news18-telugu
Updated: October 19, 2020, 4:41 PM IST
సీఎం కేసీఆర్
భారీ వర్షాలు, వరదల వల్ల హైదరాబాద్ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎన్నో కష్ట నష్టాలకు గురయ్యారని.. వారందరినీ ఆదుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. వరద నీటిలో మునిగిన ఇళ్లలో నివసిస్తున్న వారు ఎంతో నష్టపోయారన్నారు. ఇళ్లలోకి నీరు రావడం వల్ల నిత్యవసరాలు తడిసి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వరద నీటి ప్రభావానికి గురైన హైదరాబాద్ నగరంలోని ప్రతీ ఇంటికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. ఈ ఆర్థిక సాయం అందించే ప్రక్రియ మంగళవారం ఉదయం నుంచే ప్రారంభిస్తామని వెల్లడించారు. వర్షాలు, వరదల వల్ల ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి రూ. లక్ష చొప్పున, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
దెబ్బతిన్న రహదారులు, ఇతర మౌలిక వసతులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ మామూలు జీవన పరిస్థితులు నెలకొనేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. పేదలకు సాయం అందించడం కోసం మున్సిపల్ శాఖకు రూ. 550 కోట్ల తక్షణ సాయం విడుదల చేస్తున్నామని ప్రకటించారు. గడిచిన వందేళ్లలో ఎన్నడూ లేనంత భారీ వర్షం హైదరాబాద్ నగరంలో కురిసిందన్నారు. హైదరాబాద్ నగర పరిధిలోని రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు వారి బృందాలు వెంటనే రంగంలోకి దిగి మంగళవారం ఉదయం నుంచే ఆర్థిక సాయం అందించే కార్యక్రమం చేపట్టాలని సీఎం ఆదేశించారు. నగరంలో 200-250 బృందాలను ఏర్పాటు చేసి అన్ని చోట్ల సాయం అందించే కార్యక్రమం పర్యవేక్షించాలని సీఎస్ సోమేష్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
పేదలకు సాయం అందించడం ముఖ్యమైన బాధ్యతగా స్వీకరించి నగరానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని సీఎం సూచించారు. నష్టపోయిన ప్రజలు ఎంత మంది ఉన్నా సరే.. సాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు హైదరాబాద్ నగరంలోని వరద బాధితులకు సాయం అందించేందుకు ఆర్థిక శాఖ రూ. 550 కోట్లను మున్సిపల్ శాఖకు విడుదల చేసింది.
భారీ వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి పారిశ్రామికవేత్తలు, వర్తక, వాణిజ్య, వ్యాపార ప్రముఖులు ముందుకు రావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. సీఎంఆర్ఎఫ్ కు విరాళాలు అందించాలని కోరారు. వర్షాలు, వరదలతో నష్టపోయిన రాష్ట్రానికి రూ. 10 కోట్లు ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రికి కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు.
Published by:
Nikhil Kumar S
First published:
October 19, 2020, 4:08 PM IST