తెలంగాణ (Telangana) సీఎం కేసీఆర్ ఇవాళ బీహార్ (CM KCR Bihar Tour)లో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు ప్రత్యేక విమానంలో పాట్నాకు బయలుదేరి వెళ్తారు. గాల్వన్ లోయలో (Galwan Valley) అమరులైన ఐదుగురు బీహార్ సైనికుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని గతంలోనే సీఎం ప్రకటించారు. ఆ హామీ మేరకు నేడు బీహార్‌కి వెళ్లి సైనిక కుటుంబాలకు చెక్కులను అందజేస్తారు. కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్‌లో టింబర్ డిపో అగ్నిప్రమాదంలో 12 మంది బీహార్ వలస కార్మికులు మరణించారు. వారి కుటుంబాలకు కూడా రూ.5 చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ (Bihar CM Nitish Kumar)తో కలిసి వారికి చెక్కులను పంపిణీ చేస్తారు సీఎం కేసీఆర్.
చెక్కుల పంపిణీ పూర్తయ్యాక.. బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో కలిసి లంచ్ చేస్తారు. అనంతరం తాజా రాజకీయాలపై వీరిద్దరు చర్చిస్తారు. ఐతే ఎలాంటి చర్చ జరుగుతుంది? ఏం నిర్ణయాలు తీసుకుంటారు? మీడియాతో మాట్లాడతారా? అన్న దానిపై తెలంగాణలో హాట్ హాట్‌గా చర్చ జరుగుతోంది. సీఎం కేసీఆర్ అమరవీరులతో పాటు వలస కార్మికుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ చేసేందుకు పాట్నాకు వెళ్తున్నారని చెబుతున్నప్పటికీ.. ప్రధానంగా జాతీయ రాజకీయాలపైనే చర్చలు జరుపుతారని తెలుస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్‌కు కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతన్నారు. కేంద్ర విధానాలను తప్పుబడుతున్నారు. బీజేపీని గద్దె దించాలి.. లేదంటే దేశ సర్వనాశనం అవుతుందని పదే పదే విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలోనే తమతో కలిసి వచ్చే నాయకులతో కలిసి బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు దిశగా వెళ్తున్నారు. ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీ, ఉద్ధవ్ థాక్రే, స్టాలిన్ వంటి నేతలతో ఆయన గతంలో సమావేశమయ్యారు. జాతీయ రాజకీయాలపై చర్చలు జరిపారు. తాజాగా ఇప్పుడు బీహార్ సీఎం నితీశ్ కుమార్‌తో చర్చలు జరపనున్నారు.
ఇటీవల బీహార్ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటు చేసుకున్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకొని.. ఎన్డీయే నుంచి బయటకొచ్చిన జేడీయూ... ఆ తర్వాత ఆర్జేడీతో మళ్లీ జతకట్టింది. బీజేపీతో బంధాన్ని తెంచుకొని.. సీఎం పదవికి రాజీనామా చేసిన నితీశ్ కుమార్.. ఆర్జేడీతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమాద్మీ, స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ సహా పలు పార్టీలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై మండిపడుతున్నాయి. సీఎం కేసీఆర్ కూడా మోదీ ప్రభుత్వాని వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వ్యతిరేక శక్తులన్నింటినీ ఏకం చేయాలనే యోచనలో సీఎం కేసీఆర్. అందులో భాగంగానే వరుసగా విపక్ష నేతలతను కలుస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Nitish Kumar, Telangana, Telangana Politics