Home /News /telangana /

CM KCR SET UP IAS COMMITTEE FOR ADMINISTRATIVE REFORMS AMID NEW ZONAL SYSTEM GO 317 SUCCESS MKS KMM

CM KCR: మరో సంచలనం.. పాలనలో భారీ ప్రక్షాళన.. జీవో 317 సక్సెస్.. తర్వాతి స్టెప్ ఇదే..

సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్

కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ అయిన జీవో 317 దాదాపు విజయవంతంగా అమలైన దరిమిలా తదుపరి చర్యలపై ఉన్నతాధికారులకు కేసీఆర్ దిశానిర్దేశంచేశారు.

తెలంగాణలో పరిపాలనకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగుల పనితీరు, ఖాళీల భర్తీ సహా ప్రభుత్వ కార్యక్రమాల అమలులో అన్నిస్థాయిల ఉద్యోగుల క్రియాశీల భాగస్వామ్యం తదితర అంశాలను అధ్యయనం చేసి, సూచనలు ఇవ్వడానికి నలుగురు ఐఏఎస్ అధికారులతో పరిపాలనా సంస్కరణల కమిటీని ఏర్పాటు చేశారు. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల బదిలీలకు సంబంధించి జారీ అయిన జీవో 317 దాదాపు విజయవంతంగా అమలైన దరిమిలా తదుపరి చర్యలపై ఉన్నతాధికారులకు కేసీఆర్ దిశానిర్దేశంచేశారు.

ఐఏఎస్‌లతో కీలక కమిటీ..
తెలంగాణలో పరిపాలనా సంస్కరణల కమిటీకి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ ఐజీ అండ్ కమిషనర్ శేషాద్రి అధ్యక్షత వహిస్తారు. సీఎం సెక్రటరీ స్మితా సభర్వాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, మహిళా శిశుసంక్షేమశాఖ కమిషనర్ దివ్య కమిటీలో సభ్యులుగా ఉంటారు. ఆదివారం ప్రగతిభవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు.

జీవో 317.. ఆ 101 మంది తప్ప..
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 38,643 మంది ఉద్యోగులను ఉమ్మడి జిల్లాలలో సర్దుబాటు చేయగా, 101 మంది మినహా 38,542 మంది ఉద్యోగులు ఆయా స్థానాలలో చేరిపోయారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఆయా జిల్లాల్లో ఏర్పడ్డ ఖాళీలను వెంటనే భర్తీ చేసేలా నోటిఫికేషన్ జారీ చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవడం, జిల్లాల్లో సమీకృత ప్రభుత్వ కార్యాలయాల సముదాయాలు, జిల్లా పోలీసు భవనాల నిర్మాణం పూర్తవుతున్న నేపథ్యంలో జిల్లాలలో వివిధ ప్రభుత్వ శాఖల పనితీరును, ఇంకా మెరుగు పరచడానికి తీసుకోవాల్సిన చర్యలను సమీక్షించి, నివేదిక అందించాలని సీఎం ఈ కమిటీకి సూచించారు.

ఏయే శాఖలపై ఎంత ఒత్తిడి?
ఆర్డీఓలు, వీఆర్వోలు, వీఆర్ఏల సేవలను ఎలా ఉపయోగించుకోవాలి, కొత్త జిల్లాల్లో, కొత్తగా ఏర్పడ్డ మండలాల్లో ఏయేశాఖలకు పని ఒత్తిడి ఎంత ఉందో అంచనా వేసి దానికి అనుగుణంగా ఇంకా కొత్తగా పోస్టుల అవసరాన్ని గుర్తించడం, కొత్తగా సాంకేతికంగా ఏమేం చర్యలు తీసుకోవాలి తదితర అంశాల మీద ఈ కమిటీ అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

ఇదీ కేసీఆర్ ఉద్దేశం..
వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం ఇప్పటికే దేశంలో ప్రథమస్థానంలో నిలిచిందని, ఇంకా మెరుగైన పరిపాలనా సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు అద్భుతమైన సేవలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రజలకు నిత్యం ఎక్కువగా అందుబాటులో ఉండాల్సిన విద్య, వైద్యం, మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖల ద్వారా ఇంకా మెరుగైన సేవలు, మౌలిక సదుపాయాల కల్పన విషయంలో ఉద్యోగుల సేవలను ఎలా ఉపయోగించుకోవాలనే అంశంలో తగు సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఈ కమిటీకి సూచించారు.
Published by:Madhu Kota
First published:

Tags: CM KCR, Telangana

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు