తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన 'దళిత సాధికారత' పథకానికి సీఎం కేసీఆర్ పేరును ఖరారు చేశారు. ఈ పథకానికి 'దళిత బంధు' అని నామకరణం చేశారు. రాష్ట్రంలో మొదట ఒక నియోజకవర్గాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా పథకాన్ని అమలు చేయనున్నారు. అందుకోసం త్వరలోనే ఉపఎన్నికలు జరగనున్న హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఎంపిక చేశారు. ఈ పథకాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రారంభిస్తారు. త్వరలోనే ఆయన హుజూరాబాద్‌లో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే అనేక కార్యక్రమాలను ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచే ప్రారంభించారు. రైతు బంధు, రైతు బీమా పథకాలను కూడా అక్కడి నుంచే అమలు చేశారు. ఈ నేపథ్యంలో దళిత బంధు పథకాన్ని కూడా మొదట కరీంనగర్ నుంచే అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.
హుజూరాబాద్ నియోజవర్గం తర్వాత రాష్ట్రమంతటా పథకాన్ని అమలు చేస్తారు. రూ.1200 కోట్లతో దళిత బంధు పథకం ప్రారంభంకానుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ తెలిపారు. మొదటి దశలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 100 కుటుంబాల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 11,900 కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు. మధ్యవర్తులతో ప్రేమయం లేకుండా.. రైతుబంధు పథకం మాదిరిగానే నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తారు. తొలిదశలో కొంత లబ్ధిదారులను లాటరీ విధానంలో ఎంపిక చేసి వారి ఖాతాల్లో డబ్బును జమచేస్తారు. వృద్ధాప్య పించన్లు, రైతు బంధు పంపిణీ తరహాలోనే ఇది పథకం కూడా పారదర్శకంగా అమలుకానుందని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది.
వచ్చే నాలుగేళ్లలో రూ.40 వేల కోట్లు ఈ పథకం కింద ఖర్చు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ కేటాయింపులు ఎస్సీ సబ్ ప్లాన్‌కు అదనం. రాష్ట్రంలో ఉన్న నిరుపేద దళితులు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాన్నదే తమ లక్ష్యమని సీఎం కేసీఆర్ అఖిలపక్ష సమావేశంలో తెలిపారు. ఈ పథకం విధివిధానాల రూపకల్పన కోసం మంత్రులు, దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర పార్టీలకు చెందిన నేతల అభిప్రాయాలను సీఎం కేసీఆర్ తెలుసుకున్నారు. దళిత సాధికారత పథకంపై బీజేపీ మినహా ఇతర విపక్షాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. ఈ పథకంతో నిరుపేద దళిత కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని ఇటీవల జరిగిన అఖిల పక్ష సమావేశం సందర్భంగా నేతలు అభిప్రాయపడ్డారు. ఐతే ఈ పథకాన్ని మొదట హుజూరాబాద్ నుంచే ప్రారంభిస్తామని ప్రకటించడం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Huzurabad, Huzurabad By-election 2021, Telangana