పరిపాలనలో అతి కీలకంగా వ్యవహరించే ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇటీవల హడావుడిగా తీసుకొచ్చిన మార్పులపై బీజేపీయేతర పాలిత రాష్ట్రాలు గగ్గోలు పెడుతున్నాయి. ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ (1954) సవరణ పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, ఛత్తీస్ గఢ్ సీఎం భూపేష్ భగేల్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ఈ మేరకు కేంద్రం తీరుపై మండిపడుతూ లేఖలు రాశారు. తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సైతం ఈ జాబితాలో చేరారు. ఐఏఎస్ కేడర్ నిబంధనల సవరణను తీవ్రంగా నిరసిస్తూ సీఎం కేసీఆర్ సోమవారం రాత్రి ప్రధాని మోదీకి ఘాటు లేఖ రాశారు. ఆద్యాంతం పరుషపదజాలం, తీవ్ర వ్యతిరేకత నిండిన సీఎం కేసీఆర్ లేఖలోని ముఖ్యాంశాలపై సీఎం కార్యాలయం చేసిన ప్రకటనను యథాతథంగా ఇస్తున్నాం..
మోదీకి కేసీఆర్ లేఖలో ముఖ్యాంశాలు:
• ‘‘కేంద్రం చేపట్టిన ఆల్ ఇండియా సర్వీసెస్ (క్యాడర్) రూల్స్ 1954 ప్రతిపాదిత సవరణలు ఏ రకంగా చూసినా రాజ్యాంగ ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం.
• ఈ సవరణలు ఐఏఎస్, ఐపీఎస్ మరియు ఐఎఫ్ఎస్ ల పనితీరును, వారి ఉద్యోగ స్వరూపాన్ని పూర్తిగా మార్చివేసే విధంగా ఉన్నాయి.
• తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సవరణలను పూర్తిగా వ్యతిరేకిస్తున్నది.
• ఆయా రాష్ట్రాల్లో (ఆల్ ఇండియా సర్వీసెస్) ఏఐఎస్ అధికారులు నిర్వర్తించే క్లిష్టమైన ప్రత్యేక బాధ్యతల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతులు లేనిదే బదిలీపై కేంద్రం తీసుకోవడం ద్వారా రాష్ట్రాల పరిపాలనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది రాజ్యాంగ స్వరూపానికి మరియు సహకార సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు.
• ఈ సవరణల ద్వారా రాష్ట్రాలు గుర్తింపు లేకుండాపోయి నామమాత్రపు వ్యవస్థలుగానే మిగిలిపోయే ప్రమాదం ఉన్నది.
• ఈ ప్రతిపాదిత సవరణలు రాష్ట్రాల్లో పనిచేసే అధికారులపై పరోక్ష నియంత్రణను అమలుచేసే ఎత్తుగడ. కేంద్ర ప్రభుత్వ అధికారులను తన చెప్పుచేతల్లో ఉంచుకునేందుకే ఈ సవరణ. ఇది రాష్ట్ర ప్రభుత్వాల పరిపాలనలో కేంద్రం తలదూర్చడమే అవుతుంది.
• రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఏఐఎస్ అధికారులను బాధ్యులుగా, జవాబుదారులుగా చేయాల్సిందిపోయి..వారిని మరింత నిరుత్సాహానికి గురిచేయడం, కేంద్రం చేత వేధింపుల దిశగా ఈ సవరణ ఉసిగొల్పుతుంది.
• ఈ విధానం (ఆల్ ఇండియా సర్వీసెస్) ఏఐఎస్ అధికారుల ముందు రాష్ట్రాలను నిస్సహాయులుగా నిలబెడుతుంది.
• రాజ్యాంగంలోని ఆర్టికల్ 312 లోని నిబంధనల ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ 1951 చట్టాన్ని పార్లమెంటు చేసిందని, దాని ప్రకారం భారత ప్రభుత్వం పలు నిబంధనలను రూపొందించిందని నేను అంగీకరిస్తున్నాను.
కాని, రాష్ట్రాల ఆకాంక్షలను కాలరాసే విధంగా దేశ సమాఖ్య రాజనీతిని పలుచన చేసే దిశగా ఏఐఎస్ క్యాడర్ రూల్స్ (1954)కు రంగులద్దుతూ ఉద్దేశపూర్వకంగా చేసిన సవరణను నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాను.
• ఇది ఏఐఎస్ క్యాడర్ రూల్స్ 1954 సవరణ ఎంత మాత్రం కాదు. ఈ సవరణ కేంద్ర, రాష్ట్ర సంబంధాలకు సంబంధించి భారత రాజ్యాంగాన్ని సవరించడమే తప్ప మరోటి కాదు.
• (ఆల్ ఇండియా సర్వీసెస్) ఏఐఎస్ సవరణను ఇట్లా దొడ్డిదారిన కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ధైర్యముంటే పార్లమెంటు ప్రక్రియ ద్వారా సవరించాలి.
• రాష్ట్రాల ఆకాంక్షలకు విఘాతం కలుగకుండా ఉండాలంటే, రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకొన్న తర్వాతే రాజ్యాంగ సవరణలు చేపట్టాలనే నిబంధనను ఆర్టికల్ 368 (2) లో రాజ్యాంగ నిర్మాతలు ఎంతో దూరదృష్టితో పొందుపరిచారు.
• ఏఐఎస్ క్యాడర్ రూల్స్ (1954) సవరణల ద్వారా కేంద్రం రాజ్యాంగ స్ఫూర్తిని మంటగలపడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.
• ఈ సవరణ కేంద్ర, రాష్ట్రాల మధ్య ఉండే పరిపాలన పరమైన ఏఐఎస్ ఉద్యోగుల పరస్పర సర్దుబాటుకు గొడ్డలిపెట్టు.
• ఈ సవరణ ప్రతిపాదనలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలకు మరింత విఘాతం.
• (ఆల్ ఇండియా సర్వీసెస్) ఏఐఎస్ అధికారులను రాష్ట్రాల్లో సామరస్యతతో, చక్కని సమతుల్యతతో వినియోగించుకోవడానికి ప్రస్తుతం అమలులో ఉన్న ఏఐఎస్ క్యాడర్ రూల్స్ సరిపోతాయి. ఈ నేపథ్యంలో పరిపాలనా పరమైన పారదర్శకతను, రాజ్యాంగ సమాఖ్య రాజనీతిని కొనసాగించాలని, అందుకు ప్రస్తుతం కేంద్రం చేపట్టిన ప్రతిపాదిత సవరణలను నిలిపివేయాలని నేను కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాను ’’ అని సీఎం కేసీఆర్ లేఖలో పేర్కొన్నట్లు సీఎంవో తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.