ఆర్మీలో నియామకాలకు సంబంధించి కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి (Agnipath Scheme Row)వ్యతిరేకంగా తెలంగాణలో జరిగిన నిరసనలు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (Secunderabad Railway Station) ముట్టడి ఘటన, కేంద్ర పోలీసుల కాల్పుల్లో వరంగల్ యువకుడి మరణం తదితర పరిణామాలపై తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) స్పందించారు. తెలంగాణ బిడ్డ ప్రాణాలు కోల్పోవడంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఆర్మీ అభ్యర్థుల నిరసనలను పరోక్షంగా సమర్థిస్తూ, మోదీ సర్కారు దుర్మార్గ విధానాల వల్లే తెలంగాణ బిడ్డ చనిపోవాల్సి వచ్చిందన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన రాకేశ్ కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున భారీ పరిహారాన్ని సీఎం ప్రకటించారు. అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా శుక్రవారం నాడు హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా జరిగిన నిరసనలపై సీఎం కేసీఆర్ రాత్రి స్పందించారు. వివరాలివే..
అసలేం జరిగిందంటే : ఆర్మీ నియామకాల నిలిపివేత, కేంద్రం కొత్తగా తెచ్చిన అగ్నిపథ్ పథకాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళనలకు దిగిన క్రమంలో శుక్రవారం నాడు తెలంగాణలోనూ హింసాత్మక ఘటనలు జరిగాయి. ఆర్మీలో చేరేందుకు ఇప్పటికే ఫిజికల్, మెడికల్ టెస్టులు పాసై, రాత పరీక్ష కోసం ఎదురు చూస్తోన్న వేలాది మంది విద్యార్థులు.. పరీక్ష రద్దైందని, ఇకపై అగ్నిపథ్ నియామకాలే ఉంటాయనే సమాచారంతో నిరసనలకు ప్లాన్ చేశారు. వాట్సాప్ గ్రూపుల్లో మాట్లాడుకుంటూ, విడతలవారీగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకున్న సుమారు 2వేల మంది విద్యార్థులు శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా 9 గంటలపాటు విధ్వంస నిరసనలకు దిగారు. పలు రైళ్లకు నిప్పు పెట్టారు. రైల్వే పోలీసుల కాల్పుల్లో ఒకరు మరణించారు. పదుల సంఖ్యలో విద్యార్థులు గాయపడ్డారు. రాత్రి 8 గంటలకుగానీ స్టేషన్ ను అదుపులోకి తీసుకోగలిగిన అధికారులు.. తిరిగి రైలు సేవలను పునరుద్ధరించారు.
సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి : ఆర్మీ ఉద్యోగాల నియామకానికి కేంద్రం ప్రకటించిన ‘అగ్నిపథ్’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శుక్రవారం ఆందోళన చేస్తున్న యువతపై రైల్వేపోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్ మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వరంగల్ జిల్లా దబ్బీర్ పేటకు చెందిన రాకేశ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీఎం.. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకొని కాపాడుకుంటుందన్నారు. ఈ సందర్భంగా..
మోదీ దుర్మార్గం వల్లే : సికింద్రాబాద్ స్టేషన్ లో నిరసనలు, విద్యార్థి కాల్చివేత ఘటనపై స్పందిస్తూ కేంద్రం తీరుపై నిప్పులు చెరిగారు సీఎం కేసీఆర్. మోదీ సర్కార్ అనునసిస్తోన్న తప్పుడు, దుర్మార్గ విధానాలకు ఓ బీసీ బిడ్డ బలికావడం తనను కలిచివేసిందని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారంతోపాటు కుటుంబంలో అర్హులైన వారికి అర్హత మేరకు ప్రభఉత్వ ఉద్యోగం ఇస్తామని సీఎం ప్రకటించారు. సికింద్రాబాద్ ఘటనలో రైల్వే పోలీసుల కాల్పులు, ప్రతిఘటనలో గాయపడ్డవారికి గాంధీ ఆస్పత్రిలో మెరుగైన వైద్యం అందించాల్సిందిగా సీఎం ఆదేశాల మేరకు ఆరోగ్య మంత్రి హరీశ్ రావు గాంధీ ఆస్పత్రి అధికారులకు సూచనలు చేశారు.
మరో అస్త్రంగా అగ్నిపథ్? : బీజేపీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పేరుతో కొత్త జాతీయ పార్టీ ఏర్పాట్లలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశంలో తాజాగా కొనసాగుతోన్న అగ్నిపథ్ నిరసనలను కూడా అస్త్రంగా మలుచుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సైన్యంలో కాంట్రాక్టు జవాన్లను నియమించడం, నాలుగేళ్ల తర్వాత వారిని బయటికి పంపడం భవిష్యత్తులో విపరీత పరిణామాలకు దారి తీస్తుందని, దేశ భద్రతతో మోదీ సర్కార్ ఆటలాడుతోందని, పెన్షన్ల ఖర్చును తగ్గించుకోడానికి ఇంతటి దుర్మార్గ విధానాలు తేవడం సరికాదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సహా పలువురు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agnipath Protest, Agnipath Scheme, CM KCR, Secunderabad railway station, Trs