Home /News /telangana /

CM KCR ORDERED OFFICIALS TO VISIT DISTRICTS OF TELANGANA IN HELICOPTER AND FIND REASONS FOR SPREAD OF CORONAVIRUS AK

Telangana: హెలికాప్టర్‌లో వెళ్లండి.. కరోనా వ్యాప్తి కారణాలు తెలుసుకోండి.. అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశం

సీఎం కేసీఆర్ (ఫైల్)

సీఎం కేసీఆర్ (ఫైల్)

KCR Review on Covid 19 Situation: కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.

    రాష్ట్రంలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైద్యశాఖ ఉన్నతాధికారుల వైద్య బృందం ఈ నెల 11, 12, 13 తేదీల్లో కరోనా ప్రభావిత సరిహద్దు జిల్లాల్లో పర్యటించి రావాలని అన్నారు. నాగార్జున సాగర్, మిర్యాలగూడ, నకిరేకల్, సూర్యాపేట, ఖమ్మం, డోర్నకల్, హుజూరాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, బెల్లంపల్లి, గోదావరిఖని, సిరిసిల్ల, వరంగల్ ప్రాంతాల్లో మూడు రోజుల పాటు, హెలికాప్టర్ ద్వారా వరుస పర్యటనలను చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం నివేదికను సిద్ధం చేసి కేబినెట్‌కు సమర్పించాలని అన్నారు. జిల్లాల్లో కరోనా విస్తరణకు ప్రధాన కారణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి, పర్యటన సందర్భంగా విశ్లేషించాలన్నారు.

    కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన చర్యలను, ముందస్తు నివారణ కార్యక్రమాలను ప్రత్యేకంగా రూపొందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సరిహద్దు రాష్ట్రాల్లో జిల్లాల్లో కరోనా ఇంకా పూర్తిస్థాయిలో నియంత్రణలోకి రాలేదని.. ఈ నేపథ్యంలో సరిహద్దు జిల్లాల్లో కరోనా మహమ్మారి ప్రభావం పూర్తిగా సమసి పోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాంటి ప్రాంతాలను గుర్తించి అక్కడ శాస్త్రీయ అధ్యయనం చేసి, కరోనా విస్తరణకు గల కారణాలను అన్వేషించాలని అన్నారు. అందుకు సంబంధించి శాస్త్రీయ పద్దతుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. కరోనాను కట్టడి చేయాలన్నా, ముందస్తుగా నియంత్రించడానికి నిర్దిష్ట చర్యలు చేపట్టడానికి కూడా ప్రభుత్వాలకు సంపూర్ణ అవగాహన కరువైందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.

    ఏ వేరియంట్, ఏ వేవ్, ఎప్పడొస్తదో ఎందుకు వస్తదో ఎంత వరకు విస్తరిస్తదో తెలియడం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఏ రోగానికైనా దాని కారణం దొరికితే నివారణకు మార్గం సుగమం అవుతుందని.. కరోనా రోగ కారణం, దాని లక్షణం మొత్తంగా కరోనా స్వరూపం, పర్యవసానాలు అర్థం కాని పరిస్థితి ఉన్నదని అన్నారు. కరోనా నియంత్రణ చాలా సంక్లిష్టంగా మారిందని... ఇటువంటి సంక్లిష్ట పరిస్థితుల్లోనే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తం కావాల్సిన అవసరమున్నదని సీఎం కేసీఆర్ అధికారులకు సూచించారు. కొత్త వేరియంట్ల పేరుతో, వేవ్‌ల రూపంలో దశల వారీగా కరోనా నియంత్రణకు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ అవుతూ ప్రజలను కరోనా బారినుంచి రక్షించుకునే చర్యలను చేపట్టాలని అధికారులకు తెలిపారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: CM KCR, Coronavirus, Telangana

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు