిన ఏఐటీయూసీ మరోసారి ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది.
ఇక మరో జాతీయ సంఘం అయిన కాంగ్రెస్ అనుబంధ ఐఎన్‌టీయూసీ ఈసారి తాడోపేడో తేల్చుకోవాలన్న కసితో ఇప్పటికే పావులు కదుపుతోంది. ఈ ప్రాంతంతో సుధీర్ఘకాల అనుబంధం ఉన్న, కార్మికలోకంతో మమేకం అవుతారన్న పేరున్న సీతక్క కు ఈ ఎన్నికల నిమిత్తం కీలక బాధ్యతలు అప్పగించాలని పార్టీ సూత్రప్రాయంగా ఒక ఆలోచనకు వచ్చినట్టు తెలుస్తోంది. టీపీసీసీలో పెనుమార్పులు జరగడం.. దూకుడుగా ఉంటారని పేరున్న రేవంత్‌రెడ్డికి టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు అప్పగించడంతో సహజంగానే ఆయనకు దగ్గరగా ఉండే నేతల్లో జోష్ నిండింది. వరుసగా హుజూరాబాద్ అసెంబ్లీ ఎన్నికలు.. ఆతర్వాతే సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలను ఎదుర్కోవాల్సి రావడంతో వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకోడానికి కొత్త బృందం ఇప్పటికే కార్యాచరణను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.
మరికొద్దిరోజుల్లో సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు జరుగుతాయని తెలుస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సన్నద్ధమవుతోంది. కాంగ్రెస్ అనుబంధ కార్మిక సంఘమైన ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ ఆఫ్ కాంగ్రెస్ (ఐఎన్‌టీయూసీ)కి రాష్ట్ర గౌరవ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను నియమించే అవకాశం స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటికే యూనియన్‌లో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకోవడం జరిగిందని, కొద్దిరోజుల్లోనే అధికారికంగా ప్రకటన వెలువడుతుందని చెబుతున్నారు. ఇక ఆమె నియామకం లాంఛనమేనని, సాధ్యమైనంత త్వరలో అధిష్ఠానం నుంచి ప్రకటన వెలువడుతుందని పేర్కొంటున్నారు.
సీతక్కే ఎందుకంటే…
సింగరేణి గనులున్న భూపాలపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, మణుగూరుతో పాటు మిగతా ప్రాంతాల్లోని కార్మికులతో సీతక్కకు ప్రత్యక్ష సంబంధాలున్నాయి. గతంలో సింగరేణి సమస్యలపై ఆమె అసెంబ్లీలోనూ గళం వినిపించారు. సీతక్క పోరాటతత్వం కూడా సింగరేణి కార్మికులను యూనియన్ వైపు మొగ్గు చూపేలా చేస్తుందన్న ఆలోచనతో పార్టీ అధిష్ఠానం ఆమె నియామకానికి ఆసక్తి చూపుతున్నట్లుగా తెలుస్తోంది.
ఇక సింగరేణి భూ గర్భ గనులు ఎక్కువగా మందమర్రి, గోదావరిఖని, మంచిర్యాల, చెన్నూరు, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, ఇల్లందు, మణుగూరుతో పాటు మరికొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి, ఇల్లందు, కొత్తగూడెం, భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. గెలిచిన అభ్యర్థులు ఆ తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఇక ఆ విషయం పక్కన పెడితే.. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించడంలో కార్మిక వర్గం ఓట్లే కీలకమయ్యాయి.
గెలిచి తీరాలనే లక్ష్యంతో ఐఎన్‌టీయూసీ..
2017లో జరిగిన ఎన్నికల్లో టీబీజీకేఎస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక హామీలిచ్చినా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదన్న అభిప్రాయం ఎక్కువమంది కార్మికుల్లో ఉన్న మాట వాస్తవం. త్వరలో జరగబోయే సింగరేణి ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఐఎన్‌టీయూసీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. గుర్తింపు సంఘం ఎన్నికల్లో గెలిచి తీరాలనే లక్ష్యంతో పావులు కదుపుతోంది.
దీనికి తోడు 2017 అక్టోబర్ 5న ఎన్నికలు జరగగా.. బైలా ప్రకారం 2సంవత్సరాల్లోగా మళ్లీ నిర్వహించాల్సి ఉంది. ధ్రువీకరణ పత్రం ఆరు నెలలు ఆలస్యంగా అందజేశారనే వాదనతో 2020 ఏప్రిల్ మాసం వరకు పదవీకాలంలో ఉండేలా టీబీజీకేఎస్ కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తెచ్చుకుంది. అయితే ఆ గడువు ముగిసి కూడా ఇప్పటికే 20 నెలలు పూర్తయినా ఎన్నికల నిర్వహణకు చర్యలు లేకపోవడం గమనార్హం. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం హైదరాబాద్ గవర్నర్ భవన్, లేబర్ కమిషనర్ కార్యాలయం ఎదుట కార్మిక సంఘాలు ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ఎన్నికలను తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆందోళన ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే ఈసారి జరిగే ఎన్నికల్లో ఎవరిది పైచేయి అవుతుందోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, MLA seethakka, Singareni