దేశ ఐక్యతకు తోడ్పాటునిచ్చే విధంగా జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా రూపొందిస్తామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా కేంద్ర ప్రభుత్వ పథకాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. (TS CM KCR Comments On Centre Schemes) గ్రామాలకు కేంద్రమే నేరుగా నిధులు పంపడాన్ని తీవ్రంగా నిరసించిన ఆయన.. అన్నిటికి అన్ని పథకాలూ రాష్ట్రాల ద్వారానే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాలను నమ్మకుండా కేంద్రం నేరుగా గ్రామాలకు నిధులు ఇవ్వడం ద్వారా మహోన్నతమైన పంచాయితీ రాజ్ (Panchayati Raj) వ్యవస్థ కుంటుపడిపోతున్నదని సీఎం కేసీఆర్ (Telangana CM KCR) వాదించారు.
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలతోపాటు పలు కీలక అంశాలపై బుధవారం నాడు హైదరాబాద్ లోని ప్రగతి భవన్ వేదికగా సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆ సమావేశంలో అధికారులకు దిశానిర్దేశం చేస్తూ కేంద్రం అమలు చేస్తోన్న అన్ని పథకాలూ రాష్ట్రాల ద్వారానే జరగాలనే సంచలన వాదనను కేసీఆర్ తెరపైకి తెచ్చారు. కొంతకాలంగా పలు అంశాల్లో కేంద్రంపై పోరాడుతోన్న కేసీఆర్ ఈ సందర్భంలోనే ఇలాంటి సరికొత్త వాదనను తెరపైకి తేవడం వెనుక భారీ వ్యూహం ఉన్నట్లు చర్చ జరుగుతోంది..
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 20 నుంచి ప్రారంభం కానున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలు కోసం చేపట్టాల్సిన కార్యాచరణతో పాటు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠధామాలు, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణాలు, వరి ధాన్యం సేకరణ, జూన్ 2 రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల నిర్వహణ తదితర అంశాలకు సంబంధించి బుధవారం ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ సంచలన అంశాలను ప్రస్తావించారు. సీఎం కేసీఆర్ ఏం చెప్పారో ఆయన మాటల్లోనే..
‘‘పంచాయతీ రాజ్ వ్యవస్థలో మూడంచెల విధానం వచ్చిన తర్వాత నాటి రాజీవ్ గాంధీ నుంచి నేటి వరకు ప్రధాని పదవిలో ఉన్నవారు రాష్ట్రాలను నమ్మకుండా, కేంద్రమే నేరుగా పల్లెలకు నిధులు పంపడం చాలా చిల్లర వ్యవహారంగా ఉన్నది. జవహర్ రోజ్ గార్ యోజన, ప్రధాని గ్రామ సడక్ యోజన, నరేగా వంటి పథకాలను రాష్ట్రాల ద్వారా కాకుండా కేంద్రమే నేరుగా ఢిల్లీ నుంచి అమలు చేయాలనుకోవడం సమర్థనీయం కాదు.
రాష్ట్రాలలో నెలకొన్న స్థానిక పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాలకే తెలుస్తాయి. రోజువారి కూలీల డబ్బులు కూడా నేరుగా ఢిల్లీ నుంచి కేంద్రమే పంచాలనుకోవడం సరైన విధానం కాదు. 75 సంవత్సరాల అమృత మహోత్సవాల నేపథ్యంలో దేశంలో ఇంకా కరెంటు లేక పల్లెలు, పట్టణాలు చీకట్లలో మగ్గుతున్నాయి. త్రాగునీరు, సాగునీరు లేక ప్రజలు రోడ్ల మీదకు ఎక్కుతున్నారు. విద్య, వైద్యం అనేక రంగాలల్లో రావాల్సినంత ప్రగతి రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇటువంటి అంశాల మీద దృష్టి పెట్టకుండా, రాష్ట్రాల విధులలో జోక్యం చేసుకోవానుకోవడం సరికాదు..
ఎస్ కె డే గారు ప్రారంభించిన పంచాయతీ రాజ్ వ్యవస్థ ఒక ఉద్యమం. కానీ నేడు అందులో రాజకీయాలు ప్రవేశించి అవి అన్ని రకాలుగా పంచాయతీ రాజ్ స్ఫూర్తిని చంపేశాయి. దేశంలో ప్రారంభమైన సహకార ఉద్యమం కూడా కలుషితం అయింది. ఇటువంటి అరాచకమైన, నిర్లక్ష్యమైన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కానీ నేడు దేశ పర్యావరణం, పచ్చదనంలో భాగస్వామ్యం పంచుకోవడంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. తెలంగాణ వచ్చేనాటికి అస్తవ్యస్తంగా, యుద్ధవాతావరణంతో కూడుకొని ఉన్న గ్రామీణ మంచినీటి వ్యవస్థను ఇవ్వాల దేశం గర్వించేలా మిషన్ భగీరథ ద్వారా తీర్చిదిద్దుకున్నాం. ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీటిని అందిస్తున్న పరిస్థితి దేశంలోని మరే రాష్ట్రంలోనూ లేదు.
ఉమ్మడి రాష్ట్రంలో విధ్వంసం అనంతరం వ్యవస్థలను పునర్న్మించుకోవడం చాలా కష్టమైన పని. అన్ని కష్టాలను అధిగమించి మనం నేడు దేశం గర్వించే స్థాయిలో ధ్వంసమైన తెలంగాణ పల్లెలను, పట్టణాలను అభివృద్ధి చేసుకుంటున్నాం. అన్ని రంగాల్లో జరిగిన తెలంగాణ అభివృద్ధిని ఇటీవల కొన్ని జాతీయ మీడియా ఛానళ్ళు ప్రసారం చేశాయి. ఇది చూసిన ఇతర రాష్ట్రాల వారికి ఆశ్చర్యం కలిగింది. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి గురించి నాకు ఫోన్లు చేసి అడుగుతన్నారు. అంటే మనం అనతికాలంలో అనితర సాధ్యమైన అభివృద్ధిని సాధించాం. ఇందులో భాగస్వాములైన ప్రజా ప్రతినిధులను, ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను’’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Telangana, Union government