Huzurabad-Dalitha Bandhu: హలో రామస్వామి.. ప్రగతి భవన్‌కు రండి.. ఎంపీటీసీకి సీఎం కేసీఆర్‌కు ఫోన్

సీఎం కేసీఆర్

హుజూరాబాద్ నియోజవర్గ పరిధిలోని దళితులతో ప్రగతి భవన్‌లో ఈ నెల 26న అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో చ‌ర్చించ‌నున్నారు.

  • Share this:
    దళితుల సాధికారత కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న దళిత బంధు పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. ముందుగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో దళిత బంధును అమలు చేయనున్నారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తనుగుల ఎంపీటీసీ భర్త రామస్వామికి సీఎం కేసీఆర్ శనివారం ఫోన్ చేశారు. హుజూరాబాద్ నియోజక పరిధిలోని ఎస్సీలు సోమవారం ప్రగతిభవన్‌కు రావాలని ఆహ్వానించారు. దళిత బంధు పథకం గురించి అన్ని గ్రామాలకు తెలియజేయాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని చెప్పారు. హుజూరాబాద్‌లో ద‌ళిత బంధు విజయవంతంమవడంపైనే ఎస్సీల భ‌విష్య‌త్ ఆధార‌ప‌డి ఉంద‌ని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఈ పథకం దేశం, ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.

    తెలంగాణ దళిత బంధు పథకం మొట్ట మొదటగా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజవర్గ పరిధిలోని దళితులతో ప్రగతి భవన్‌లో ఈ నెల 26న అవగాహన సదస్సు జరగనుంది. పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ, విజయం సాధించే దిశగా తీసుకోవాల్సిన కార్యాచరణపై సీఎం సదస్సులో చ‌ర్చించ‌నున్నారు. ఈ అవగాహన సదస్సుకు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం, ప్రతీ మున్సిపాలిటీ నుంచి నలుగురు చొప్పున మొత్తం 412 మంది దళిత పురుషులు, మహిళలు హాజ‌రుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం వరకు ఈ పథకం గురించి చర్చించనున్నారు.

    హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు కలిపి నలుగురికి ఆహ్వానం అందింది. అలాగే ప్రతి మున్సిపాలిటీలోని ఒక్కో వార్డు నుంచి నలుగురు చొప్పున సీఎంతో జరిగే సమావేశంలో పాల్గొంటారు. మొత్తంగా 412 మంది దళిత పురుషులు, మహిళలు సదస్సుకు హాజరవుతారు. వారితో పాటు 15 మంది రిసోర్స్‌ పర్సన్స్‌ కూడా సమావేశానికి హాజరవుతారు. దళిత బంధు అవగాహన సదస్సుకు హాజరయ్యే వారంతా జులై 26న ఉదయం 7 గంటల్లోపు తమ గ్రామాల నుంచి మండల కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ టిఫిన్ చేసిన తర్వాత ప్రత్యేక బస్సుల్లో హుజూరాబాద్ కేంద్రానికి వెళ్తారు. అక్కడ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించి హైదరాబాద్‌కు బయలుదేరుతారు. దళిత బంధు పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది దళితుల జీవితాల్లో ఎలాంటి మార్పులు తీసుకురాబోతోంది? అధికారులతో ఎలా సమన్వయం చేసుకోవాలి? అనే అంశాలపై వారికి సీఎం కేసీఆర్ స్వయంగా అవగాహన కల్పిస్తారు.

    పథకం అమలు కోసం హుజూరాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లోని దళిత కుటుంబాల వివరాల స్థితి గతులను తెలుసుకుంటున్నారు. ఆ తర్వాత నిబంధనలను అనుసరించి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఇందులో హుజూరాబాద్ నియోజకవర్గంలో హుజూరాబాద్ మండలంలోని 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4346 కుటుంబాలకు, వీణవంక మండలంలో 3678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4996 కుటుంబాలకు, ఇల్లంతకుంట మండలంలో 2586 కుటుంబాలకు మొత్తంగా హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 దళిత కుటుంబాలనుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల ప్రకారం, అర్హులైన ఎంపిక చేయబడిన లబ్ధిదారుల కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని పరిపూర్ణస్థాయిలో వర్తింపచేస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published: