Home /News /telangana /

Tollywood: సోనూసూద్‌ను చూసైనా కళ్లు తెరవండి.. టాలీవుడ్ హీరోలకు కాంగ్రెస్ నేత చురకలు

Tollywood: సోనూసూద్‌ను చూసైనా కళ్లు తెరవండి.. టాలీవుడ్ హీరోలకు కాంగ్రెస్ నేత చురకలు

సోనూ సూద్

సోనూ సూద్

టాలీవుడ్ ప్రముఖులు సోనూసూద్‌ను చూసి కళ్లు తెరవాలని భట్టి విక్రమార్క సూచించారు. ఈ కష్ట సమయంలో కరోనా బాధితులకు, పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

    సోనూ సూద్.. ఈ పేరు గురించి ప్రత్యేకమైన పరిచయం అక్కర్లేదు. గత ఏడాది లాక్‌డౌన్ నుంచి ఈయన పేరు మార్మోగిపోతోంది. కరోనా వేళ ఎవరికి కష్టమొచ్చినా వెంటనే సోనూసూద్ గుర్తొస్తారు. ఏ అండ దండా లేని సామాన్య ప్రజలే కాదు.. పెద్ద సెలబ్రిటీలకు కూడా ఇప్పుడు ఈయనే దిక్కు. అంతలా హీరో అయిపోయారు. ముఖ్యంగా కోవిడ్ రోగుల పాలిట దేవుడయ్యాడు. గత ఏడాది వలస కూలీలను సొంతూళ్లకు పంపించి, అన్నం పెట్టి ఆదుకున్న సోనుసూద్.. ఇప్పుడు ఆక్సిజన్ కోవిడ్ బాధితులకు అందించి ప్రాణాలు పోస్తున్నారు. సోనూసూద్ సేవలపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఎవరైనా దాతలుంటే.. ప్రభుత్వాలకు విరాళం ఇవ్వకూడదని, సోనూసూద్ ఫౌండేషన్‌కు ఇస్తేనే న్యాయం జరుగుతుందన్న స్థాయికి ఎదిగారు.

    కష్ట సమయంలో సోనూ సూద్ ఇంతగా సేవ చేస్తుంటే..మన తెలుగు నటీ నటులు, సినీ ప్రముఖులు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు మొదటి నుంచీ వినిపిస్తున్నాయి. గత ఏడాది కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో చాలా మంది సీఎం రిలీఫ్ ఫండ్‌కు డబ్బులు పంపించారు. కానీ సోనూ సూద్‌లా మాత్రం సాయం చేయలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఇదే అంశంపై కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. గత ఏడాది లాగే ఈసారి కూడా సోనూసూద్ కూడా ఎంతో విలువైన సేవలు అందిస్తున్నాడని.. ఆస్పత్రుల్లో బెడ్స్ ఇప్పించడం, మందులు అందించడం, ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం వంటి కార్యక్రమాలతో సోనూసూద్ నిజమైన హీరోగా నిలిచారని ప్రశంసలు కురిపించారు. టాలీవుడ్ ప్రముఖులు సోనూసూద్‌ను చూసి కళ్లు తెరవాలని సూచించారు. ఈ కష్ట సమయంలో కరోనా బాధితులకు, పేద ప్రజలకు సాయం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

    ఇక తెలంగాణ ప్రభుత్వంపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు భట్టి విక్రమార్క. కరోనా కట్టడిలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని మండిపడ్డారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ ఏం పనిచేస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు లేవని.. ప్రైవేట్ ఆస్పత్రులేమో రోగులను దోచుకుంటున్నాయని.. ఐనా ప్రభుత్వ చోద్యం చూస్తోందని విమర్శించారు. మొన్నటి వరకు లాక్‌డౌన్ పెట్టమని చెప్పి.. అకస్మాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడంతో.. ప్రజల్లో గందరగోళం నెలకొందని సీఎం కేసీఆర్‌పై భట్టి విక్రమార్క విమర్శలు గుప్పించారు. కరోనాపై పర్యవేక్షణకు పూర్తిస్థాయిలో మంత్రి ఉండాలి గానీ.. గెస్ట్ యాక్టర్‌లా రోజుకొకరు సమీక్ష చేయడమేంటని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడిన తర్వాత కూడా .. వ్యాక్సినేషన్ నిలిచిపోయిందని ధ్వజమెత్తారు భట్టి. ఈ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో వెంటనే హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bhatti Vikramarka, Congress, Coronavirus, Sonu Sood, Telangana, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు