HOME »NEWS »TELANGANA »cm kcr review meeting on agriculture and marketing departments here is decisions sk

CM KCR: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్లను కొనసాగిస్తాం.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన

CM KCR: తెలంగాణలో వ్యవసాయ మార్కెట్లను కొనసాగిస్తాం.. సీఎం కేసీఆర్ కీలక ప్రకటన
సీఎం కేసీఆర్ (ఫైల్ పోటో)

కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని కెసిఆర్ చెప్పారు.

  • Share this:
    తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్లని కొనసాగిస్తామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) అన్నారు. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్‌కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం బాగా పెరిగిన నేపథ్యంలో వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల ప్రాధాన్యం, బాధ్యత ఎంతో పెరిగిందని చెప్పారు. వ్యవసాయ శాఖ కాగితం - కలం శాఖగా కాకుండా పొలం - హలం శాఖగా మారాలని పిలుపునిచ్చారు. ప్రగతిభవన్‌లో ఆదివారం జిల్లా స్థాయి వ్యవసాయాధికారులు, మార్కెటింగ్ శాఖాధికారులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. అన్ని జిల్లాలకు చెందిన అధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వ్యవసాయాభివృద్ధి-రైతు సంక్షేమం విషయంలో ఈ రెండు శాఖలు నిర్వహించాల్సిన బాధ్యతలను ముఖ్యమంత్రి విడమర్చి చెప్పారు. ఈ రెండు శాఖల పనితీరులో గుణాత్మక, గణనీయమైన మార్పు రావాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

    వ్యవసాయంలో పంటల మార్పిడి విధానం, యాంత్రీకరణ, ఆధునిక సాగు పద్ధతులు పెంపొందించేందుకు వ్యవసాయ శాఖ తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ లో అమ్ముకునేందుకు సరైన పద్ధతులు అవలంబించే బాధ్యత మార్కెటింగ్ శాఖ పై ఉందని అన్నారు. కేంద్రం తెచ్చిన కొత్త చట్టాల ఫలితంగా దేశవ్యాప్తంగా మార్కెటింగ్ వ్యవస్థ ఎలా పరిణామం చెందినప్పటికీ, తెలంగాణ రాష్ట్రంలో మాత్రం సజీవంగా ఉంచడమే కాకుండా మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. పది రోజుల్లోగా రాష్ట్రంలోని ఏ గుంటలో ఏ పంట వేసారనే విషయంలో సరైన లెక్కలు తీయాలని కెసిఆర్ చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన రైతు వేదికలను వెనువెంటనే వాడుకలోకి తేవాలని, రైతులతో సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏఈఓ, రైతు బంధు సమితి కార్యాలయాలు కూడా రైతువేదికలోనే భాగంగా ఉండాలనీ, ఇందుకు అవసరమైన ఫర్నీచర్, ఇతర వసతులు కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.



    ''వ్యవసాయ శాఖ ఎంతో బలోపేతం కావాలి. వ్యవసాయాధికారులు అడుగడుగునా రైతులకు అండగా నిలవాలి. రైతులు ఎప్పుడూ ఒకే పంట వేసే విధానం పోవాలి. పంట మార్పిడి విధానం రావాలి. పంట మార్పిడి వల్ల ఉత్పత్తి పెరిగి లాభాలు వస్తాయి. గ్రామాల్లో కూలీల కొరత ఉంది. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగాల్సి ఉంది. పంటల సాగు విధానంలో ఆధునిక పద్ధతులు రావాలి. క్లస్టర్ల వారీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారులు వెంటనే గ్రామాల్లో పర్యటించాలి. ఏ గుంటలో ఏ పంట వేశారనే వివరాలు నమోదు చేయాలి. పది రోజుల్లోగా రాష్ట్రవ్యాప్తంగా సాగవుతున్నపంటల విషయంలో స్పష్టత రావాలి” అని ముఖ్యమంత్రి ఆదేశించారు

    దాదాపు 8 గంటల పాటు జరిగిన సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్, ఎంపి కె.కేశవరావు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

    సమావేశంలో ముఖ్యమంత్రి చెప్పిన ఇతర విషయాలు, ఇచ్చిన ఆదేశాలు
    -అన్ని రైతు వేదికలను వెంటనే ఉపయోగంలోకి తేవాలి. ఏఈఓ, రైతుబంధు సమితి కార్యాలయాలను రైతువేదికల్లోనే ఏర్పాటు చేయాలి. రైతు వేదికలకు మిషన్ భగీరథ ద్వారా మంచినీరు సరఫరా చేయాలి. మైక్ సెట్ సమకూర్చాలి. ఫర్నీచర్ ఏర్పాటు చేయాలి. ఏ క్లస్టర్ లో ఐనా ఏ కారణం చేతనైనా ఏఈఓ పోస్టు ఖాళీయైన, ఎవరైనా దీర్ఘకాలిక సెలవు పై వెళ్ళినా తాత్కాలిక పద్ధతిలో మరొకరిని నియమించాలి.

    రైతులు పండించిన పంటను అమ్ముకోవడానికి వ్యవసాయ మార్కెట్లే వేదిక. తెలంగాణ రాష్ట్రంలో వాటిని కొనసాగిస్తాం. రైతులు ఓ పద్ధతి ప్రకారం వచ్చి మార్కెట్లో పంటలు అమ్ముకునే విధానం తీసుకురావాలి. ఏ గ్రామానికి చెందిన రైతులు ఏ రోజు మార్కెట్ కు రావాలో నిర్ణయించి టోకెన్లు జారీ చేయాలి. ఏ పంటకు ఎక్కడ మంచి ధర ఉందనే విషయంలో రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు చేయాలి.ఇందుకోసం మార్కెటింగ్ శాఖలో రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో మార్కెంటింగ్ శాఖను మరింత బలోపేతం చేసుకోవాలి. కొత్త చట్టాల అమలు వల్ల మార్కెట్ సెస్ రాకున్నా ప్రభుత్వమే నిధులను సమకూర్చి మార్కెటింగ్ శాఖను బలోపేతం చేస్తాం.

    -రాష్ట్రంలో మార్కెట్ల వారీగా ఎంత ధాన్యం వస్తున్నది అక్కడి వ్యాపారులకు ఎంతవరకు కొనుగోలు శక్తి ఉన్నది అనే వివరాలు సేకరించాలి. వరిలో ఆధునిక సాగు పద్ధతులు వచ్చాయి. వెదజల్లే పద్ధతి ద్వారా సాగు చేయడం వల్ల ఎకరానికి 10 వేల రూపాయల వరకు ఆదా అయ్యే అవకాశం ఉంది. పత్తిలో సింగిల్ పిక్ పద్ధతి వచ్చింది. ఇంకా అనేక పంటల్లో కొత్త వంగడాలు, కొత్త పద్ధతులు వచ్చాయి. వాటి పై రైతులకు అవగాహన కల్పించాలి.

    యాంత్రీకరణ పెంచడం కోసం ప్రభుత్వం సబ్సిడీలు అందిస్తుంది.

    మండల వ్యవసాయాధికారులను ఆగ్రానమిస్టులుగా మార్చడానికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి.

    ఆధునిక సాగు పద్ధతులను అధ్యయనం చేయడానికి వ్యవసాయాధికారులు ఇజ్రాయిల్ పర్యటించాలి.

    పప్పుదినుసులు, నూనె గింజల సాగును ప్రోత్సహించాలి. పప్పులు, నూనె గింజలు పండించే ప్రాంతాల్లో దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం చొరవ చూపుతుంది.

    ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం స్ట్రాటజిక్ పాయింట్లను గుర్తించాలి.

    వ్యవసాయ పనిముట్లు రైతులకు కిరాయి పద్ధతిలో దొరికేందుకు గ్రామీణ ప్రాంతాల్లో కస్టమ్ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలి.

    మార్కెట్లలో ట్రేడింగ్ లైసెన్స్ ఇచ్చే విషయంలో సులభతరమైన విధానాలను తీసుకురావాలి.
    Published by:Shiva Kumar Addula
    First published:January 24, 2021, 20:56 IST