Home /News /telangana /

CM KCR Huzurabad Tour: రేపు హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

CM KCR Huzurabad Tour: రేపు హుజురాబాద్‌లో సీఎం కేసీఆర్ పర్యటన.. పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Dalitha Bandhu Scheme | Huzurabad: సోమవారం దళిత బంధు ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం 15 మంది లబ్ధిదారులతకు సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను అందజేయనున్నారు. ఈ సభను దాదాపు లక్ష మందితో నిర్వహించనున్నారు.

    ప్రస్తుతం తెలంగాణలో అందరి కళ్లు హుజురాబాద్ మీదే ఉన్నాయి. ఎందుకంటే ఉపఎన్నికలతో పాటు దళిత బంధు పథకం కూడా అక్కడే ప్రారంభం కానుంది. సోమవారం హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మండలం శాలపల్లిలో దళిత బంధు ప్రారంభోత్సవ సభ జరగనుంది. సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి షెడ్యూల్ ఖరారయింది. సోమవారం మధ్యాహ్నం 1 గంటకు ఎర్రవెల్లి వ్యవసాయక్షేత్రం నుంచి సీఎం కేసీఆర్ హుజురాబాద్ బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:40 గంటలకు సభా స్థలికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు శాలపల్లిలో గ్రామంలో జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఇప్పటికే సభా ఏర్పాట్లను పూర్తి చేశారు. మంత్రి హరీష్ రావు దగ్గరుండి మరీ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

    సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పతకాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా హుజురాబాద్ నియోజకవర్గంలో అమలు చేయనున్నారు. సోమవారం ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం 15 మంది లబ్ధిదారులతకు సీఎం కేసీఆర్ స్వయంగా చెక్కులను అందజేయనున్నారు. ఈ సభను దాదాపు లక్ష మందితో నిర్వహించనున్నారు. హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి దళిత కుటుంబాలు తరలిరానున్నాయి. దళిత పథకం అమలు చేసే తీరును, దాని వల్ల కలిగే ప్రయోజాల గురించి  ప్రజలకు వివరించనున్నారు సీఎం కేసీఆర్.

    శాలపల్లి-ఇంద్రానగర్‌లో సోమవారం జరిగే సీఎం కేసీఆర్ సభకు సర్వం సిద్ధం చేశారు. మొత్తం 20 ఎకరాల్లో లక్షా 20వేల మందితో సభ నిర్వహించేలా ఏర్పాట్లుచేశారు. సభా ప్రాంగణంలోని స్టేజీపై సుమారు 250 మంది కూర్చునే విధంగా సిద్ధం చేశారు. వర్షం వచ్చే సూచనలు ఉండడంతో ముందు జాగ్రత్తగా రెయిన్‌ఫ్రూఫ్‌ టెంట్లను వేస్తున్నారు. దళితబంధు పథకానికి హుజురాబాద్‌లో మొదట ఐదువేల కుటుంబాలను ఎంపిక చేశారు. ఇందుకోసం రూ. 500 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సీఎం కేసీఆర్ సభ జరుగనుంది.

    దళిత బంధు పథకాన్ని అన్ని పార్టీలు స్వాగతించినప్పటికీ.. ఉపఎన్నిక సమయంలో, అది కూడా హుజురాబాద్ నియోజకవర్గంలోనే మొదటగా ఇవ్వడం పట్ల విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే అధికారికంగా ఓట్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని దుమ్మెత్తిపోస్తున్నాయి. తెలంగాణ అంతటా దళితులందరికీ రూ.10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఐతే విపక్షాల అసత్య ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని.. అర్హులైన అందరికీ దళిత బంధు అందుతుందని ఇప్పటికే హరీష్ రావు చెప్పారు. మరోవైపు ఈటల రాజేందర్ కూడా దూకుడు మీదున్నారు. హుజురాబాద్‌లో దళితులందరికీ పథకాన్ని వర్తింప జేయాలని లేదంటే దీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు.

    ఈ పరిణామాల నేపథ్యంలో హజురాబాద్ దళిత బంధు ప్రారంభోత్సవ సభలో సీఎం కేసీఆర్ ఏం మాట్లాడతారని.. విపక్షాల విమర్శలకు ఎలా కౌంటర్ ఇస్తారో అని అందరూ చర్చించుకుంటున్నారు. అంతేకాదు ఈటల రాజేందర్ వ్యవహారంపై సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఎక్కడా బహిరంగంగా స్పందించలేదు. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరి రేపటి బహిరంగ సభలో ఈటలపై ఏమైనా విమర్శనాస్త్రాలు సంధిస్తారా? లేదా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలోనే సీఎం ప్రసంగంపై హుజురాబాద్‌తో పాటు తెలంగాణ ప్రజలందరికీ ఆసక్తి నెలకొంది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: CM KCR, Dalitha Bandhu, Huzurabad, Huzurabad By-election 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు