(సయ్యద్ రఫీ, మహబూబ్ నగర్ జిల్లా, న్యూస్ 18 తెలుగు)
ప్రస్తుతం తెలంగాణలో కరోనా మహమ్మారి కోరలు చాస్తుంది. ప్రతీ రోజు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. చాలా మంది సెల్ఫ్ లాక్ డౌన్ పాటిస్తున్నారు. అయితే కరోనా బారిన పడిన వారు ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదిస్తే లక్షల్లో ఖర్చు అవుతుంది. అలా అని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్ మెంట్ కు వెళ్తే బెడ్లు, ఆక్సిజన్, కిట్లు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదే అదునుగా భావించి కొందరు దందాకు తెరలేపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆసుపత్రిలో కోవిడ్ కిట్లను దొంగిలించి బయట విక్రయిస్తున్నాడు. ఇంటింటికీ తిరుగుతూ వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తూ దందా నడుపుతున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నాగర్ కర్నూల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షల కిట్లను దొంగలించి దందా చేస్తున్నాడు. ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నా ఔట్ సోర్సింగ్ ఉద్యోగి వైద్య అధికారులకు తెలియకుండా ఆస్పత్రిలోని కరోనా కిట్లను బయటకు తీసుకొచ్చి విక్రయిస్తున్నాడు. అతడికి వైద్యపరంగా ఎలాంటి అర్హత లేదు. ఆసుపత్రిలో సాధారణ విధులు నిర్వహించే అతడు ఇంటింటికి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసి డబ్బులు వసూలు చేస్తూ దందా నడుపుతున్నాడు.
ఒక్కొక్కరి నుంచి వేయి రూపాయలు మొదలు రెండు వేల వరకు వసూలు చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని సంబంధించిన వీడియో సామాజిక మధ్యమాల్లో వైరల్ అయ్యింది. ఇతడి లాగే ఇంకా ఎంతమంది ప్రభుత్వ ఆసుపత్రిలో కిట్లను దొంగలించి దుర్వినియోగం చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేటుగా పరీక్షలు చేసిన ఆ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు సమాచారం. అయినా పీపీఈ కిట్లు ధరించకుండా.. సరిగ్గా మాస్క్ కూడా పెట్టుకోకుండా ఇంటిటికీ వెళ్తూ కరోనా పరీక్షలు చేస్తున్నాడు.
ఒక ఇంటి నుంచి మరొకరి ఇంటికి ఇలా వెళ్లడం వల్ల బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతడు వెళ్లి పరీక్షలు నిర్వహించిన ప్రతీ ఇంటి సభ్యులు భయపడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. దీనిపై అధికారులను అడగ్గా వారు ఎవరు కూడా సరైన సమాధానం ఇవ్వడం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.