CM KCR TO LEAD TRS DHARNA AT DELHI TODAY OVER PADDY ISSUE LIKELY TO WARN BJP AND PM MODI MKS
CM KCR: వారం తర్వాత జనంలోకి కేసీఆర్.. వరి దీక్ష 3గంటలే.. బీజేపీ-మోదీపై యుద్దకార్యాచరణ
ఢిల్లీ తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ వరి దీక్ష స్థలి
ఢిల్లీలో టీఆర్ఎస్ వరి దీక్షకు వేళయింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో ఇవాళ గులాబీ సైన్యం వరి గర్జన చేయనుంది. వారం తర్వాత జనంలోకి వస్తోన్న కేసీఆర్.. బీజేపీ-కేంద్రంపై తదుపరి యుద్ధ కాచర్యాచరణ ప్రకటించనున్నారు..
తెలంగాణలో పండిన యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో మోదీ సర్కార్ వైఖరిని నిరసిస్తూ టీఆర్ఎస్ ఇవాళ (సోమవారం) ఢిల్లీలో భారీ దీక్ష (TRS Dharna At Delhi) చేపట్టనుంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ (Telangana CM KCR) స్వయంగా ధర్నాలో పాల్గొని వరి పోరును లీడ్ చేయనున్నారు. వారం తర్వాత కేసీఆర్ జనంలోకి రానున్నారు. గత వారమంతా ఢిల్లీలోనే ఉన్నప్పటికీ ఆయన ఏం చేశారు, ఎవరిని కలిశారనేది పూర్తిగా ప్రైవేటు వ్యవహారంలా సాగడం తెలిసిందే. ధర్నా వేదికను తొలుత జంతర్ మంతర్ అనుకున్నప్పటికీ, చివరికి తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి భవన్ ప్రాంగణంలోనే చేపట్టారు. సీఎంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇతర ముఖ్యనేతలు దర్నాలో పాల్గొననున్నారు.
బీజేపీ నేతృత్వంలోని కేంద్రంపై పోరులో భాగంగా తలపెట్టిన ఢిల్లీ వరి దీక్షను టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నది. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా దాదాపుగా నేతలందరూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. మరికొంత మంది నేతలు సోమవారం ఉదయం చేరుకోనున్నారు. కాగా, దీక్షా వేదికపై ధాన్యం బస్తాలను పెట్టనున్నారు. ఇందుకు కావాల్సిన ధాన్యాన్ని టీఆర్ఎస్ నేతలు తెలంగాణ నుంచి తీసుకొచ్చారు. కాగా, ఢిల్లీలో కేసీఆర్ వరి పోరు కేవలం 3 గంటలపాటు మాత్రమే ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు నిరసన దీక్ష జరుగుతుందని టీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
వరి పోరు దీక్ష సందర్భంగా ఢిల్లీ ప్రధాన రోడ్లు, కూడళ్లు, తెలంగాణ భవన్ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, టీఆర్ఎస్ జెండాలను కట్టారు. ఆదివారం మంత్రి నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, బీబీ పాటిల్, సురేశ్‌రెడ్డి, ఎమ్మెల్యే గణేష్ గుప్తా తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలతో దేశ ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుందన్నారు. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.
ఢిల్లీ వరి దీక్షకు ముందు వారం పాటు టీఆర్ఎస్ భారీ ఎత్తున నిరసనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఇవాళ దీక్షా వేదిక నుంచి సీఎం కేసీఆర్ తదుపరి ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తారని తెలుస్తోంది. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ప్రధాని మోదీ, కేంద్రంపై పోరాడుతూనే, రాజకీయంగానూ బీజేపీని నిలువరించేలా కేసీఆర్ కార్యక్రమాలకు పిలుపునివ్వనున్నారు. కాగా, జాతీయ కూటమి యత్నాల్లో ఉన్న కేసీఆర్ ఢిల్లీ కేంద్రంగా జరుపుతోన్న దీక్షకు ఇతర పార్టీలు ఏ మేరకు సంఘీభావం తెలుపుతాయి? దీక్షా స్థలికి ఎందరు నేతలు రాబోతున్నారనేది మరి కొద్ది గంటల్లో తేటతెల్లం కానుంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.