శనివారం ఇస్రో (ISRO) చేపట్టిన PSLV-C54/EOS-06 ప్రయోగం విజయవంతమైంది. ఏపీలోని శ్రీహరి కోటలో ఉన్న సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి తొమ్మిది ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టారు. ఐతే ఇందులో రెండు ఉపగ్రహాలు తెలంగాణకు చెందిన స్టార్టప్ సంస్థవి కావడం విశేషం. ధృవ స్పేస్ టెక్ (Dhruva Space Tech) ఫ్రైవేటు సంస్థకు చెందిన రెండు నానో ఉపగ్రహాలు నింగిలోకి వెళ్లాయి. ఈ ప్రయోగం విజయవంతం కావడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ (CM KCR) హర్షం వ్యక్తం చేశారు. ధృవ సంస్థ పంపిన 'తై బోల్డ్ 1 తై బోల్డ్ 2 ఉపగ్రహాలు వాటి కక్ష్యల్లోకి చేరడం దేశ స్టార్టప్స్ చరిత్రలో ఓ శుభ దినమన్నారు సీఎం కేసీఆర్.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టీహబ్‌లో స్కైరూట్, ధృవ స్పేస్ టెక్ సంస్థలు సభ్యులుగా ఉన్నాయి. ఇటీవలే స్కైరూట్ (Skyroot) సంస్థ విక్రమ్-ఎస్ రాకెట్ (Vikram-S Rocket) ప్రయోగాన్ని చేపట్టింది. అది విజయవంతం కావడంతో దేశ అంతరిక్ష ప్రయోగాల చరిత్రలో తెలంగాణ స్టార్టప్ మొట్ట మొదటి సంస్థగా చరిత్ర లిఖించిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ధృవ స్పేస్ టెక్ పంపిన ఉపగ్రహాలు కూడా నింగిలోకి వెళ్లడం పట్ల ర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా.. తెలంగాణ కీర్తిని చాటిన స్కైరూట్, ధృవ స్పేస్ స్టార్షప్ సంస్థల ప్రతినిధులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే స్పూర్తితో తెలంగాణ యువత భారతదేశ అభివృద్ధి కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. తాజా ప్రయోగాలు తెలంగాణ కీర్తిని ప్రపంచానికి చాటాయని.. స్టార్టప్ సిటీగా పేరొందిన హైదరాబాద్ విశిష్టత మరింత పెరిగిందని పేర్కొన్నారు సీఎం కేసీఆర్. ఇది ఆరంభం మాత్రమేనని.. ఔత్సాహికుల ప్రతిభను వెలికితీయడం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక సమాచార రంగాల్లో అవకాశాల సృష్టే లక్ష్యంగా ప్రారంభించిన టీహబ్(T-HUB)లు.. భవిష్యత్తులో మరెన్నో మైలురాళ్లు సాధిస్తాయనే నమ్మకం తనకుందని స్పష్టం చేశారు.
ఇదే స్ఫూర్తితో తెలంగాణ యువత తమ మేధో సంపదను దేశ ప్రగతి కోసం వెచ్చించాలని సీఎం కేసీఆర్ అన్నారు. తమ ప్రతిభను ప్రపంచానికి చాటుతూ భారత దేశ కీర్తిని ఇనుమడింపచేసే యువతీ యువకులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. శాస్త్ర సాంకేతిక ఐటీ రంగాల్లో జౌత్సాహికులైన యువతీ యువకుల ప్రతిభను వెలికితీసేందుకు కృషి చేస్తున్న మంత్రి కేటీఆర్‌ను ఈ సందర్భంగా అభినందిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.