హోమ్ /వార్తలు /తెలంగాణ /

Dubbaka: అలా చేసింది కేసీఆరే.. దుబ్బాకలో కాంగ్రెస్‌ను గెలిపించాలన్న రేవంత్ రెడ్డి

Dubbaka: అలా చేసింది కేసీఆరే.. దుబ్బాకలో కాంగ్రెస్‌ను గెలిపించాలన్న రేవంత్ రెడ్డి

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, కేసీఆర్ (ఫైల్ ఫోటో)

Revanth Reddy: తనకు సిద్ధిపేట, దుబ్బాక రెండు కళ్లు అని హరీశ్ రావు అంటున్నారని.. అలాంటప్పుడు సిద్ధిపేట, గజ్వెల్, సిరిసిల్ల అభివృద్ధి చెందినట్టు దుబ్బాక ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నించారు.

  తెలంగాణలో ఒక నాయకుడు చనిపోతే వారి కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉండేదన్న రేవంత్ రెడ్డి... పీజేఆర్ చనిపోయినప్పుడు కేసీఆరే ఆ సంప్రదాయాన్ని తుంగలో తొక్కారని విమర్శించారు. దుబ్బాకలో కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కాంగ్రెస్ ముఖ్యనేతలతో కలిసి హాజరయ్యారు. సోలిపేట రామలింగారెడ్డి అంత గొప్ప వ్యక్తి అయితే.. నాలుగుసార్లు గెలిచిన ఆయనకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తనకు సిద్ధిపేట, దుబ్బాక రెండు కళ్లు అని హరీశ్ రావు అంటున్నారని.. అలాంటప్పుడు సిద్ధిపేట, గజ్వెల్, సిరిసిల్ల అభివృద్ధి చెందినట్టు దుబ్బాక ఎందుకు అభివృద్ధి కాలేదని ప్రశ్నించారు.

  తెలంగాణ అభివృద్ధి కావాలంటే, హామీలు అమలు కావాలంటే దుబ్బాకలో టిఆర్ఎస్‌కు బుద్ది చెప్పాలని రేవంత్ రెడ్డి అన్నారు. బీజేపీ, టిఆర్ఎస్ రెండు ఒకటే అని రేవంత్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో టిఆర్ఎస్‌ ఆఫీస్‌కు భూమి ఇచ్చింది బీజేపీనే అని అన్నారు. ఆణిముత్యం లాంటి ముత్యం రెడ్డి కొడుకును గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో రైతు నాయకుడంటే ముత్యం రెడ్డి అని మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఈ నియోజకవర్గ అభివృద్ధిలో అణువణువు ముత్యంరెడ్డి పాత్ర ఉందని తెలిపారు.

  తెలంగాణ ఇచ్చింది సోనియాగాంధీ అని.. ఈ ప్రాంతాన్ని ఆభివృద్ది చేసింది ముత్యం రెడ్డి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. అందువల్ల కాంగ్రెస్ అభ్యర్థి ముత్యంరెడ్డి కొడుకు శ్రీనివాస్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, సంపత్ కుమార్, ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఎమ్యెల్యేలు శ్రీధర్ బాబు, సీనియర్ నేతలు పొన్నాల, షబ్బీర్ అలీ, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Congress, Dubbaka By Elections 2020, Revanth reddy, Telangana

  ఉత్తమ కథలు