Janareddy: అవన్నీ చేసింది కాంగ్రెస్సే.. టీఆర్ఎస్ సర్కార్ విఫలమైందన్న జానారెడ్డి

జానారెడ్డి (ఫైల్ ఫొటో)

Janareddy: రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు.

  • Share this:
    తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీమంత్రి జానారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ ఏం చేసిందని టీఆర్ఎస్ అడగడాన్ని జానారెడ్డి తప్పుబట్టారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న టీఆర్ఎస్ హామీ ఏమైందని.. 10 వేల ఎకరాలు కూడా దళితులకు ఇవ్వలేదని జానారెడ్డి మండిపడ్డారు. 10 లక్షల ఎకరాల భూమి పంచిన చరిత్ర కాంగ్రెస్‌దని... తాము ఇచ్చిన భూమి టీఆర్‌ఎస్‌ ఇవ్వాలనుకుంటే... 2 లక్షల కోట్లు పెట్టాల్సి వస్తుందని అన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోనే అభివృద్ధి జరిగిందని.. తాము చేసిన అభివృద్ధితో వచ్చిన ఆదాయాన్ని టీఆర్‌ఎస్‌ పంచిపెడుతుందన్నది గుర్తు పెట్టుకోవాలని చురకలు అంటించారు.

    మెట్రో రైలు, హైవేలు తెచ్చింది కాంగ్రెస్ కాదా అని జానారెడ్డి ప్రశ్నించారు. ఉచిత కరెంట్ ఇచ్చింది కాంగ్రెస్.. బకాయిలు మాఫీ చేసింది కాంగ్రెస్సే అని అన్నారు. తెలంగాణ ఏర్పాటు నాటికి 70 వేల కోట్ల అప్పు ఉందని...అరేండ్లలో మూడున్నర లక్షల కోట్ల అప్పు చేయడం అద్బుతమా..? అని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పాత్ర ఎంతో ఉందని ఆయన కొనియాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక పరిశ్రమలు వచ్చాయని జానారెడ్డి అన్నారు. ఆ పరిశ్రమలే ఇప్పుడు తెలంగాణాకు రాబడిని తీసుకొస్తున్నాయని ఆయన గుర్తు చేశారు.

    కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఉపాధి హామీ, రూపాయికి కిలో బియ్యం వంటి అనేక పథకాలను ఇప్పటికీ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని ఆయన అన్నారు. ప్రాంతాలకు, కుల, మతాలకు అతీతంగా కాంగ్రెస్‌ ప్రభుత్వం పాలన అందించిందని అన్నారు. తెలంగాణలో మళ్లీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
    Published by:Kishore Akkaladevi
    First published: