తెలంగాణ వరి ధాన్యం వివాదం మళ్లీ తారా స్థాయికి చేరింది. వంద శాతం ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలని, ఆ దిశగా భారీ ఆందోళనలు జరుపుతామని సీఎం కేసీఆర్ ప్రకటించిన దరిమిలా కేంద్రం సైతం ఘాటుగా స్పందించింది. రైతులను ఆదుకోవడం తమ బాధ్యత అని, రా రైస్ ను తప్పకుండా కొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. అందుకు తెలంగాణ ప్రభుత్వమే సహకరించడంలేదని ఆరోపించారు. కేసీఆర్ వరి పోరు ప్రకటనల క్రమంలో తెలంగాణ బీజేపీ కీలక నేతలు సోమవారం ఢిల్లీలో గోయల్ ను కలవగా, బియ్యం కొనుగోలుపై ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిపై సీఎం కేసీఆర్ తాజాగా మరో కౌంటరిచ్చారు.
తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర వాణిజ్య, ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్ మరింత స్ఫష్టత ఇచ్చారు. యాసంగి సీజన్ లోనూ కచ్చితంగా తెలంగాణ నుండి రా రైస్ కొనుగోలు చేస్తామని ప్రకటించారు. రైతులను ఆదుకోవడం తమ కనీస బాధ్యతని పీయూష్ గోయల్ చెప్పారు.దురద్రుష్టవశాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ఈ విషయంలో కేంద్రానికి సహకరించకుండా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల ఎంపీలు ధర్మపురి అరవింద్, సోయం బాపూరావు సోమవారం పార్లమెంట్ లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను కలిశారు. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేయకుండా తెలంగాణకు అన్యాయం చేస్తోందంటూ టీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తున్న విషయాన్ని వివరించారు.
ఈ సందర్భంగా పీయూష్ స్పందిస్తూ.. ‘అసలు రా రైస్ కొనబోమని చెప్పిందెవరు? దేశవ్యాప్తంగా బియ్యం ప్రొక్యూర్ చేస్తున్నప్పుడు తెలంగాణలో ఎందుకు ఆపుతాం? పక్కా రా రైస్ కొంటాం. రైతులకు ఇబ్బంది కాకుండా చూడటం మా కనీస బాధ్యత. అసలు గతంలో ఇస్తానన్న బియ్యం ఇంతవరకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వనేలేదు. అయినా దేశంలో ఎక్కడా లేని సమస్య తెలంగాణలోనే ఎందుకు వస్తోంది? పార్లమెంట్ సాక్షిగా గతంలోనే టీఆర్ఎస్ లేవనెత్తిన అంశాలన్నింటికీ సమాధానమిచ్చిన. ఇకపై భవిష్యత్తులో తెలంగాణ నుండి బాయిల్డ్ రైస్ పంపబోమని రాష్ట్ర ప్రభుత్వమే సంతం చేసింది కదా.. మళ్లీ వచ్చిన ఇబ్బంది ఏమిటి?’అని కేసీఆర్ కు తిరుగుప్రశ్నలేశారు.
పీయూష్ గోయల్ తో సమావేశం తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. మళ్లీ యాసంగి పేరుతో టీఆర్ఎస్ కొత్త డ్రామాలకు తెరదీసిందని విమర్శించారు. అకాల వర్షాల కారణంగా గతేడాది పసుపు పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం అందించే విషయంపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మంత్రి పీయూష్ గోయల్ తో చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సైతం ఫసల్ బీమా అమలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన పసుపు రైతులకు పరిహారం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిపాదనలు పంపితే... కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుందని హామీ ఇచ్చారు. కాగా,
పీయూష్ గోయల్ ప్రకటన తర్వాత హైదరాబాద్ వేదికగా మీడియాతో మాట్లాడిన సీఎం కేసీఆర్.. తాను మొత్తం ధాన్యం కొనుగోళ్ల గురించి మాట్లాడుతుంటే గోయల్ తెలివిగా ఉప్పుడు బియ్యం గురించి తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘మా దగ్గర ధాన్యం తీసుకోండి... ఏ రైస్ తీసుకుంటారో మీ ఇష్టం. బాయిల్డ్ రైస్ తీసుకుంటారా, రా రైస్ తీసుకుంటారా అనేది కేంద్రం బాధ్యత. MSP నిర్ణయించేది బియ్యానికి కాదు, ధాన్యానికి. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం మెలికలు పెట్టకూడదు. ఇది రైతుల జీవన్మరణ సమస్య. యాసంగిలో వరిని పంజాబ్ నుంచి కొన్నట్లే... తెలంగాణ నుంచి కూడా కేంద్రమే కొనుగోలు చేయాలి. అలా చేస్తే గోయల్ కు నేనే దండేసి దండం పెడతాను’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, CM KCR, Paddy, PADDY PROCUREMENT, Piyush Goyal, Telangana, Trs