K Chandrashekar Rao: ఆ రెండు జిల్లాలపై సీఎం కేసీఆర్ ఫోకస్.. నోడల్ ఏజెన్సీ ఏర్పాటు.. ఇదే కారణం

సీఎం కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Telangana: హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తున్నదని... నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలు దిన దినాభివృద్ధి చెందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు.

 • Share this:
  హైదరాబాద్ నగరానికి అనుసంధానమై దినదినాభివృద్ధి చెందుతున్న రంగారెడ్డి , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సమీకృతాభివృద్ధి, సమస్యల శాశ్వత పరిష్కారం కోసం సీఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన ఒక నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ జిల్లాల పరిధిలోని నియోజకవర్గాలు, మున్సిపాలిటీలు, ఇతర ముఖ్య పట్టణాల్లో సమీకృత వెజ్ నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణంతోపాటు, టౌన్ హాల్స్ నిర్మాణం, రోడ్లు, విద్యుత్తు, తాగునీరు, పరిశుభ్రత వంటి మౌలిక వసతులను అభివృద్ధి పరచడం, సీవరేజీ డ్రైనేజీ, నాలాల మరమ్మత్తు, వరదనీరు, ముంపు, ట్రాఫిక్ వంటి సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని సిఎం అన్నారు. ఈ దిశగా అనుసరించాల్సిన కార్యాచరణ కోసం ఆ రెండు జిల్లాల స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం కావాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను ఆదేశించారు.

  హైదరాబాద్ కాస్మోపాలిటన్ నగరంగా పురోగమిస్తున్నదని... నగరంలో భాగంగా ఉన్న రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి జిల్లాలు దిన దినాభివృద్ధి చెందుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ జిల్లాల పరిధిలోని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను సమగ్రంగా అభివృద్ధి పరుచుకోవడానికి ప్రణాళికలను సిద్దం చేసుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఇందుకు నిరంతరం పర్యవేక్షించేందుకు సిఎస్ సోమేశ్ కుమార్ అధ్యక్షతన నోడల్ ఏజెన్సీని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

  ఇందులో భాగంగా షాద్ నగర్, పెద్ద అంబర్ పేట, ఇబ్రహీంపట్నం, జల్ పల్లి, శంషాబాద్, తుర్కయాంజల్, మణికొండ, నార్సింగి, ఆదిభట్ల, శంకర్ పల్లి, తుక్కుగూడ, ఆమన్ గల్ వంటి మున్సిపాలిటీలు, బడంగ్ పేట్, బండ్లగూడ జాగీర్, మీర్ పేట్, జిల్లెలగూడ వంటి మున్సిపల్ కార్పొరేషన్లు మేడ్చల్ జిల్లా పరిధిలోని బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట వంటి మున్సిపల్ కార్పొరేషన్లు.., మేడ్చల్, దమ్మాయిగూడ, నాగారం, పోచారం, ఘట్ కేసర్, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, కొంపల్లి, దుండిగల్ వంటి మున్సిపాలిటీల అభివృద్దికి చర్యలు చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు.

  ఈ ప్రాంతాలన్నీ హైద్రాబాద్ నగరంలో దాదాపు కలిసిపోయాయని, భవిష్యత్తు తరాల అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి ప్రణాళికలు రచించాలని అన్నారు. ఇందుకు సంబంధించిన నిధులను సమీకరించడం, నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేసి నగరం నలువైపులా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడం కీలకం అని సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని దిక్కుల్లో అన్ని రకాల పనులు సమాంతరంగా జరిగేలా చూడాలని అన్నారు.
  Published by:Kishore Akkaladevi
  First published: