ఆర్టీసీలో వీఆర్‌ఎస్ కాదు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..?

TSRTC Strike : ఆర్టీసీలో సాధ్యమైనంత మందికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) అమలు చేసే యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. వీఆర్‌ఎస్‌ అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న కార్మికులలో దాదాపు 12వేల మంది కార్మికులు దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది.

news18-telugu
Updated: November 27, 2019, 1:18 PM IST
ఆర్టీసీలో వీఆర్‌ఎస్ కాదు.. తెరపైకి కొత్త ప్రతిపాదన..?
ఆర్టీసీ, సీఎం కేసీఆర్
  • Share this:
ఆర్టీసీలో కొంత భాగాన్ని ప్రైవేటీకరణ చేసేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని కోర్టులో సవాలు చేస్తే ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణకు రంగం సిద్ధమైనట్లే. సీఎం కేసీఆర్ చెప్పిన దాని ప్రకారం.. మొత్తం 100 శాతంలో.. 50 శాతం ఆర్టీసీ రూట్లను ప్రైవేటు చేతికి అప్పగించనున్నారు. అంటే.. 10,400 రూట్లలో 5100 రూట్లను ప్రైవేటుపరం చేయనున్నారు. ప్రస్తుతం 48 వేల మంది ఆర్టీసీ కార్మికులు సంస్థలో పనిచేస్తున్నారు. అయితే.. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే 50 శాతం ప్రైవేటు వ్యక్తుల చేతికి వెళ్లనుంది. అప్పటికి ఆర్టీసీ సంస్థకు 24వేల మంది కార్మికులు మాత్రమే అవసరం అవుతారు. ఈ నేపథ్యంలో మిగతా వాళ్లను ఎక్కడ భర్తీ చేయడం? వాళ్లకు ఉపాధి ఎలా? అని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకే సాధ్యమైనంత మందికి వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్(వీఆర్ఎస్) అమలు చేసే యోచనలో కేసీఆర్ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. వీఆర్‌ఎస్‌ అమలు చేస్తే ప్రస్తుతం ఉన్న కార్మికులలో దాదాపు 12వేల మంది కార్మికులు దాన్ని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి 50 ఏళ్ల వయసున్న కార్మికులు దీన్ని వినియోగించుకోవచ్చు.

అయితే, 24వేల మందిలో 12 వేల మంది వీఆర్‌ఎస్‌ను వినియోగించుకునే అవకాశం ఉంటే.. అందులో ఎంతమంది దాన్ని వినియోగించుకుంటారు? మరి మిగతా కార్మికుల సంగతేంటి? అన్నది తేలాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. ప్రైవేటీకరణపై కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి రెండు, మూడు రోజులుగా సీఎం కేసీఆర్.. రవాణా శాఖ మంత్రి పువ్వాడ, ఆర్టీసీ అధికారులతో సుదీర్ఘ చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా తెరపైకి కొత్త వాదన వచ్చినట్లు తెలుస్తోంది.

వాలంటరీ రిటైర్మెంట్ స్కీమ్ కాకుండా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్(సీఆర్‌ఎస్)ను అమలు చేసే యోచన కూడా సీఎం కేసీఆర్ మదిలో ఉన్నట్లు తెలుస్తోంది. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవాలా? వద్దా? అనేది కార్మికుల ఇష్టానికే వదిలేస్తారు. అయితే, ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ.. ఈ స్కీమ్ అమలు చేస్తే భారీగానే ఆర్థిక భారాన్ని మోయాల్సి ఉంటుంది. అందువల్ల సీఆర్‌ఎస్‌ను అమలు చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. దాని ప్రకారం కార్మికులు కచ్చితంగా రిటైర్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే..దానికి కొన్ని కఠినమైన నిబంధనలే ఉన్నాయి. మరి, ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందన్నది తెలియాల్సి ఉంది. దీనిపై రేపు కేబినెట్ భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అటు.. 52 రోజుల సమ్మెను విరమించి విధుల్లో చేరతామని కార్మికులు అంటే ఆ అవసరం లేదని ఆర్టీసీ స్పష్టం చేసింది. ఎవ్వరినీ విధుల్లోకి తీసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. లేబర్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే ముందుకు సాగుతామని వెల్లడించింది. ఈ నేపథ్యంలో లేబర్ కోర్టు ఇచ్చే తీర్పు, తదనంతరం ప్రభుత్వం తీసుకునే చర్యలపైనే అందరి ఆసక్తి నెలకొంది.
Published by: Shravan Kumar Bommakanti
First published: November 27, 2019, 12:29 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading