తెలంగాణలోని దళిత కుటుంబాల అభివృద్ది, ఆర్థిక సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం దళిత బంధు పథకం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టిన ఈ పథకాన్ని తొలుత హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన సంగతి తెలిసిందే. ఆగస్టు 16న హుజురాబాద్ నియోజవర్గంలోని శాలపల్లి వేదికగా సీఎం కేసీఆర్ ఇందుకు శ్రీకారం చుట్టారు. అయితే రాష్ట్రంలోని తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ భాగాల్లో ఉన్న దళిత శాసన సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నాలుగు నియోజకవర్గాల్లోని 4 మండలాలను ఎంపిక చేసి ఆ మండలాల్లో అన్ని కుటుంబాలకు హుజూరాబాద్ తో పాటు దళితబంధును(Dalit Bandhu) అమలు చేయాలని కొద్ది రోజుల క్రితం సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలం, సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరి మండలం, నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలాలను ఎంపిక చేశారు.
దళితబంధు పథకం అమలు యొక్క లోటుపాట్లను, దళిత ప్రజల యొక్క మనోభావాలను, వారి అవసరాలను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకోవాలని ఈ నాలుగు మండలాలను ఎంపిక చేశామని సీఎం కేసీఆర్ చెప్పారు. అయితే తాజాగా ఈ నాలుగు మండలాల్లో దళిత బంధు పథకం(Dalit Bandhu scheme) అమలు చేయడం కోసం ఈ నెల 13న మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
ఈ నాలుగు మండలాల్లో దళితబంధు పథకం అమలుకు సంబంధించి చేపట్టాల్సిన కార్యాచరణ కోసం ప్రగతి భవన్లో సన్నాహక సమావేశాన్ని నిర్వహించనున్నట్టు సీఎం కార్యాలయం తెలిపింది. సోమవారం జరగనున్న ఈ సన్నాహక సమావేశంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన మంత్రులు, జిల్లాపరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, మధిర, తుంగతుర్తి, అచ్చంపేట, కల్వకుర్తి, జుక్కల్ నియోజవర్గాల శాసన సభ్యులు, ఎస్సీ కులాల అభివృద్ధి సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి సోమేశ్ కుమార్, ఎస్సీ డెవలప్ మెంట్ శాఖ కార్యదర్శి, సీఎం సెక్రటరీ రాహుల్ బొజ్జా, ఫెనాన్స్ సెక్రటరీ పాల్గొంటారు. పథకం తీరుతెన్నులను వివరించేందుకు క్షేత్రస్థాయి అనుభవం కలిగిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక ఆహ్వానితులుగా పొల్గొంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి.
దళిత బంధు ఈ పథకం కింద ఒక కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని.. వారికి రూ.10 లక్షలు అందజేస్తున్నారు. ఈ పథకాన్ని తొలుత హుజురాబాద్‌లో, ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా అమలు చేయనున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. హుజురాబాద్ అనేది దళిత బంధు పథకానికి ప్రయోగశాల వంటిదని అన్నారు. ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు అందజేయనున్నట్టుగా తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా దళిత బంధు అందజేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తొలుత దళితులలో ఉన్న నిరుపేద కుటుంబాలకు దళిత బంధు అందజేస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇప్పటికే హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Dalitha Bandhu, Telangana