CM KCR: 1916 తరువాత ఇప్పుడే.. వరద బాధితులను ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్

Telangana: తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని సీఎం కేసీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాశారు.

news18-telugu
Updated: October 15, 2020, 8:03 PM IST
CM KCR: 1916 తరువాత ఇప్పుడే.. వరద బాధితులను ఆదుకుంటామన్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్(ఫైల్ ఫోటో)
  • Share this:
భారీ వర్షాలు, వరదల వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజలకు యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు అందించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ముంపునకు గురైన ప్రాంతాల ప్రజలకు కావల్సిన బియ్యం, పప్పుతో పాటు ఇతర నిత్యావసర సరుకులను, ఆహారాన్ని, ప్రతీ ఇంటికి మూడు చొప్పున రగ్గులను ప్రభుత్వ పక్షాన వెంటనే అందించాలని తెలిపారు. హైదరాబాద్ నగర పరిధిలో సహాయ కార్యక్రమాలు చేపట్టేందుకు తక్షణం జిహెచ్ఎంసికి 5 కోట్ల రూపాయలు విడుదల చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. జరుగుతున్న సహాయ, పునరావాస చర్యలను సమీక్షించారు. రాబోయే రోజుల్లో చేయాల్సిన పనులను నిర్దేశించారు. హైదరాబాద్ లో ఎక్కువ ప్రభావం ఉన్నందున జిహెచ్ఎంసిలో పరిస్థితిని చక్కదిద్దడంపై ప్రత్యేకంగా చర్చించి, పలు నిర్ణయాలు తీసుకున్నారు. ఇండ్లు పూర్తిగా కూలిపోయిన వారికి కొత్త ఇండ్లు మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇండ్ల మరమ్మత్తులకు ఆర్థిక సాయం అందిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. నాలాలపై కట్టిన ఇండ్లు కూడా కూలిపోయాయని, వాటి స్థానంలో ప్రభుత్వ స్థలంలో కొత్త ఇండ్ల నిర్మాణం జరుపుతామని స్పష్టం చేశారు.

లోతట్టు ప్రాంతాలు, అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించి, విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని సూచించారు. ఇక నుంచి అపార్టుమెంట్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చే సందర్భంలో వరద నీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా ఉండే ఏర్పాటు చేయాలనే నిబంధన పెట్టాలని సిఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలా చోట్ల చెరువుల ఎఫ్‌టిఎల్ పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల గురువారం నాటికి 50 మంది మరణించారని.. వారిలో జిహెచ్ఎంసి పరిధిలోని వారు 11 మంది ఉన్నారని అధికారులు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. జిహెచ్ఎంసిలో పరిధిలో 1916 తర్వాత ఒకేరోజు 31 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఇదే ప్రథమమని వెల్లడించారు. దీనివల్ల చాలా ప్రాంతాలు జలమయమయ్యాయని అన్నారు.

హైదరాబాద్ నగరంలో 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయని సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఎల్.బి. నగర్, చార్మినార్, సికింద్రాబాద్, ఖైరతాబాద్ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువుందని అన్నారు. వరదల కారణంగా విద్యుత్ శాఖకు దాదాపు 5 కోట్ల రూపాయలు, జల వనరుల శాఖకు రూ.50 కోట్లు, పంచాయతీ రాజ్ శాఖకు రూ.295 కోట్లు, ఆర్ అండ్ బి పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్ హైవేస్ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని సీఎం కేసీఆర్ తెలిపారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు సహాయంగా అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడికి సిఎం కేసీఆర్ లేఖ రాశారు. రైతులకు సహాయం అందించడానికి రూ.600 కోట్లు, జిహెచ్ఎంసితో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్లు సహాయం అందించాలని సిఎం కేసీఆర్ కేంద్రాన్ని కోరారు.
Published by: Kishore Akkaladevi
First published: October 15, 2020, 6:55 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading