Home /News /telangana /

CM KCR WILL NOT BOYCOTTS NEETI AYOG COUNCIL MEETING AND SLAMS PM MODI AMIT SHAH SK

CM KCR: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా.. కేంద్రంపై సీఎం కేసీఆర్ ఆగ్రహం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

CM KCR: నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అది ఒక నిరర్థక ఆస్తిగా మిగిలిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు  చేశారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India
  కేంద్ర ప్రభుత్వం కొంతకాలంగా గుర్రుగా ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR).. తాజాగా మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై విరుచుకుపడ్డారు. కేంద్రం తీరును నిరసిస్తూ.. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసినట్లు ఆయన చెప్పారు. నీతి ఆయోగ్ సిఫారసులను కేంద్రం పట్టించుకోవడం లేదని.. అది ఒక నిరర్థక ఆస్తిగా మిగిలిపోయిందని తీవ్ర వ్యాఖ్యలు  చేశారు. ప్లానింగ్ కమిషన్ స్థానంలో వచ్చిన నీతి ఆయోగ్.. దేశంలో సాధించిన విజయమేమీ లేదని విమర్శలు గుప్పించారు సీఎం కేసీఆర్.

  సీఎం కేసీఆర్ ప్రసంగంలో ముఖ్యాంశాలు:

  గతంలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఎంతో గౌరవం ఉంది.  వారు చెప్పిన సలహాలు, సూచనలను కేంద్ర ప్రభుత్వాలు పాటించేవి. కానీ ఇప్పుడు నీతి ఆయోగ్ ఏం చెప్పినా.. కేంద్రం పాటించడం లేదు.

  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా వ్యవహరించాలో ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించింది. వార్షిక ప్రణాళికలు, పంచవర్ష ప్రణాళికలు ఉండాలని సూచించారు. 20 ఏళ్ల విజన్ ఉండాలని ఆలోచనలు జరిగాయి. ఇందులో భాగంగానే నెహ్రూ ప్రధాని అయ్యాక పోర్టులు, ఎయిర్‌పోర్టులు, రైల్వే, ఎల్ఐసీలను తీసుకొచ్చారు.

  భాక్రానంగల్, హిరాకుడ్, నాగార్జునసాగర్ ప్రాజెక్టులు మాడ్రన్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా పేరుతో వచ్చాయి. గతంలో ఎవరైనా చెబితే ప్రధానులు వినేవారు. కానీ ఇప్పటి ప్రధాని నరేంద్ర మోదీ ఎవరి మాటలనూ వినరు.

  2014లో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ప్రత్యామ్నాయమని చెప్పారు. సీఎంలు అందరికి సభ్యత్వం ఇస్తామని.. ఇది టీమిండియా అని మోదీ చెప్పారు. దేశానికి మంచి రోజులు వచ్చాయని అనుకున్నా. కానీ ఇప్పుడేమీ లేదు. సహకార సమాఖ్య స్ఫూర్తిని మాటించడం లేదు.

  నీతి ఆయోగ్ సూచనలను కేంద్రం పాటించడం లేదు. ప్రస్తుతం అది నిరర్థక ఆస్తిగా మిగిలిపోయింది. రాష్ట్రాల బడ్జెట్‌ రూపకల్పనలో కూడా పాలు పంచుకోవడం లేదు. దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది. కేవలం మోదీ భజనకే సరిపోయింది.

  నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో.. నీతి ఆయోగ్‌లో నీతి గంతే ఉంటుంది. నీతి ఆయోగ్ సిఫారసుల ఆచరణ పెద్ద జోక్‌గా మారింది. ఈ ఎనిమిదేళ్లలో దేశంలో అనేక పరిస్థితులు దిగజారాయి.

  దేషం, విద్వేషం, అసహనం పెరిగిపోయింది. చాలా దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి లేదు.

  దేశ రాజధానిలో 13 నెలల పాటు రైతులు ఆందోళనలు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్నారు గానీ.. పెట్టుబడి రెట్టింపయింది. తాగు నీటి కూడా దొరకడం లేదు. ఉద్యోగాలు రావడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులంతా రోడ్డున పడుతున్నారు. మరి నీతి ఆయోగ్ ఏం సాధించినట్లు?

  చివరకు ఉపాధి హామీ కూలీలు కూడా ఢిల్లీ జంతర్ మంతర్‌లో ధర్నాలు చేసే దుస్థితికి వచ్చింది. బీడీ కార్మికులకు 18శాతం జీఎస్టీ వేసి వారి నోట్లో మట్టికొట్టారు. నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ద్రవ్యోల్పణానికి అడ్డూ అదుపులేదు. జీడీపీ పతనమవుతోంది.

  దేశ చరిత్రలో ఎప్పుడూ లేనంతగా రూపాయి విలువ పడిపోతోంది. ఏదో సాధిస్తామని ప్లానింగ్ కమిషన్‌ స్థానంలో నీతి ఆయోగ్‌ను తీసుకొచ్చారు. కానీ నీతి ఆయోగ్‌ ఏం సాధించింది. మరింత దారుణ పరిస్థితులు దిగజారిపోతే.. ఏమనాలి? అందుకే నిరర్థక ఆస్తిగా మిగిలిపోయిందని అంటున్నా.

  కాళేశ్వరం చాలా మంచి ప్రాజెక్టు అని.. దీనికి రూ.5వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ సూచించింది. అలాగే మిషన్ కాకతీయకు రూ.19వేల కోట్లు ఇవ్వాలని సిఫారసు చేశారు. ఈ రెండింటికీ కలిపి రూ.24వేల కోట్లు ఇవ్వాలని చెప్పారు. కానీ ఏళ్లు గడిచినా.. 24 పైసలు కూడా ఇవ్వలేదు. నీతి ఆయోగ్ సిఫారసును బుట్టదాఖలు చేస్తే.. దానికున్న గౌరవం ఏంటి? ఇది అవమానించినట్లు కాదా?

  కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు రాష్ట్రాలకే ఇవ్వాలని గతంలో సూచించాను. స్టేట్ స్పెసిఫిక్ ఇష్యూస్ ఉంటాయి. ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటుంది. అందుకే స్టేట్ స్పెసిఫిక్ నిధులు ఇవ్వాలని సూచించా. బాగుందని మోదీ అన్నారు. కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదు.

  సహకార సమాఖ్య పాలన పోయి.. నిరశంకుశ పాలన వచ్చింది. చెప్పిన మాట వినకుంటే.. కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. బుల్డోజర్స్‌తో ఇళ్లను కూల్చుతున్నారు. మంత్రులను కూడా జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. అతివాదులు కత్తులు పట్టుకొని తిరుగుతున్నారు.

  అంతర్జాతీయ వేదికపై మన దేశం పరువుపోతుంది. ఎంతో మంది మేధావులు, ఆర్థిక వేత్తలు సలహాలు ఇస్తున్నారు. కానీ కేంద్ర ఎవరినీ పిలవదు. మాట్లాడదు. దేశ భవిష్యత్తు ప్రమాదంలో పడుతోంది.

  నీతి ఆయోగ్‌ సమావేశంలో మేం చెప్పిన దానికి విలువ ఉండదు. కాసేపు ఎక్కువ మాట్లాడితే ఇక చాలు అని బెల్ కొడుతుంటారు. ఇంకొందరైతే నవ్వుతుంటారు. అలాంటి నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం అవసరమా?

  దేశమంతటికీ కరెంట్ ఎలా ఇవ్వాలో.. సాగు తాగు నీరు ఇవ్వాలో క్షుణ్ణంగా వివరించాను. ఆ తర్వాత ఎంతో మంది సీఎస్‌లు నన్ను మెచ్చుకున్నారు. 70వేల టీఎంసీల నీరున్న ఇండియాలో చెన్నై నగరం ఒక బకెట్ నీటికి ఎందుకు తల్లడిల్లుతుంది?

  తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు, ప్రాజెక్టులను కేంద్ర బృందాలు మెచ్చుకున్నాయి. నీతి ఆయోగ్ ప్రశంసలు, కేంద్రం అవార్డులు అందుకోని డిపార్ట్‌మెంటే లేదు. అక్కడ మెచ్చుకుంటారు గానీ.. రూపాయి మాత్రం ఇవ్వరు.

  గత ఆర్థిక సంవత్సరం ఒక లక్షల 90వేల కోట్లను సమకూర్చుకొని ఖర్చుపెట్టాం. కానీ కేంద్రం నుంచి రూ.5వేల కోట్లు మాత్రమే వచ్చాయి. ఇదే నీతి ఆయోగ్? ఇది సమాఖ్య స్ఫూర్తా? నీతి ఆయోగ్ సలహాలు సూచనలను ఎవరూ పట్టించుకున్న దాఖలాలు లేవు.

  రూ. 6వేల కోట్ల గ్రాంట్ ఇవ్వాలని 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు 6 పైసలు ఇవ్వలేదు. కేంద్ర సంస్థలను మీ జేబు సంస్థలుగా వాడుకుంటున్నారు. ఏక్ నాథ్ షిండేలను సృష్టిస్తామని మాట్లాడతారా? మరీ ఇంత అహంకారమా?

  కేంద్ర ప్రభుత్వ ఆలోచనా విధానంలో పరివర్తనం రావాలని కోరుకుంటున్నా. జాతిపిత మహాత్మా గాంధీని కూడా అవమానిస్తున్నారు. మరీ ఇంత అన్యాయమా? ప్రజలు అసహ్యించుకునే స్థాయికి ఎందుకు దిగజారాలె? యావత్ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా ఇలా..?

  ఉచితాలు బంద్ చేయాలని కొత్త దుకాణం మొదలు పెట్టారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్ ఇస్తే ఉచితమా? కష్టాల్లో ఉన్న రైతులకు రైతుబంధు, ఉచిత కరెంటు ఇస్తే.. ఉచితాలా? మరి ఎన్‌పీఏలు ఎందుకు ఇస్తున్నారు?

  2004లో NPAలు రూ.58వేల కోట్లు... 2014 వచ్చ వరకు 2 లక్షల కోట్లు. ఇప్పుడు 2020లో 20 లక్షల కోట్లు ఎన్‌పీఏలు ఉన్నాయి. ఎన్‌పీఏలు పెద్ద స్కామ్. ఇదో దందా. ఇది దేనికి సంకేతం. బ్యాంకుల ఎగవేతలు కూడా లక్షల కోట్లకు పోతున్నాయి. ఎందుకిలా జరుగుతోంది?

  మేకిన్ ఇండియా అని గొప్పలు చెప్పారు. పతంగి మాంజాలు, గోళ్లు కత్తిరించుకునే కత్తెర్లు, దీపాంతలు, పీపీఈ కిట్లు అన్నీ చైనా నుంచే వస్తున్నాయి. మేకిన్ ఇండియా అంటే ఎగుమతులు పెరగాలి. దిగుమతులు పెరగాలి.

  మనదేశంలో 83 కోట్ల ఎకరాల భూమి ఉంది. ఇందులో 50శాతం వ్యవసాయ అనుకూల భూమి ఉంది. అంటే 40కోట్ల ఎకరాలు. ఆ భూమి మొత్తానికి నీళ్లు ఇవ్వగలిగే వనరులు ఉన్నాయి. అయినా కందిపప్పు, పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నాం.
  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, Niti Aayog, Telangana

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు