వర్షాలతో హైదరాబాద్‌తో పాటుగా రాష్ట్రమంతటా అతులకుతలం అవుతుంటే.. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్ దాటి బయటకు రాకపోవడం దురదృష్టకరమని మాజీమంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తెలిపారు. వర్షాలు, వరదల సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటనలకే పరిమితం అయ్యారని ఆయన మండిపడ్డారు. బాధితులను పరమర్శించడానికి కేసీఆర్‌కు ఓపిక లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి కనీసం ఏరియల్ సర్వే చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇండ్లు కూలిపోతే ఇండ్లు కట్టిస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడేమో లక్ష రూపాయాలు ఇస్తామని అంటోందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్ లో ఇండ్లు కూలిపోయిన వారికి ఇండ్లు కట్టించాలని ఆయన డిమాండ్ చేశారు. అతివృష్టితో రైతులు అన్ని పంటలు నష్టపోయారని జీవన్ రెడ్డి అన్నారు. వరి, పత్తి, మొక్కజొన్న లు రైతులు నష్టపోయారని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రీమియం చెల్లించకపోవడంతో రైతులకు పంట నష్టపరిహారం అందడం లేదని ఆరోపించారు. పడిపోయిన పత్తిని నిలబెట్టాలని అంటున్నారని.. సూచనలు చేసేవారికి కనీస అవగాహన లేదని జీవన్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో రంగు మారిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. పంటల కొనుగోలు విషయంలో ఎలాంటి ఆంక్షలు పెట్టకూడదని అన్నారు.
పంట నష్టపోయిన వారికి ఎకరానికి రూ. 20 వేలు నష్టపరిహారం అందించాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ధాన్యంలో దొడ్డు రకం కంటే సన్న రకం పంట తక్కువగా వస్తుందని.. సన్న రకం ధాన్యానికి క్వింటాల్‌కు రూ. 2500 రూపాలు గిట్టుబాటు ధర ఇవ్వాలని అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు తోడు దొంగలు అయ్యాయని ఆయన మండిపడ్డారు. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి బాధ్యతను విస్మరిస్తున్నాడని జీవన్ రెడ్డి విమర్శించారు. ఇక్కడి పరిస్థితి కేంద్రానికి నివేదించడంలో ఆయన విఫలమయ్యారని వ్యాఖ్యానించారు. సన్న రకం ధాన్యాన్ని పెట్టాలని సీఎం కేసీఆర్ రైతులకు అంక్షాలు పెట్టారని.. సన్న రకం ధాన్యాన్ని కొనే బాధ్యత కేసీఆర్‌దే అని జీవన్ రెడ్డి అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Jeevan reddy, Telangana