COLLECTOR VP GAUTAM WHO WENT TO PALLEPRAGATI PROGRAM IN KHAMMAM DISTRICT AND SLEPT IN THE VILLAGE SNR KMM
Telangana: పల్లెప్రగతికి కలెక్టర్ హాజరు .. పల్లెనిద్ర చేసిన జిల్లా పరిపాలనాధికారి
(కలెక్టర్ పల్లెనిద్ర)
Khammam: పల్లెలు, గ్రామాలు అభివృద్ధి చెందాలంటే అక్కడి ప్రజల సమస్యలు పరిష్కారం కావాలి. వాళ్ల సమస్యలు ప్రభుత్వానికి తెలియాలంటే జిల్లా పరిపాలన అధికారి దృష్టికి వాటిని తీసుకెళ్లాలి. కాని ఖమ్మం జిల్లాలో గ్రామసమస్యలు తెలుసుకునేందుకు ఏకంగా కలెక్టరే పల్లెబాట పట్టారు. గ్రామంలో పల్లెనిద్ర చేసిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
(G.SrinivasReddy,News18,Khammam)
తెలంగాణ(Telangana)లో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమం మొదలైంది. గ్రామాల్లో నెలకొన్న ప్రజాసమస్యల్ని క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈకార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే ఖమ్మం(Khammam) జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్(VP Gautam) బుధవారం కామేపల్లి(Kamepalli) మండలం మద్దులపల్లి(Maddulapalli)గ్రామంలో పల్లె నిద్ర చేశారు. పల్లె నిద్రకు గ్రామానికి చేరుకున్న కలెక్టర్‌కు గ్రామ ప్రజలు మేళ, తాళాల మధ్య జిల్లా కలెక్టర్‌కు ఘనస్వాగతం పలికారు గ్రామస్తులు. ఊళ్లో అడుగుపెట్టిన తర్వాత కలెక్టర్ మొదటగా జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. కలెక్టర్ వి.పి. గౌతమ్ గ్రామస్తులతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే గ్రామంలో పర్యటించి, సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరిస్తామన్నారు. గత పల్లె ప్రగతి కార్యక్రమంలో ప్రతి గ్రామంలో వైకుంఠదామాలు, నర్సరీలు, పల్లె ప్రకృతి వనాలు, సెగ్రిగేషన్ షెడ్లు ఏర్పాటు చేసుకున్నట్లుగా చెప్పారు. ఈసారి ప్రతి గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామంలో స్థల సేకరణ చేసినట్లు, ఈ నెల 18 వరకు పల్లె ప్రగతి కార్యక్రమం పూర్తయ్యేలోపు క్రీడా ప్రాంగణ పనులు పూర్తి చేసి వాటిని వాడుకలో తేవాలన్నారు.
గ్రామాల అభివృద్ధిపై ఫోకస్..
మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు అన్నీ విధాలుగా అభివృద్ధి పరుస్తున్నామన్నారు కలెక్టర్. ఈ సంవత్సరం నుండి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం బోధన ప్రవేశ పెడుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నాణ్యమైన ఉచిత బోధన కల్పిస్తున్నట్లు, ప్రయివేటు కు వెళ్లి, ఆర్థికంగా ఇబ్బందుల పాలుకావద్దని ఆయన అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో నమోదులు పెరిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. గ్రామంలో పల్లె దవాఖాన ఏర్పాటు చేసినట్లు, ఏఎన్ఎం ప్రతిరోజు వస్తున్నట్లు, త్వరలో డాక్టర్ నియామకం చేస్తామన్నారు కలెక్టర్ గౌతమ్. తల్లి, బిడ్డలు ఆరోగ్యపరంగా ఎలాటి సమస్యలు రాకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోసాధారణ ప్రసవాలు ప్రోత్సహించే విధంగా ప్రజలు అవగాహన పెంచుకోవాలన్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో వందశాతం సిజేరియన్ చేస్తున్నారని...ఆపరేషన్ చేయడం వల్ల తల్లి, బిడ్డకు ఆరోగ్య సమస్యలు తలెత్తున్నట్లుగా తెలిపారు కలెక్టర్. సబ్ సెంటర్లలో 57 రకాల పరీక్షల కొరకు నమూనాలు సేకరించి, ల్యాబ్‌కు పరీక్షలకు పంపుతున్నట్లు తెలిపారు.
ప్రజలకు అవగాహన ..
అంతే కాదు గ్రామాల్లో గిరివికాసం పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు కలెక్టర్. పట్టా ఉన్న భూమిలో బోర్ వేల్స్ మంజూరు చేస్తామన్నారు. గిరిజనులు క్రొత్తగా భూములు కొనుగోలు చేయవచ్చని, ధరణీ తో క్రయ విక్రయాలు సులభతరం అయ్యాయని ఆయన అన్నారు. సీతారామ ప్రాజెక్టు క్రింద ఇంకనూ పరిహారం అందక భూములు కోల్పోయిన రైతులకు సంబంధించి 58 ఎకరాలు ఆయా రైతుల పేర్ల మీద తిరిగి మార్పు చేసి, పరిహారం అందే వరకు రైతుబంధు పొందేలా చర్యలు చేపడతామన్నారు. రైతు కళ్ళాలు ఇద్దరు రైతులు మాత్రమే ఏర్పాటు చేసుకుంటున్నారని, ఎందరు దరఖాస్తు చేసుకుంటే అందరికి మంజూరు చేస్తామని ఆయన తెలిపారు.
సంక్షేమ పథకాలు జారవిడుచుకోవద్దు..
కళ్యాణలక్ష్మి, శాడిముబారక్ పథకాలకు వివాహం అయిన వెంటనే దరఖాస్తు చేయాలని, 18 సంవత్సరాల వయస్సు నిండినవారికే వివాహం చేయాలని, మైనర్లకు వివాహం చేస్తే క్రిమినల్ చర్యలు చేపట్టనున్నట్లు హెచ్చరించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు ఉపయోగించాలని, బహిరంగ మల విసర్జన చేయకూడదని ఆయన అన్నారు. కొత్త జాబ్ కార్డులు అవసరం మేరకు ఇస్తామని, ప్రతి ఒక్కరికి పనికల్పిస్తామని ఆయన తెలిపారు. ప్రతిఒక్కరూ బాధ్యతాయుతంగా సమిష్టిగా పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని, అభివృద్ధి లో తమవంతు కృషి చేయాలని కలెక్టర్ గ్రామస్తులకు పిలుపునిచ్చారు.
Published by:Siva Nanduri
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.