రేపటి నుంచి తెలంగాణ పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం...

పట్టణ ప్రగతి. తెలంగాణలోని మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల రూపు రేఖలు సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమం. పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మహత్ కార్యం.

news18-telugu
Updated: February 23, 2020, 11:00 PM IST
రేపటి నుంచి తెలంగాణ పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభం...
(Image : Twitter)
  • Share this:
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతి రేపటి నుంచి ప్రారంభం కానుంది. మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల్లో ఈ కార్యక్రమం జరుగనుంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. పట్టణ ప్రగతి ఉద్దేశం, చేపట్టాల్సిన కార్యక్రమాలు, ఇతర అంశాలపై అధికారులు, ప్రజాప్రతినిధులకు… కూలంకషంగా వివరించారు. పట్టణ ప్రగతి. తెలంగాణలోని మున్సిపాలిటీలు, ఇతర పట్టణాల రూపు రేఖలు సమూలంగా మార్చే బృహత్తర కార్యక్రమం. పల్లె ప్రగతిని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనున్న మహత్ కార్యం. పట్టణాల్లో తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం పెంపు, వైకుంఠ ధామాలు, డంప్ యార్డుల నిర్మాణం… ఇలా అన్ని మౌలిక సదుపాయాలు కల్పించే ఉద్దేశంతో సర్కారు పట్టణ ప్రగతికి శ్రీకారం చుట్టనుంది. సోమవారం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతీ పట్టణంలో ఉండాల్సిన కనీస పౌర సదుపాయాలు ఏమిటో గుర్తించి… వాటిని అందుబాటులోకి తేవడమే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా ప్రతీ ప్రాంతంలో వార్డుల వారీగా ప్రణాళికలు తయారు చేస్తారు. వార్షిక, పంచవర్ష ప్రణాళికలను రూపొందిస్తారు. కౌన్సిలర్లు, కార్పొరేటర్ల సహకారంతో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు వాటికి రూపకల్పన చేస్తారు. వార్డుల వారీగా నియమించిన ప్రజాసంఘాల అభిప్రాయాలు తీసుకుంటారు. అలాగే, ప్రజలందరికి పరిశుభ్రమైన మంచినీరు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటారు. రహదారులపై గుంతలు, బొందలు లేకుండా పూడ్చేస్తారు. చెత్త నిర్మూలనకు డంపింగ్ యార్డులు, చనిపోయినవారికి గౌరవంగా తుది వీడ్కోలు పలికేందుకు దహన/ఖనన వాటికలు ఏర్పాటు చేస్తారు. పట్టణ జనాభాను అనుసరించి పరిశుభ్రమైన వెజ్, నాన్ వెజ్, ఫ్రూట్, ఫ్లవర్ మార్కెట్ల నిర్మాణం చేపడతారు. యువతకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, ఓపెన్ జిమ్‌లు, అందుబాటులోకి తెస్తారు. పబ్లిక్ టాయిలెట్లను కూడా నిర్మిస్తారు. వీధి వ్యాపారుల కోసం.. స్ట్రీట్ వెండింగ్ జోన్స్ ఏర్పాటు చేస్తారు. అలాగే… పట్టణాల్లో చెట్లు పెంచే బాధ్యతను కౌన్సిలర్లు, కార్పొరేటర్లు స్వీకరిస్తారు. నర్సరీల ఏర్పాటుపై కూడా దృష్టి సారిస్తారు. చెత్త సేకరణకు వాహనాలు.. తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు డస్ట్ బిన్‌లు పంపిణీ చేస్తారు.

వాటన్నింటితో పాటు పట్టణ ప్రగతికి సంబంధించి… ప్రభుత్వం మరికొన్ని మార్గదర్శాలు కూడా విడుదల చేసింది. రహదారుల పక్కన ఉండే పొదలు, తుప్పలు, పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాలు, శిథిలావస్థలో ఉన్న ఇళ్లను తొలగించాలని సూచించింది. ఎండిపోయిన బోరు బావులను పూడ్చేయాలని తెలిపింది. వంగిపోయిన, తుప్పు పట్టిన విద్యుత్ స్తంభాలను మార్చాలని… వదులుగా ఉండే కరెంటు వైర్లను బిగించాలని సూచించింది. ప్రజలకు ఆహ్లాదాన్ని అందించే పార్కులను అభివృద్ధి చేయాలని, ఇళ్లలో నాటేందుకు మొక్కలను పంపిణీ చేయాలని తెలిపింది. హరిత ఉద్యాన వనాలు, ఆట స్థలాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులతో పాటు ప్రజలను భాగస్వాముల్ని చేయాలని సర్కారు సకంల్పించింది. వారిలో చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు… పచ్చదనం పెంపు, పారిశుద్ధ్యంపై మరింత అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

First published: February 23, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు