విశ్వనగరం హైదరాబాద్, ఈ నగరాన్నే నమ్ముకొని వచ్చే తెలంగాణ, ఇతర ప్రాంతాల ప్రజలకు సకల వైద్య సౌకర్యాలను పెంపొందించే దిశగా కేసీఆర్ సర్కారు వేగం పెంచింది. దాదాపు 1.5కోట్ల మంది నివసిస్తోన్న హైదరాబాద్‌కు నలుదిక్కులా నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను టీసర్కారు ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటికే గచ్చిబౌలిలో ‘తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)’ సేవలు అందిస్తుండగా, మరో మూడు టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ మంగళవారం నాడు భూమిపూజ చేయనున్నారు.
దేశానికే తలమానికంగా ఉన్న ఢిల్లీ ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ టిమ్స్ ఆస్పత్రులను అత్యున్నత ప్రమాణాలతో నిర్మించేందుకు కేసీఆర్ సర్కారు భారీగా నిధులు కేటాయించారు. మూడు టిమ్స్ నిర్మాణానికి రూ.2,679 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. తెలంగాణ వైద్యరంగ చరిత్రలో అద్భుత ఘట్టంలా ఇవాళ ఒకే రోజు మూడు టిమ్స్ ఆస్పత్రులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తున్నారు. అల్వాల్ (బొల్లారం), సనత్‌నగర్ (ఎర్రగడ్డ ఛాతి దవాఖాన), ఎల్బీనగర్ (గడ్డి అన్నారం పండ్ల మార్కెట్)లో టిమ్స్ భవనాల నిర్మాణానికి సీఎం కేసీఆర్ మంగళవారం శంకుస్థాపన చేయనున్నారు.
సనత్‌నగర్, ఎల్బీనగర్‌లో జీ+14 విధానంలో దవాఖాన భవనాలు నిర్మిస్తారు. అల్వాల్‌లో కంటోన్మెంట్ ప్రాంతం కావడంతోపాటు పక్కనే రాష్ట్రపతి నిలయం ఉండడంతో జీ+5 విధానంలో నిర్మాణం చేపడతారు. ఒక్కో టిమ్స్‌లో వెయ్యి పడకలు ఉంటాయి. అల్వాల్‌లోని రాజాజీ ఇన్‌స్టిట్యూట్ ప్రాంగణంలో నేడు కేసీఆర్ బహిరంగ సభ కూడా నిర్వహించనున్నారు. రాజీవ్ రహదారికి ఆనుకొని ముత్యాలమ్మ ఆలయం ఎదురుగా ఉన్న 28 ఎకరాల ప్రభుత్వ స్థలంలో టిమ్స్‌ను నిర్మించనున్నారు.
తెలంగాణలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులుగా పేరుపొందిన గాంధీ ఆస్పత్రి 170 ఏళ్ల క్రితం మొదలుకాగా, ఉస్మానియా వందేళ్ల కిందటే ఆరంభమైంది. 1951లో నిమ్స్ ఆస్పత్రి ఏర్పాటైంది. దశాబ్దాల గ్యాప్ తర్వాత గతేడాది కరోనా సమయంలో గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ విలేజీని టిమ్స్ సూపర్ స్పెషాలిటీగా మార్చారు. హైదరాబాద్ నలువైపులా ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీలు ఉండాలనే లక్ష్యంతో మరో మూడిటిని ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Corona TIMS, Government hospital, Hyderabad, Telangana