బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుపై, ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ ముప్పేటదాడి కొనసాగిస్తోంది. అటు సీఎం కేసీఆర్ వరుసగా జాతీయ నేతలతో సమాలోచనలు జరుపుతూ బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తుండగా, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ వెళ్లిన చోటల్లా కమలదళంపై నిప్పులు కురిపిస్తున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్ తెలంగాణ-ఏపీ పునర్విలీనం, తెలంగాణకు కేంద్రం సాయం, ప్రధాని మోదీ తీరు తదితర అంశాలపై పలు షాకింగ్ కామెంట్లు చేశారు..
కేసీఆర్ సర్కారు కుల, మతాలకు అతీతంగా తెలంగాణను అభివృద్ధి చేస్తోందని టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అన్నారు. అదే మరికొందరు మాత్రం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని, విషం నింపడమే లక్ష్యంగా పెట్టుకున్నారని బీజేపీని ఉద్దేశించి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండలం సిద్ధాపూర్‌లో రిజర్వాయర్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేసిన అనంతరం ఆయన సభనుద్దేశించి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా 157 కొత్త మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటీ ఇవ్వలేదని, ఆ మెడికల్ కాలేజీలన్నిటినీ ఉత్తర భారతం, లేదంటే బీజేపీ పాలిత రాష్ట్రాలకే ఇచ్చుకుందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. దేశవ్యాప్తంగా 8 ఐఐఎంలు, 16 ఐసెర్‌లు మంజూరు చేస్తే రాష్ట్రానికి మాత్రం ఒక్కటీ ఇవ్వలేదన్నారు. అసలు ప్రధాని మోదీ మొత్తం దేశానికా? లేక ఉత్తర భారతానికే ప్రధానా? అని ఘాటు విమర్శ చేశారు మంత్రి కేటీఆర్.
‘నేను సవాల్ చేస్తున్నా.. తెలంగాణకు ఏం చేశారో చెప్పే దమ్ము కేంద్రానికి ఉందా? ఇలా అడిగితే ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలంగాణ పుట్టుకనే ప్రధాని మోదీ ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటుపై మోదీ అలా ప్రశ్నిస్తుంటే ఇక్కడి బీజేపీ నేతలు ఏం చేస్తున్నారు? తెలంగాణ పుట్టుకను ప్రశ్నిస్తున్న పార్టీ మనకు అవసరమా అన్నది ప్రజలు ఆలోచించాలి.
పొరుగన కర్ణాటకలోని ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చిన మోదీ.. తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరుకు ఇవ్వలేదు. గిరిజన యూనివర్సిటీ అడిగితే.. వాట్సాప్ యూనివర్సిటీలో మాత్రం అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. ఏం అడిగినా ప్రధాని పట్టించుకోవడం లేదు. ఆయన ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తర భారతానికే ప్రధాని అనుకుంటా. దేశం కోసం ధర్మం కోసం అంటారు తప్ప.. దేశానికి ఏం చేస్తారో చెప్పరు. ఎల్‌ఐసీకి రైతు బీమా అవకాశాన్ని టీఆర్ఎ కల్పిస్తే.. మోదీ మాత్రం దాన్ని ప్రైవేటుపరం చేయాలని చూస్తున్నారు. బీజేపీకిగానీ మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణ, ఆంధ్రను కలిపేస్తారు’అని మంత్రి కేటీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, KTR, Minister ktr, Nizamabad, Trs