Medak:మెదక్ జిల్లాలోని ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడు 40వేల రూపాయల క్యాష్తో పర్సును పోగొట్టుకున్నాడు. లేడీ కండక్టర్ బస్సులో దొరికిన పర్సును సదరు ప్రయాణికుడు అడ్రస్ తెలుసుకొని తిరిగి ఇచ్చి నిజాయితీని చాటుకుంది.
(K.Veeranna,News18,Medak)
మంచితనం కరువైపోతోంది. మనసున్న వాళ్లు ఎక్కడో ఒకరిద్దరు తప్ప పెద్దగా కనిపించడం లేదు. చేతిలో డబ్బు జారిపోతే సైలెంట్‌గా తీసి దాచుకుందామని చూసే వాళ్లే తప్ప..తిరిగి ఇచ్చేద్దామని ఆలోచించే మనస్తత్వం మచ్చుకైనా కనిపించడం లేదు. ఇలాంటి రోజుల్లో ఆర్టీసీ బస్సు(RTC BUS)లో ప్రయాణికుడు మర్చిపోయిన పర్సును తిరిగి అతనికి అందజేసింది ఓ లేడీ కండక్టర్(Lady conductor). మెదక్(Medak)జిల్లాలో ఈసంఘటన చోటుచేసుకుంది. మంచితనానికి ఇంకా రోజులు ఉన్నాయనే విషయాన్ని గుర్తు చేసింది లేడీ కండక్టర్ స్వప్న(Swapna). కండక్టర్ అంటేనే బస్సులో ఎవరు టికెట్ తీసుకున్నారో లేదో చూసుకోవడంతో పాటు..ఎవరు పాస్, ఎవరు సీనియర్ సిటిజన్, ఎవరికి చిల్లర ఇవ్వాలనే విషయాలపైనే ఆలోచిస్తుంటారు. దిగే స్టాప్, ఎక్కే స్టాప్‌లో టికెట్లు కొట్టడం, చిల్లర తీసుకోవడంతోనే డ్యూటీ సగం అయిపోతుంది. అలాంటిది తన డ్యూటీ చేస్తూనే పక్క వాళ్ల సమస్యను అర్ధం చేసుకోవడం గొప్ప విషయం.
మంచితనానికి రోజులున్నాయి..
రామాయంపేట నుంచి కల్వకుంట్లకు వెళ్లేందుకు నారాయణరెడ్డి అనే ఓ పెద్దాయన మెదక్ నుంచి సిద్దిపేటకు వెళ్లే బస్సు ఎక్కాడు. నిజాంపేట మండలం కల్వకుంట్ల గ్రామానికి చెందిన నారాయణరెడ్డి శుక్రవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తుండగా తన జేబులోని పర్సు సీట్లో పడిపోయింది. బస్సు సీటులో పడిపోయిన పర్సులో రూ.40 వేలు, రూ.20 వేల చెక్కు ఉంది. పర్సు బస్సులో పడిపోవడం గమనించని నారాయణరెడ్డి బస్సు దిగిపోయాడు. ప్యాసింజర్ దిగిపోయిన తర్వాత సీటులో పర్సు ఉండటాన్ని గమనించిన లేడీ కండక్టర్ ఆ పార్సును తన దగ్గర భద్రపరిచింది. డ్యూటీ దిగిన తర్వాత సిద్దిపేట ఆర్టీసీ అధికారులకు అందజేసింది లేడీ కండక్టర్ స్వప్న.
నిజాయితీ గుణం..
పర్సు పోగొట్టుకున్న ప్రయాణికుడు నారాయణరెడ్డికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సదరు కండక్టరు సిద్దిపేట నుంచి మెదక్ తిరుగు ప్రయాణంలో కల్వకుంట్ల వద్ద బాధితుడికి పర్సును అప్పగించారు. బస్సులో దొరికి పర్సుని బాధితుడికి అప్పగించి నిజాయతీని చాటుకున్నారు లేడీ కండక్టర్ స్వప్న. విషయం తెలుసుకున్న మెదక్ డిపో మేనేజర్ ప్రణీత్ కుమార్ లేడీ కండక్టర్ స్వప్నను అభినందించారు.
అభినందనలు..
బస్సులో ఎవరిదైన పర్సు మర్చిపోతే తనకు దొరికింది తనదే అంటూ తీసుకువెళ్లే వాళ్లు ఉన్న ఈరోజుల్లో లేడీ కండక్టర్ డ్యూటీతో పాటు మానవత్వాన్ని చాటుకున్నారు. ఓ మహిళా కండక్టర్ సాటి వ్యక్తుల వస్తువులు పోతే పడే బాధను అర్ధం చేసుకొని తిరిగి వాళ్లకు అప్పగించడం అభినందనీయమని ప్రయాణికుడు నారాయణరెడ్డి కండక్టర్ స్వప్న చేసిన మేలును మెచ్చుకున్నారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.