హోమ్ /వార్తలు /తెలంగాణ /

Telangana: దేశవ్యాప్తంగా 50 ఎంపీ స్థానాల్లో BRS పోటీ.. సింగిల్‌గానే బరిలోకి.. ఈ సీట్లపైనే ఫోకస్..!

Telangana: దేశవ్యాప్తంగా 50 ఎంపీ స్థానాల్లో BRS పోటీ.. సింగిల్‌గానే బరిలోకి.. ఈ సీట్లపైనే ఫోకస్..!

KCR TRS(FILE)

KCR TRS(FILE)

KCR New Party: టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని ఏర్పాటు చేశాక.. మొదటి బహిరంగ సభ కరీంనగర్‌‌లోనే పెట్టారు. అదే సెంటిమెంట్‌‌ కొనసాగిస్తూ... కరీంనగర్‌‌ సభలోనే జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తారని తెలుస్తోంది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  కేసీఆర్ (KCR New Party) కొత్త పార్టీ పేరేంటి? జెండా రంగు మారుతుందా? ఎన్నికల గుర్తుగా కారునే కొనసాగిస్తారా? ఇప్పుడు తెలంగాణలో అంతటా వీటి గురించే చర్చించుకుంటున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీ గురించి అందరిలోనూ ఆసక్తి కనిపిప్తోంది. కేసీఆర్ (cm kcr) కొత్త పార్టీ పేరు దాదాపు ఖరరాయిందని.. భారతీయ రైతు సమితి (BRS)గా ప్రకటింవచ్చని ప్రచారం జరుగుతుంది. దసరా సందర్భంగా అక్టోబరు 5న తెలంగాణ భవన్‌లో జరిగే టీఆర్ఎస్ (TRS) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో జాతీయ పార్టీపై తీర్మానం చేస్తారు. టీఆర్‌‌ఎస్‌‌ ఎన్నికల గుర్తయిన ‘కారు’నే జాతీయ పార్టీకి కూడా తీర్మానం చేయనున్నారు. జాతీయ పార్టీ ప్రకటనకు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన రైతు నేతలకు కేసీఆర్ ఆహ్వానం పంపినట్లు తెలిసింది. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ఆహ్వానితులుగా వారు పాల్గొంటారట. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తూ ఏకగ్రీవంగా ఆమోదించే తీర్మానాన్ని ఇప్పటికే ఖరారు చేశారు. అధ్యక్షుడి హోదాలో కేసీఆర్‌‌ తీర్మానాన్ని ప్రవేశపెడతారు. పార్టీ సెక్రటరీ జనరల్‌‌ కె. కేశవరావుతో పాటు రాష్ట్ర కార్యవర్గం ఈ తీర్మానానికి ఆమోదముద్ర వేయనుంది.

  కొత్త పార్టీ జాతీయాధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నికకానున్నారు. రాష్ట్ర శాఖ బాధ్యతలను మంత్రి కేటీఆర్‌కు అప్పగిస్తారని సమాచారం. దసరా తర్వాత కరీంనగర్‌‌లో భారీ సభకు కేసీఆర్‌‌ ప్లాన్‌‌ చేస్తున్నట్లు సమాచారం. టీఆర్‌‌ఎస్‌‌ పార్టీని ఏర్పాటు చేశాక.. మొదటి బహిరంగ సభ కరీంనగర్‌‌లోనే పెట్టారు. అదే సెంటిమెంట్‌‌ కొనసాగిస్తూ... కరీంనగర్‌‌ సభలోనే జాతీయ పార్టీ పేరు, జెండా, ఎజెండా ప్రకటిస్తారని తెలుస్తోంది. అనంతరం ఢిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని సీఎం కేసీఆర్‌‌ యోచిస్తున్నారు. రైతులు, దళితులు, గిరిజనులు, మహిళలు, బీసీల సమస్యలే కేసీఆర్‌‌ జాతీయ పార్టీ ఎజెండాగా ఉండబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వ పథకాలపై దేశవ్యాప్తంతా విస్తృత ప్రచారం ప్రచారం చేయాలని ప్లాన్ చేస్తున్నారు. తెలంగాణలో ఏయే పథకాలు అమలవుతున్నాయి? ఇతర రాష్ట్రాల్లో కూడా వస్తే ఎలాంటి మార్పు వస్తుందన్న దానిని ఆయా రాష్ట్రాల ప్రజలకు వివరించనున్నారు.

  వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 పార్లమెంట్‌‌ సీట్లలో పోటీ చేయాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. పాత హైదరాబాద్‌‌ సంస్థానంలోని ప్రస్తుత తెలంగాణ, కర్నాటకలోని బీదర్‌‌, గుల్బర్గా, ఉస్మానాబాద్‌‌, రాయిచూర్‌‌, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌‌, పర్భణీ, నాందేడ్‌‌, బీడ్‌‌ ప్రాంతాలపై ప్రధానంగా ఫోకస్‌‌ పెట్టనున్నట్లు సమాచారం. వీటితో పాటు దేశవ్యాప్తంగా బలమైన రైతు ఉద్యమ నేతలు ఉన్న ప్రాంతాల్లో కేసీఆర్ పర్యటించనున్నారు. అక్కడ రైతు ఉద్యమ నేతలను ఎన్నిక బరిలో దింపాలన్న యోచనలో ఆయన ఉన్నారు. 2024 పార్లమెంట్‌‌ ఎన్నికల్లో కనీసం 50 లోక్‌‌సభ స్థానాల్లో కారు గుర్తుపై అభ్యర్థులను దించేలా ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారట. కర్నాటకలో సినీ నటుడు ప్రకాశ్‌‌ రాజ్‌‌, గుజరాత్‌‌లో ఆ రాష్ట్ర మాజీ సీఎం శంకర్‌‌ సింగ్‌‌ వాఘేలా కేసీఆర్‌తో కలిసి పనిచేసే అవకాశముందని సమాచారం. ఏపీలోనూ కేసీఆర్‌కు అభిమానులున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా కొన్ని సీట్లలో పోటీ చేసే అవకాశముంది. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్‌గానే పోటీచేసి.. ఫలితాల ఆధారంగా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారట. వీటన్నింటిపై త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశముంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: CM KCR, KCR New Party, Telangana, Trs

  ఉత్తమ కథలు