31.1.22
( జి.శ్రీనివాసరెడ్డి, కరస్పాండెంట్, న్యూస్18 తెలుగు, ఖమ్మం జిల్లా)
అందరూ సీనియర్లు. దాదాపు అందరూ రాజకీయ ఉద్దండ పిండాలే. ఎవరినీ ఏమీ అనలేని పరిస్థితి. గత సాధారణ ఎన్నికల అనంతరం జిల్లాలో ఉన్న నేతలంతా ఒకే పడవలో ఎక్కినాక.. పార్టీ అధిష్టానానికి తలనొప్పులు పెరిగాయని చెప్పక తప్పదు. సీనియర్లు అందరూ ఒక వేదికను పంచుకునే పరిస్థితి సైతం లేదన్నది నిష్టురమే అయినా నిజం. పార్టీకి ఎవరు ఎంతమేర బలం చేకూరుస్తున్నారో.. ఎంతమేర నష్టపరుస్తున్నారో స్పష్టమైన నివేదికలు ఉన్నప్పటికీ.. ఎవరినీ కాదనుకోలేని దుస్థితి. ఎవరిపైనా కన్నెర్ర చెయ్యలేని పరిస్థితి. పేరుకు ఆబ్సల్యూట్‌గా పార్టీకి బలం ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కడికక్కడ ఇంటిపోరుతో లుకలుకలు కనిపిస్తున్న పరిస్థితుల్లో.. తెరాస అధినేత, సీఎం కేసీఆర్ తానే స్వయంగా రంగంలోకి దిగారా..? అంటే నిజమే అంటున్నాయి పార్టీ శ్రేణులు.
వచ్చే ఏడాది ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితుల్లో పార్టీని ఇలా అనార్గనైజ్డ్‌గా వదిలేస్తే.. పాత ఫలితాలే పునరావృతం అయితే.. సరిగ్గా ఇక్కడే పార్టీ అధినేత తనదైన రాజకీయ చాతుర్యం ప్రదర్శించారన్నది పరిశీలకుల మాట. గత కొన్నేళ్లుగా పార్టీకి సేవలందిస్తూ.. తనకు నమ్మిన బంటుగా ఉన్నటువంటి వ్యక్తికే జిల్లా పార్టీ పగ్గాలు అందించారు. ఇక నుంచి నేను చూస్తుంటాను అన్న సంకేతాలను పరోక్షంగా ఇచ్చారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవిలో ఉన్న తాతా మధుసూదన్‌కు పార్టీ పగ్గాలు సైతం ఇవ్వడం ద్వారా జిల్లాలోని అతిరధ మహారధులైన పార్టీ నేతలందరికీ ఖచ్చితమైన మెసేజ్ పంపారు సీఎం కేసీఆర్.
Karimnagar : పసిప్రాయంలోనే పర్యావరణపై మమకారం.. చెట్ల పెంపకానికి ఏం చేస్తుందంటే...
ఖమ్మం జిల్లా రాజకీయంగా పూర్తి వైవిధ్యం ఉండే ఈ జిల్లాలో ఇప్పుడు అధికార తెరాస పార్టీకి నేతలకు కొదవలేదు. వామపక్షాలు మినహాయించి దాదాపు అన్ని పార్టీల్లోని ఉద్దండులు ఒకే పడవలోకి ఎక్కారు. ఇక అక్కడ బెర్త్‌లు లేక అవకాశం కోసం కాచుకుని ఎదురుచూస్తూ, ఒకరికి మరొకరు పొగపెట్టుకోవడం నిత్య కృత్యంగా మారింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో తెరాస సంస్థాగత ఏర్పాటులో భాగంగా ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నియమించారు. కొద్ది రోజుల క్రితమే స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన మధుసూదన్‌కు తాజాగా జిల్లా అధ్యక్ష పదవి కట్టబెట్టడం పెద్ద చర్చకు దారితీసింది.
ఎమ్మెల్సీ పదవికోసం ఎందరో ఉద్దండులు వేచిచూస్తున్నా, తెరాస అధినేత తాతా మధు పట్ల మొగ్గుచూపడం.. ఆనక ఏకంగా జిల్లా అధ్యక్ష పదవిని కట్టబెట్టడం.. ఇప్పటిదాకా జిల్లా పార్టీలో ఉన్న పవర్ సెంటర్‌ల సంఖ్య పెరిగినట్లయింది. దీనికితోడు జిల్లాలో ప్రాబల్యం ఉన్న కమ్మ సామాజిక వర్గాన్ని తెరాసవైపు పూర్తి స్థాయిలో తిప్పుకోడానికి ఇదో ఎత్తుగడగా భావిస్తున్నారు. గత ఎన్నికల్లో తెరాసకు ఇక్కడ ఈ సామాజికవర్గం మద్దతు ఆశించినమేర లభించలేదన్న అంశం కూడా ఈ నియామకానికి ఒక ప్రాతిపదిక అయిందన్న చర్చ కూడా ఉంది.
దీనికితోడు ఎన్నారైగా ఉన్న తాతా మధుసూదన్ తానాలో కార్యదర్శిగా పనిచేస్తూ అప్పట్లో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నారైల మద్దతును కూడగట్టడంలో కృషి చేయడం.. ఆనక స్వదేశం తిరిగొచ్చి తెరాసలో కార్యదర్శిగా పూర్తిస్థాయిలో పనిచేయడం.. తనకున్న వామపక్ష నేపథ్యం, 2009 ఎన్నికలకు ముందు ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేసి ఉండడం.. లాంటివన్నీ తాతా మధుసూదన్ ఎంపికకు..నిన్నమొన్న ఎమ్మెల్సీ టికెట్‌కు అయినా, నేడు పార్టీ జిల్లా అధ్యక్ష పదవికైనా ఉపకరించింది. దీనికితోడు రైతుబంధు రాష్ట్ర సమితి కన్వీనర్ అయిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో తనకున్న సాన్నిహిత్యం సైతం మధుకు ఉపకరించిందని చెప్పొచ్చు. 2018 డిసెంబర్‌లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది సీట్లకు గానూ తెరాస కేవలం ఒకే ఒక్క సీటు ఖమ్మం నియోజకవర్గాన్ని గెలుపొందింది.
రాష్ట్రంలో తిరుగులేని ఆధిక్యంతో అధికారాన్ని నిలబెట్టుకున్న తెరాసకు ఇది ఇబ్బందికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జరిగిన యుద్ధంలో తమ కత్తులు తమకే గుచ్చుకున్నాయని పార్టీలోని ఆధిపత్య పోరును అధినేత కేసీఆర్ ఆవేదనగా చెప్పుకున్నారు. గెలుపొందిన ఒకేఒక్కడు పువ్వాడ అజయ్‌కుమార్‌కు మంత్రి పదవి ఇచ్చారు. అన్నీబాగానే ఉన్నా నేతల మధ్య ఆధిపత్యపోరు మాత్రం ఇప్పటికీ పదిలంగా ఉందనే చెప్పొచ్చు. ఒక జాతీయ పార్టీలో ఉండే స్థాయిలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉన్న విబేధాలు, కుమ్ములాటలు, వచ్చే ఎన్నికల్లో ఇబ్బంది పెడతాయన్న సంకేతాలు సర్వేల ద్వారా అందాయంటున్నాయి పార్టీ శ్రేణులు. ఇక తాను స్వయంగా రంగంలోకి దిగకపోతే పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదని భావించిన పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తనకు నమ్మకస్తుడైన వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పగించినట్టు చెబుతున్నారు.
మిగిలిన నేతలతో పోల్చినపుడు కమిట్‌మెంట్ మినహా, పెద్దగా అంగబలం, అర్థబలం లేని తాతా మధుసూదన్ ఇక పార్టీ వేదికనే బలమైన ఆయుధంగా మలచుకోవాల్సి ఉంది. నేతలను సమన్వయం చేయడం, శ్రేణులకు అందుబాటులో ఉండడం.. వచ్చే ఎన్నికల కోసం బలమైన నేతలను సూచించడం, అంతిమంగా పార్టీకి నంబర్ పెంచడం లక్ష్యంగా తాతా మధుసూదన్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఒక ఫుల్‌టైం పొలిటీషియన్ చేతికి జిల్లా పార్టీ పగ్గాలు ఇవ్వడం ద్వారా కమిట్‌మెంట్ ఉంటే భవిష్యత్తు ఉంటుందన్న బలమైన సంకేతం ఇచ్చినట్లయింది. మరి జిల్లా పార్టీలోని నేతల మధ్య ఉన్న పొరపొచ్చాలను మధుసూదన్ ఏమేరకు సరిదిద్దగలరు.. విజయతీరాలకు ఏమేరకు చేర్చగలరన్నది కాలమే నిర్ణయించాల్సి ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.