వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై సుప్రీంకోర్టుకు.. రేపు సీఎం కేసీఆర్ కీలక భేటీ

కేసీఆర్ (ఫైల్ ఫొటో)

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కల్వంకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

  • Share this:
    తెలంగాణలో ధరణి (Dharani) పోర్టల్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్‌లు మాత్రమే జరుగుతున్నాయి. కోర్టు కేసుల వలన వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లకు ఇబ్బందులు తలెత్తాయి. ఆధార్ కాలమ్‌ను తొలగించే వరకు స్లాట్ బుకింగ్, పీటీఐఎన్ నిలిపివేయాలని, కులం, కుటుంబసభ్యుల వివరాలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో శనివారం సీఎం కేసీఆర్ కీలక సమావేశం నిర్వహించబోతున్నారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి కల్వంకుంట్ల చంద్రశేఖర్ రావు శనివారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించనున్నారు.

    ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి హైకోర్టు ఆదేశాల కాపీ ఇంకా ప్రభుత్వానికి అందలేదు. అందిన తర్వాత దానిపై కూలంకషంగా చర్చించి తగు నిర్ణయం తీసుకునేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. హైకోర్టు నిర్ణయంపై సుప్రీం కోర్టు కు వెళ్లడమా ? లేదంటే తగు విధమైన విధివిధానాలు రూపొందించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను చేపట్టడమా ? అనే అంశంపై రెవెన్యూ, న్యాయ శాఖల నిపుణులతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.

    వ్యవసాయేతర ఆస్తులు – వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్ కోసం అవలంభించాల్సిన పద్ధతులపై అన్ని వర్గాలతో మాట్లాడి, అవసరమైన సూచనలు ఇవ్వడం కోసం మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు, పంచాయతీ రాజ్ శాఖమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ సభ్యులుగా ఉంటారు. మూడు నాలుగు రోజుల పాటు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ఇతర వర్గాలతో సమావేశమయి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని మంత్రి వర్గ ఉపసంఘాన్ని కేసీఆర్ ఆదేశించారు.

    కాగా, తెలంగాణలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సుమారు 3 నెలల తర్వాత ప్రారంభమైంది. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ పాత పద్ధతిలోనేచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కానీ, వాస్తవంలో అలా జరగడం లేదని, కొత్త విధానంలోనే రిజిస్ట్రేషన్లు చేస్తున్నారంటూ మూడు రోజులుగా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, ఇతరులు, డాక్యుమెంట్ రైటర్లు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ సందర్భంగా ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్‌ నెంబర్‌కు రిజిస్ట్రేషన్‌కు లింకు పెట్టడంతో సమస్యలు ఎదురవుతున్నాయి. అటు అన్‌లైన్‌లో ఈసీ కనిపించడం లేదు. బ్యాంక్ మార్టిగేజ్ ఆప్షన్‌ కూడా పోర్టల్ లో దొరకడం లేదు. దీంతో పేరుకు పాత పద్ధతే అయినా వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లలో కూడా ధరణి పద్దతినే అనుసరిస్తున్నారని బిల్డర్లు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే మూడు నెలలుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో తీవ్రంగా నష్టపోయామని, ఇప్పటికైనా సాంకేతిక సమస్యలు తొలగించాలని కోరుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: