మునుగోడు ఉపఎన్నిక (Munugode Bypoll) నేపథ్యంలో ప్రధాన పార్టీలకు చెందిన నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. స్కామ్‌లను బయటపెడుతున్నారు. బీజేపీ నుంచి 22వేల కోట్ల కాంట్రాక్ట్ దక్కించుకున్నాడని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) పై టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. ఆయన సోదరుడు వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy)ఏకంగా మంత్రి కేటీఆర్‌ను టార్గెట్ చేశారు. ఓ మైనింగ్ కంపెనీ నుంచి మంత్రి కేటీఆర్ (Minister KTR)కు రూ.15వేల కోట్ల ముడుపులు అందాయని బాంబు పేల్చారు. ఈ ఆరోపణలపై తెలంగాణ రాజకీయల్లో రచ్చ జరుగుతోంది.
తాడిచర్ల గనుల కాంట్రాక్ట్‌ని అధిక ధరకు కోట్ చేసి ఏఎంఆర్ సంస్థకు కట్టబెట్టారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి దక్కిన కాంట్రాక్ట్‌లో ఒక్కో మెట్రిక్ టన్నుకు రూ.540గా రేటును నిర్ణయించారని.. కానీ ఏఎంఆర్ సంస్థకు మాత్రం ఏకంగా రూ.2400కి ఇప్పించారని అన్నారు. దాదాపు 4 రెట్ల అధిక ధరకు కట్టబెట్టినందుకు.. సదరు కంపెనీ నుంచి మంత్రి కేటీఆర్‌కు రూ.15 వేల కోట్లు అందాయని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయని బాంబు పేల్చారు.
మూడు రోజుల క్రితం బీజేపీ వివేక్ వెంకటస్వామి కూడా తాడిచర్ల కాంట్రాక్ట్‌పై ఇలాంటి ఆరోపణలే చేశారు. కమీషన్ల కోసమే తాడిచర్ల గనులను కేసీఆర్ (CM KCR) ప్రభుత్వం ఏఎమ్ఆర్ సంస్థకు అప్పగించిందని ఆరోపించారు. ఈ గనుల కేటాయింపులో రూ.20 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వ్యాఖ్యానించారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.20వేల కోట్లు నష్టం వాటిల్లిందని విమర్శలు గుప్పించారు. తాడిచర్ల మైన్స్‌లో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ జరపాలని వివేక్ డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారమే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టు టెండర్స్ దక్కించుకున్నారని.. ఇందులో ఎలాంటి క్విడ్ ప్రో కో జరగలేదని అన్నారు. మునుగోడులో ఓటమి భయంతోనే రాజగోపాల్ రెడ్డిపై టీఆర్ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని దుమ్మెత్తిపోశారు.
మునుగోడులో ఇప్పుడు కాంట్రాక్ట్‌ల వ్యవహారం గురించే రచ్చ జరుగుతోంది. బీజేపీ ఇచ్చే కాంట్రాక్ట్‌లకు రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయారని.. డబ్బు కోసం మునుగోడు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని కాంగ్రెస్ , టీఆర్ఎస్లు విరుచుకుపడుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి ముందునుంచీ మైనింగ్ వ్యాపారంలో ఉన్నారని.. ఎలాంటి నిబంధనలను ఆయన ఉల్లంఘించలేదని బీజేపీ ఎదురుదాడికి దిగుతోంది. మంత్రి కేటీఆరే అవినీతికి పాల్పడ్డారని.. తాడిచర్ల గనుల కేటాయింపుల్లో భారీ కుంభకోణం జరిగిందని విమర్శలు గుప్పిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy rajagopal reddy, Komatireddy venkat reddy, Munugode Bypoll, Munugodu, Munugodu By Election