పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలపై కేసీఆర్ కీలక నిర్ణయం..

పీవీ నరసింహారావు (File)

పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.

  • Share this:
    బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు దేశానికి అందించిన విశిష్ట సేవలను గొప్పగా తలుచుకునే విధంగా, చిరస్మరణీయంగా నిలిచే విధంగా శత జయంతి ఉత్సవాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు. శత జయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణం రూ.10 కోట్ల కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి, నిధులు విడుదల చేసుకుంటూ పోతామని తెలిపారు. ఆయన జయంతి అయిన జూన్ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో ప్రధాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. అదే రోజు ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 దేశాల్లో పివి జయంతి వేడుకలు నిర్వహిస్తామని ప్రకటించారు.

    పివి నరసింహారావు శత జయంతి ఉత్సవాల నిర్వహణకు సంబంధించి ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రామేశ్వరంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మెమోరియల్ పెట్టిన విధంగానే హైదరాబాద్ లో పివి మెమోరియల్ ఏర్పాటు కావాలని తెలిపారు. కెకె నేతృత్వంలోని కమిటి సభ్యులు రామేశ్వరం వెళ్లి వచ్చి, పివి మెమోరియల్ ఎలా ఉండాలో ప్రభుత్వానికి సూచించాలని అన్నారు. పీవీ నరసింహారావు దేశం గర్వించదగ్గ నాయకుడని.. దేశ గతిని మార్చిన గొప్పవారని కేసీఆర్ అన్నారు. భారతరత్న పురస్కారానికి సంపూర్ణ అర్హులని.. పివికి భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మంత్రివర్గం, అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుందని తెలిపారు. ప్రధాని వద్దకు తానే స్వయంగా వెళ్లి భారతరత్న ఇవ్వాలని విన్నవిస్తాని కేసీఆర్ తెలిపారు.

    భారత పార్లమెంటులో పివి చిత్రపటం పెట్టాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కోరతామన్న కేసీఆర్... మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లతో పీవీకి ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. వారిద్దరినీ కూడా భాగస్వాములను చేసే విధంగా ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలని తెలిపారు. కేసీఆర్ నిర్వహించిన సమీక్షలో ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మన్ కె.కేశవరావు, మంత్రి ఈటల రాజెందర్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సలహాదారు రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్ రావు, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, పివి నరసింహారావు కుమారుడు పివి ప్రభాకర్ రావు, కుమార్తె వీణాదేవి, సిఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.
    First published: