news18-telugu
Updated: September 7, 2019, 5:33 PM IST
గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ (File)
తెలంగాణ గవర్నర్ నరసింహన్ పదవీకాలం ముగియడంతో ఆయనకు ఆత్మీయ వీడ్కోలు పలికారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రగతిభవన్‌లో నరసింహన్ దంపతులను ఘనంగా సత్కరించి, విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇద్దరూ తమ జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. నరసింహన్ సేవలు కోల్పోవడం అత్యంత బాధగా ఉందన్నారు కేసీఆర్. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన గవర్నర్‌గా రావడంతో ఉద్యమాన్ని తొక్కేస్తారని కొందరు భయపడ్డారని చెప్పారు. నరసింహన్ గవర్నర్‌గా ఉన్నప్పుడే తెలంగాణ రావడం, రెండు సార్లు టీఆర్ఎస్ అధికారంలోకి రావడం వంటి విషయాలను కేసీఆర్ ప్రస్తావించారు. తనను సీఎంలా కాకుండా ఓ తమ్ముడిలా ఆదరించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగం మధ్యలో కేసీఆర్ పలుమార్లు ఉద్వేగానికి లోనయ్యారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను కేంద్రంలో పెద్దలకు గవర్నర్ నరసింహన్ వివరించడం వల్ల వారి నుంచి ప్రశంసలు వచ్చేవన్నారు. నరసింహన్‌ను తాను అన్నలా భావించాను కాబట్టే, యాదాద్రి అభివృద్ధి పనుల ప్రారంభం సందర్భంగా వారి పాదాలకు నమస్కరించామన్నారు. యాదాద్రి పనులు పూర్తయ్యాక నరసింహన్ మళ్లీ వచ్చి పూజలో పాల్గొనాలని ఆకాంక్షించారు.

కేసీఆర్, గవర్నర్ నరసింహన్ (ఫైల్ ఫొటో)
కేసీఆర్ లాగానే నరసింహన్ కూడా తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. కేసీఆర్‌లో సంస్కారం తనకు ఎంతో నేర్పిందన్నారు. తన తల్లి చనిపోయినప్పుడు కేవలం 15 నిమిషాల్లో తనవద్దకు వచ్చారని చెప్పారు. అస్తికలు నిమజ్జనం చేయడానికి హెలికాప్టర్లో పంపారని గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ తీసుకొచ్చిన పథకాల్లో మానవత్వం ఉందని గవర్నర్ నరసింహన్ అన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కంప్యూటర్ ఆపరేట్ చేసి, స్క్రీన్ పై పథకాల గురించి వివరించిన వైనాన్ని తాను ప్రధాన మంత్రికి కూడా చెప్పానన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణ కల సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు. గవర్నర్ తన ప్రసంగంలో సంస్కృత శ్లోకాలు చదివారు. చమత్కారాలతో గవర్నర్ ప్రసంగం సాగింది.

గవర్నర్ నరసింహన్‌తో సీఎం కేసీఆర్ భేటీ
వీడ్కోలు సభ అనంతరం గవర్నర్ దంపతుల గౌరవార్థం ముఖ్యమంత్రి కేసీఆర్ విందు ఇచ్చారు. గవర్నర్ గౌరవార్థం పూర్తి శాఖాహార భోజనం, అదీ ఉల్లిగడ్డ, ఎల్లిగడ్డ లేకుండా పెడుతున్నాం అని అంతకుముందు సభలోనే సీఎం ప్రకటించారు. విందు తర్వాత గవర్నర్ దంపతులు రాజ్ భవన్ వెళ్లారు. గవర్నర్ దంపతులను కారుదాకా వెళ్లి ముఖ్యమంత్రి దంపతులు సాగనంపారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
September 7, 2019, 5:33 PM IST