Telangana: తెలంగాణలోకి ఆ వర్గాలకు గుడ్‌ న్యూస్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. రూ. 6000 కోట్ల కేటాయింపు

సీఎం కేసీఆర్

Telangana: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు.

  • Share this:
    తెలంగాణలో రెండవ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని త్వరలో నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే మొదటి విడత ద్వారా 5000 కోట్ల రూపాయాలు ఖర్చుతో చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమం అద్భుతమైన ఫలితాలనిచ్చిందని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో విడత పంపిణీకోసం మరో 6000 కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. అందుకు కావాల్సిన నిధులను సమకూర్చాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. మొదటి విడతతో పాటు రెండో విడతను కలుపుకుని తెలంగాణ గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ కార్యక్రమాల కోసం మొత్తంగా 11,000 కోట్ల రూపాయలను కేటాయించినట్లవుతుందని అన్నారు. ఇప్పుడు అందిస్తున్న గొర్రెల యూనిట్‌ను అదే సంఖ్యతో కొనసాగించాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

    తెలంగాణలో వృత్తి జీవనం సబ్బండ వర్గాలను అనుసరించే కొనసాగుతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. కుల వృత్తులన్నీ బీసీ వర్గాలే నిర్వహిస్తున్న నేపథ్యంలో వారిని అన్ని రంగాల్లో ఆదుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచించి కార్యాచరణ చేపట్టిందని తెలిపారు. అందులో భాగంగా అమలు పరుస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచి తెలంగాణ బిసీ వర్గాల జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని అన్నారు.

    నాటి సమైక్య పాలనలో ధ్వంసమైన తెలంగాణ కుల వృత్తులను ఒక్కొక్కటిగా తీర్చిదిద్దుతూ, గాడిన పెడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అవిరామ కృషి ఫలితంగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమౌతూ, తెలంగాణ సబ్బండ కులాల జీవనంలో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని సీఎం తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో అత్యంత కీలమైన కులవృత్తులను మరింతగా ప్రోత్సహిస్తామని అన్నారు.
    Published by:Kishore Akkaladevi
    First published: