Home /News /telangana /

CISF TO TAKE OVER SECURITY OF BHARAT BIOTECH CAMPUS IN HYDERABAD VB

CISF to take Security of campus: సీఐఎస్ఎఫ్ చేతుల్లోకి ఆ క్యాంపస్.. కేంద్రం కీలక నిర్ణయం.. వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

CISF to take Security of Bharat biotech campus: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్‌ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయాన్ని తీసుకుంది. భారత్ బయోటెక్​ సంస్థకి భద్రత కల్పించాలని కేంద్రం నిర్ణయించింది.

ఇంకా చదవండి ...
  హైదరాబాద్ శామీర్ పేట్ లో ఉన్న భారత్​ బయోటెక్​ ప్లాంట్ కు సీఐఎస్​ఎఫ్(సెంట్రల్ ఇండస్ట్రియల్ అండ్ సెక్కూరిటీ ఫోర్స్)​ భద్రత కల్పిస్తారు. కోవాగ్జిన్ సృష్టికర్తగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఈ ఫార్మా కంపెనీ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ ఇక కేంద్రం పరిధిలోకి వెళ్లనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం ముహూర్తం కూడా పెట్టేసింది. ఇక ఈ కంపెనీ భద్రత అంశాలన్నీ యాజమాన్యం ఆధీనంలో గానీ.. తెలంగాణ పోలీసుల చేతుల్లో గానీ ఉండదు. కోవాగ్జిన్ సృష్టికర్తగా.. భారత్ బయోటెక్ క్యాంపస్.. హైదరాబాద్ నగర శివార్లలోని షామీర్‌‌పేట్ సమీపంలో గల తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో ఉంది. ప్రస్తుతం ఈ కంపెనీ సెక్యూరిటీ వ్యవహారాలన్నీ భారత్ బయోటెక్ యాజమాన్యమే చూసుకుంటోంది. కోవాగ్జిన్‌ను అభివృద్ధి చేసిన తరువాత.. ఒక్కసారిగా ఈ ఫార్మా కంపెనీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతోంది. జీనోమ్ వ్యాలీ క్యాంపస్.. జీనోమ్ వ్యాలీలోని క్యాంపస్‌లోనే ఈ వ్యాక్సిన్ తయారవుతోంది. త్వరలోనే బెంగళూరు, గుజరాత్‌లల్లో కొత్త క్యాంపస్‌ను నెలకొల్పడానికి భారత్ బయోటెక్ యాజమాన్యం కసరత్తు చేస్తోంది.

  దీనికి అవసరమైన స్థలాన్ని కూడా సేకరించింది. ప్రస్తుతం అందరి కళ్లన్నీ జీనోమ్ వ్యాలీలోని భారత్ బయోటెక్ క్యాంపస్‌పైనే ఉన్నాయి. దీనితో ఆ సంస్థ భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. ఈ బాధ్యతను కేంద్రీయ పారిశ్రామిక బలగాల (సీఐఎస్ఎఫ్) చేతికి అప్పగించింది. వచ్చే వారం నుంచి కేంద్రం ఆదేశాలతో సీఐఎస్ఎఫ్ ఈ దిశగా చర్యలు తీసుకుంది కూడా. శామీర్​పేటలోని జీనోమ్ వ్యాలీలో ఉన్న సంస్థ కార్యాలయాన్ని, ప్లాంట్‌ను పారా మిలిటరీ ఫోర్స్‌కు చెందిన 64 మంది కమాండోలు ఇక మీదట నిరంతరం భద్రతను స్వయంగా పర్యవేక్షిస్తారు. రొటేషన్ పద్ధతిన రౌండ్ ద క్లాక్ ఈ క్యాంపస్ మొత్తం వారి ఆధీనంలోనే ఉంటుంది. కాగా, భారత్ లో కోవిషిల్డ్, కోవాగ్జిన్ రెండు వాక్సిన్లు ఉత్పత్తి అవుతున్న సంగతి తెలిసిందే. హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) లోని భద్రతా నిపుణుల సమీక్షా సమావేశం తరువాత భారత్ బయోటెక్ కంపెనీకి భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

  దేశ వైద్య, ఆరోగ్య భద్రత విషయంలో భారత్ బయోటెక్ ఒక ముఖ్యమైన సంస్థ అని.. ఈ సంస్థ ఉగ్ర ముప్పుని ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్‌ లోని భారత్ బయోటెక్ సంస్థకి సిఐఎస్‌ఎఫ్‌ భద్రత కల్పించనుందని హోం శాఖ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2008లో ముంబయి దాడుల అనంతరం దేశవ్యాప్తంగా ముప్పు ఉన్న పలు ప్రైవేటు ప్రదేశాలకు సాయుధ బలగాలతో భద్రతను అనుమతిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రస్తుతం పది ప్రైవేటు సంస్థలకు సీఐఎస్‌ఎఫ్‌ రక్షణ కల్పిస్తోంది. జూన్ 14వ తేదీ నుంచి ద‌ళాలు విధులు నిర్వ‌ర్తిస్తాయ‌ని సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్‌స్పెక్ట‌ర్ జ‌న‌ర‌ల్, ప్ర‌ధాన ప్ర‌తినిధి అనిల్ పాండే తెలిపారు. ప్ర‌జా ప్ర‌యోజ‌న సంబంధం ఉన్న కంపెనీల‌కు సీఐఎస్ఎఫ్ భ‌ద్ర‌త క‌ల్పిస్తుంది. పుణె, మైసూర్‌లోని ఇన్ఫోసిస్‌, న‌వీ ముంబైలోని రిల‌య‌న్స్ ఐటీ పార్క్‌, హ‌రిద్వార్‌లోని ప‌తంజ‌లి ఫ్యాక్ట‌రీల‌కు కూడా సీఐఎస్ఎఫ్ ద‌ళాలు భ‌ద్ర‌త‌ను క‌ల్పిస్తున్నాయి. భ‌ద్ర‌త‌కు అయ్యే ఖ‌ర్చును భార‌త్ బ‌యోటెక్ సంస్థ భ‌రించ‌నున్న‌ది.
  Published by:Veera Babu
  First published:

  Tags: Bharat Biotech, Central Government, CISF, Covaxin, Hyderabad, Sanjeevani

  తదుపరి వార్తలు