తెలంగాణ, బీహార్ లో విషాదాన్ని నింపిన సికింద్రాబాద్ బోయిగూడ భారీ అగ్ని ప్రమాద ఘటనను కేసీఆర్ సర్కారు సీరియస్ గా తీసుకుంది. ఫైర్ సేఫ్టీ నిబంధనల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే అగ్ని ప్రమాదం తలెత్తిందని, 11 మంది కూలీల చావులకు పాలకులదే బాధ్యత అని విపక్షాలు ఆరోపిస్తుండగా, ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్న విషయాలు మాత్రం మరింత షాకింగ్ గా ఉన్నాయి. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఓనర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు హోం మంత్రి మహమూద్ అలీ. మృతుల కుటుంబాలకు ప్రకటించిన పరిహారంపై కాంగ్రెస్ నేత వీహెచ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివరాలివే..
సికింద్రాబాద్, బోయిగూడలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో జరిగిన ఘోర అగ్నిప్రమాదంపై తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ బుధవారం మధ్యాహ్నం జీహెచ్ఎంసీ, హైదరాబాద్ పోలీస్ శాఖ, అగ్నిమాపక శాఖ, విజిలెన్స్ అధికారులతో సమావేశమవుతున్నారు. హైదరాబాదులో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయో, ఎలాంటి చర్యలు చేపట్టాలో ఈ భేటీలో చర్చిస్తామని మంత్రి తెలిపారు. ఇరుకు సందుల్లో, నివాసం ప్రాంతాల్లో ఇలాంటి స్క్రాప్ గోదాంలు హైదరాబాదులో చాలా ఉన్నాయన్నారు.
బోయిగూడ ఘటనకు సంబంధించి హోం మంత్రి క్లారిటీ ఇచ్చారు. గోదాం యజమాని నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఓనర్‌ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఖర్చులతోనే మృతదేహాలను బీహార్‌కు తరలిస్తామన్నారు. చనిపోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తేపియజేస్తున్నానని హోంమంత్రి ప్రకటించారు.
సికింద్రాబాద్ బోయిగూడలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 11 మంది కూలీలు మరణించడం అత్యంత విషాదకరమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు అన్నారు. తెలంగాణలో నిర్మాణంలో ఉన్న ఫ్యాక్టరీలు, ప్రాజెక్ట్‌లలో బీహార్ కూలీల శ్రమ వెలకట్టలేనిదన్నారు. తెలంగాణలో ఉన్న ఐఏఎస్, ఐసీఎస్ అధికారులు ముందుకు వచ్చి ఆదుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు కేసీఆర్ సర్కారు రూ.5లక్షల పరిహారం ప్రకటించడంపై వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘కేసీఆర్ సర్కారుకు మానవత్వం ఉండాలి కదా.. రూ.5 లక్షలు ఎలా సరిపోతాయి? ఒక్కొక్క కూలీ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని కాంగ్రెస్ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా’అని వీహెచ్ అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ తదితర నేతలు కూడా అగ్ని ప్రమాద ఘనటపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ సర్కారుపై విమర్శలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Congress, Fire Accident, Hyderabad, Secunderabad, V Hanumantha Rao