తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే ధ్యేయంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) అగ్రరాజ్యం అమెరికాలో పర్యటిస్తున్నారు. రెండు వారాల యూఎస్ టూర్ లో భాగంగా ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులను కేటీఆర్ బృందం కలిసింది. పర్యటనలో భాగంగానే కేటీఆర్ ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీతోనూ మమేకం అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మన ఊరు మన బడి పథకంపై ఎన్ఆర్ఐలతో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వహించారు. ప్రభుత్వ బడుల బాగు కోసం కేసీఆర్ సర్కారు తలపెట్టిన యత్నంలో ఎన్నారైలూ భాగస్వాములు కావాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని శాన్ జోస్ సిటీ మిల్పిటాస్‌లో ‘మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్’కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. చదువుకున్న పాఠశాల అభివృద్ధికి మీ వంతుగా సహాయం చేయాలని, ఎన్నారైలు తెలంగాణలో బడులు కట్టాలనుకున్నా, లైబ్రరీలు కట్టించాలనుకున్నా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి కేటీఆర్ చెప్పారు. దీని వల్ల స్థానికుల నుంచి వచ్చే కృతజ్ఞత మరిచిపోలేనిదిగా ఉంటుందన్నారు.
‘తెలంగాణ అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరూ ఉండరు. తెలంగాణ గురించి మీరే గొప్పగా ప్రచారం చేయగలరు. అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం. విద్యావ్యవస్థను పటిష్టం చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మీరు కూడా పాలుపంచుకోండి..’అని ఎన్నారైలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ అన్నారు.
ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణలో కేవలం మూడు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని, తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత కొత్తగా 33 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామని కేటీఆర్ తెలిపారు. అలా వైద్య విద్యతో పాటు స్కూల్ ఎడ్యుకేషన్‌ను పటిష్టం చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. రూ. 7,230 కోట్ల తో తెలంగాణలోని 26 వేల పాఠశాలలను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కంకరణం కట్టుకుందని కేటీఆర్ తెలిపారు.
‘ఈ విద్యా యజ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలి. నా మాతృభూమి కోసం, నా గ్రామం, పట్టణం కోసం.. నేను ఏదైనా చేయాలి.. చేస్తే బాగుంటుందని, అవసరమైతే నా తల్లిదండ్రుల పేరు మీదో, నా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీదో ఏదో చేయాలనుకుంటే ఈ విద్యాయజ్ఞంలో పాల్గొనే అవకాశం ఉంది. మీ మీద ఆధారపడి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాదు. విద్యా రంగాన్ని పటిష్టం చేసేందుకు ప్రయివేటు వ్యక్తుల సహకారం కోసమేనని చెప్పారు. మీకు ఇష్టమున్న పాఠశాలను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేయొచ్చన్నారు. ఇది ఒక అద్భుత అవకాశం’ అని కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: KTR, Minister ktr, Telangana, Trs, USA