Raventh Reddy: మీరే డేట్ ఫిక్స్ చేసి.. ఒక గంట ముందు ఫోన్ చేసి నాకు చెప్పండి చాలు.. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు

ఆర్మూర్ లో పసుపు రైతులకు మద్దతుగా రేవంత్ రెడ్డి

నిజామాబాద్ అంటే నిజాంసాగ‌ర్ నీరు, రైతాంగం గుర్తుకు వ‌స్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ అంటే ఆత్మ గౌర‌వంతో బ్రతికే ప‌చ్చకండువా క‌ప్పుకున్న ప‌సుసు రైతులు గుర్తుకు వ‌స్తారని ఆయన తెలిపారు. కేంద్రం తీసుకు వ‌చ్చిన‌ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతులు పోరాడుతున్నారు.

  • Share this:
    పసుపు బోర్డును తీసుకువస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, తన మాటను నిలబెట్టుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. పసుపు బోర్డు కోసం ఉద్యమిస్తున్న రైతులకు సంఘీభావంగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో కాంగ్రెస్‌ నేతలు శనివారం ‘రాజీవ్‌ రైతు భరోసా’ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ’ప్రతి మ‌నిషి జీవితంలో ప‌సుపు ఎంతో ముఖ్యమైనది. యాంటిబ‌య‌టిక్ గా కూడా పసుపును వాడుతుంటారు. ఇంత‌టి విసిష్టత క‌లిగిన ప‌సుపు పంట‌ను పండించే రైతుకు మాత్రం మద్ధతు ధర లేక నష్టపోతున్నారు. పసుపు పంటకు కనీసం 15వేల మద్దతు ధర తీసుకువస్తానని గత ఎన్నికల్లో ధర్మపురి అర్వింద్ హామీ ఇచ్చారు. ఎన్నికల్లో గెలిచారు. ఆయన ఆ హామీని నిలబెట్టుకోవాలి.‘ అని అన్నారు. ప‌సుపు రైతుల క‌ష్టాలు విన్నాననీ, తాను దీక్షకు వ‌చ్చేట‌ప్పుడు చిమ‌ల దండు లాగా రైతులు దారిపోడువున తనకు సంఘీభావం తెలిపారని గుర్తు చేసుకున్నారు.

    ’నేను రైతుల కోసం ఏమైనా చేస్తా. ప‌సుపు బోర్డు, ప‌సుపు పంట‌కు మద్ధతు ధ‌ర కోసం పార్ల‌మెంట్ లో గ‌లం విప్పుతా. రైతు పోరాటం ఇక్కడ కాదు డిల్లీలో చేద్దాం. మీరు ఎలా వెళ్దామంటే అలా వెళ్దాం. తారీఖు ఫిక్స్ చేసి ఒక గంట ముందు ఫోన్ చేసి నాకు చెప్పండి. మీతో కలిసి వస్తా. మీకు కావాల్సిన ఏర్పాట్లు చేస్తా. పసుపు రైతుల కష్టాల గురించి రాహూల్ గాంధీతో మాట్లాడి, పార్లమెంట్ లో చర్చకు వచ్చేలా చేస్తా. నిజామాబాద్ అంటే నిజాంసాగ‌ర్ నీరు, రైతాంగం గుర్తుకు వ‌స్తుంది. ఆర్మూర్ అంటే ఆత్మ గౌర‌వంతో బ్రతికే ప‌చ్చకండువా క‌ప్పుకున్న ప‌సుసు రైతులు గుర్తుకు వ‌స్తార‌ు. కేంద్రం తీసుకు వ‌చ్చిన‌ నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ రైతులు పోరాడుతున్నారు. రైతులకు మొదట మద్దతు తెలిపిన సీఎం కేసీఆర్‌ ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ రాష్ట్ర రైతాంగాన్ని దగా చేస్తున్నార‌ు‘ అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

    రైతు పొరాట‌ల‌తో రాష్ట్రం మెడ‌లు వంచి ఎర్రజొన్న బ‌కాయిల‌ను వ‌సులు చేసిన‌ నిజామాబాద్‌, ఆర్మూర్‌ రైతులు నేడు కష్టాల కడలిలో మునిగిపోయారని రేవంత్ వాపోయారు. ప్రభుత్వం చేతిలో మోసపోయి రైతులు శవాలుగా మారుతుంటే పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాన్న ఎంపీ అర్వింద్‌ హామీలు ఏమైపోయాయి అని ఆయ‌న‌ ప్రశ్నించారు. ఇప్పటికైనా ప‌సుపు రైతుల స‌మ‌స్యల ప‌రిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల‌ని ఆయ‌న డిమాండ్ చేసారు.

    ఒక ఎక‌రం ప‌సుపు పంట‌ను పండించేంద‌కు అయ్యే ఖ‌ర్చును బ‌ట్టి మద్దతు ధర కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అన్నారు. గ‌తంలో ప‌సుపు పంట‌కు ఉన్న మద్దతు ధర ఈ రోజు లేకపోవడం బాధాకరమని ఆయన వాపోయారు. 2014లోఎంపీగా గెలిచిన‌ కవిత ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్‌ పసుపు బోర్డు తెస్తామని, మద్దతు ధర కల్పిస్తామని రాతపూర్వక హామీ ఇచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంకా కార్యరూపం దాల్చలేదని గుర్తుచేసారు. పసుపు పంట‌కు మద్దతు ధర కల్పించేంత వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెస్తూ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందన్నారు. ఈ సందర్భంగా దీక్షలో కూర్చున్న శాసనమండలి సభ్యుడు జీవన్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్‌, మాజీ విప్ ఈరవత్రి అనిల్ కు ఎంపీ రేవంత్ రెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
    Published by:Hasaan Kandula
    First published: