• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • CM DALITH EMPOWERMENT NEW SCHEME FOR DALITHS IN TELANGANA CM KCR TO DISCUSS ABOUT THE SCHEME INN ALL PARTY MEETING ON 27TH JUNE SK

CM KCR: 'దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్'పై సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం.. రేపు అఖిలపక్ష భేటీ

సీఎం కేసీఆర్

అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ శాసనసభాపక్ష నేతలు అఖిలపక్ష భేటీకి హాజరవుతారు. సీపీఎం, సీపీఐలోని సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శలకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు సీఎం కేసీఆర్.

  • Share this:
    తెలంగాణలో మరో కొత్త పథకం రాబోతోంది. దళితుల కోసం 'సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ స్కీమ్‌'ను రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రకటించిన విషయం తెలిసిందే. ఐతే ఆ పథకానికి సంబంధించి సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం విధి విధానాల రూపకల్పనలో భాగంగా జూన్ 27న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ఆయన నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో ఈ సమావేశం జరగనుంది. అన్ని పార్టీల దళిత ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ శాసనసభాపక్ష నేతలు అఖిలపక్ష భేటీకి హాజరవుతారు. సీపీఎం, సీపీఐలోని సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శలకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో దళిత అభ్యున్నతికి పాటుపడుతున్న ఇతర నాయకులను కూడా సమావేశానికి ఆహ్వానించనున్నారు. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా చర్చించి.. సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకం విధివిధానాలను రూపొందించనున్నారు.

    మరోవైపు తెలంగాణలో సంచలనం రేపిన దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్‌పై సీఎం కేసీఆర్ శుక్రవారం స్పందించారు. ఈ అంశంపై సీఎల్పీ నాయకుడు, మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్కతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జగ్గారెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ చైర్మన్ ప్రీతమ్ తదితరులు శుక్రవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఆ తర్వాత కాసేపటికే డీజీపీ మహేందర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనపై నిజనిర్ధారణ చేసి, చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే వారిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ఆదేశించారు. ఇటువంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో మరణించిన మరియమ్మ కుమారుడు, కుమార్తెలను ప్రభుత్వం ఆదుకుంటుందని సీఎం కేసీఆర్ తెలిపారు. కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం, నివాస గృహంతో పాటు, రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియాను అందజేయాలని, మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో 10 లక్షల రూపాయలను ఆర్థిక సహాయం అందచేయాలని సీఎస్ సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. చింతకానికి వెళ్లి లాకప్ డెత్ సంఘటనా పూర్వాపరాలను తెలుసుకుని బాధితులను పరామర్శించి రావాలని డీజీపీని ఆదేశించారు.

    రాష్ట్రంలో లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వరుస కార్యక్రమాలతో సీఎం కేసీఆర్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు జిల్లాల్లో ఆయన పర్యటించారు. సిద్దిపేటలో కలెక్టేట్, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం కామారెడ్డిలోనూ నూతన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత వరంగల్‌కు కూడా వెళ్లారు. జిల్లాల పర్యటన సందర్భంగా ఆయా ప్రాంతాలపై వరాల జల్లు కురిపించారు సీఎం కేసీఆర్. అంతేకాదు యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలోనూ ఆయన పర్యటించారు. ఊరి ప్రజలందరికీ విందు ఇచ్చి.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే.. వాసాలమర్రిని అంకాపూర్ తరహాలో అభివృద్ది చేస్తానని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్. అవసరమైతే మరో 20సార్లైనా గ్రామానికి వస్తానని చెప్పారు. ఇలా.. సీఎం కేసీఆర్ వరుస నిర్ణయాలపై బీజేపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శిస్తున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: