కల్నల్ సంతోష్ భార్యకు డిప్యూటీ కలెక్టర్ పోస్ట్.. ఫ్యామిలీతో సీఎం కేసీఆర్ లంచ్

సంతోషికి నియామక పత్రాన్ని అందజేస్తున్న సీఎం కేసీఆర్

సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు సీఎం కేసీఆర్.

 • Share this:
  గత నెలలో భారత్-చైనా సైన్యం ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ కుటుంబం బుధవారం  ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ని కలిసింది.  ఈ సందర్భంగా కల్నల్ సంతోష్ భార్య సంతోషిని డిప్యూటీ కలెక్టర్‌గా నియమిస్తూ నియామక పత్రాన్నిఅందజేశారు సీఎం. సంతోషికి హైదరాబాద్ పరిసర ప్రాంతంలోనే పోస్టింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆమెకు సరైన శిక్షణ ఇప్పించి, ఉద్యోగంలో కుదరుకునే వరకు తోడుగా ఉండాలని తన కార్యదర్శి స్మితా సభర్వాల్‌కు సూచించారు సీఎం కేసీఆర్.

  అనంతరం సంతోషితో పాటు వచ్చిన 20 మంది కుటుంబ సభ్యులతో కలిసి మధ్యాహ్నం లంచ్ చేశారు. ఈ సందర్భంగా వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన సంతోష్ బాబు కుటుంబానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుదని మరోసారి భరోసా ఇచ్చారు సీఎం కేసీఆర్.


  ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ఎంపీ బడుగుల లింగయ్య, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, సైదిరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ దీపిక, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

  కాగా, జూన్ 14, 15 తేదీల్లో ఇండియా, చైనా సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డారు. ఈ ఘటనలో సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోష్ బాబు సహా మొత్తం 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా వైపు కూడా భారీగా ప్రాణం నష్టం జరిగింది. 40 మందికి పైగా చైనీయులు చనిపోయారని అంతర్జాతీయ కథనాలు పేర్కొన్నాయి. ఐతే ఎంత మంది మరణించారన్న దానిపై చైనా ఇప్పటి వరకు నోరు విప్పలేదు.
  Published by:Shiva Kumar Addula
  First published: